• Home »
  • Cable »
  • ఎన్టీవీ ప్రసారాలు పునరుద్ధరించాలని ఎమ్మెస్వోలకు టిడిశాట్ ఆదేశం

ఎన్టీవీ ప్రసారాలు పునరుద్ధరించాలని ఎమ్మెస్వోలకు టిడిశాట్ ఆదేశం

ఎన్టీవీ న్యూస్ చానల్ ప్రసారాలు పునరుద్ధరించాలని, లేదా ఈ నెల 18 లోగా ఎన్టీవీ చేసిన ఆరోపణలమీద వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెస్వోలను టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) ఆదేశించింది. ఎన్టీవీ పెట్టుకున్న పిటిషన్ మీద విచారణకు ప్రతివాదులు హాజరుకాకపోవడంతో ఈ ఆదేశాలిస్తూ తరువాత విచారణను టిడిశాట్ ఈ నెల 18 కి వాయిదా వేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని కూడ టిడిశాట్ హెచ్చరించింది.

ఎమ్మెస్వోలు మాస్టర్ చానల్ కమ్యూనిటీ, సిటి గుంటూర్ డిజిటల్, విజయనగరం సిటి, శ్రీదేవ్ డిజిటల్ తమ ప్రసారాలు నిలిపివేశారంటూ ఎన్టీవీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి టిఅర్ ఎస్ ఎమ్మెల్యేకు హామీ ఇస్తున్నట్టు ఆడియో ప్రసారం చేయటం వల్లనే అధికార తెలుగుదేశం పార్టీ తమ చానల్ ప్రసారాలను నిలిపివేసేలా ఎమ్మెస్వోలమీద వత్తిడి తెచ్చిందంటూ ఎన్టీవీ ఆ ఫిర్యాదులో పేర్కొంది. జూన్ 16 నుంచి ప్రసారాలు ఆగిపోయిన విషయం తెలియజేస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఎన్టీవీ తరఫు న్యాయవాది టిడిశాట్ ను కోరారు.

అంతకుముందు ఎన్టీవీ ఇచ్చిన నోటీసులను ప్రతివాదులెవరూ తీసుకోలేదన్న విషయాన్ని కూడా చానల్ ట్రైబ్యునల్ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపామంటూ అఫిడవిట్ లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు కూడా నోటీసుకు పంపినట్టు తెలియజేసింది. నోటీసులు ఇచ్చినప్పటికీ మాస్టర్ చానల్ కమ్యూనిటీ , సిటి గుంటూర్ డిజిటల్, విజయనగరం సిటి, శ్రీదేవి డిజిటల్ అనే నాలుగు ఎమ్మెస్వో సంస్థల తరఫున ఎవరూ హాజరుకాలేదు.

ఇలా ఉండగా, ఈ కేసులో అనవసరంగా ట్రాయ్ ని కూడా లాగారని ట్రాయ్ తరఫు న్యాయవాది వైజ్ అలి నూర్ వాదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన ప్రేరణాసింగ్ తన వాదన వినిపిస్తూ, ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఏ సంబంధమూ లేదని. ఎన్టీవీ ప్రసారాలు ఆపవలసిందిగా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాజరాకేశ్వరి ఎంటర్టైన్మెంట్, ఎసిఎన్ కేబుల్ తరఫున హాజరైన పరుల్ బోస్ హాజరై, ఎన్టీవీ ప్రసారాలు నిలిపివేసిందీ, లేనిదీ చెప్పలేనని, మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించగలిగేదీ కూడా చెప్పలేనని అన్నారు.