• Home »
  • Cable »
  • చీరాల ఎమ్మెస్వో కి సిగ్నల్స్ ఇవ్వాలని బ్రాడ్ కాస్టర్లకు టిడిశాట్ ఆదేశం

చీరాల ఎమ్మెస్వో కి సిగ్నల్స్ ఇవ్వాలని బ్రాడ్ కాస్టర్లకు టిడిశాట్ ఆదేశం

పద్నాలుగు గ్రామపంచాయితీలకు విస్తరించిన చీరాల కేబుల్ నెట్ వర్క్ తో వెంటనే ఒప్పందం కుదుర్చుకొని ప్రసారాలు అందించాలని టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ నాలుగు తెలుగు టీవీ నెట్ వర్క్ లను ఆదేశించింది. ఈనాడు టెలివిజన్,మా టీవీ, జెమిని గ్రూప్ చానల్స్ అందించే సన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్, జ్ఈ తెలుగు చానల్ అందించే తాజ్ టీవీ ఈ ఉత్తర్వులందుకున్నాయి.

టిడిశాట్ చైర్మన్ జస్టిస్ అఫ్తాన్ ఆలం, సభ్యులు కుల్దీప్ సింగ్, బిబి శ్రీవాస్తవలతో కూడిన ట్రైబ్యునల్ ఈ ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు డిసెంబర్ 1న అడ్వకేట్ కమిషనర్ గా నియమితులైన తుషార్ సింగ్ చీరాల పట్టణ పరిసర గ్రామ పంచాయితీలలో పర్యటించి  సమర్పించిన సర్వే నివేదిక ట్రైబ్యునల్ పరిశీలించింది. చీరాల కేబుల్ నెట్ వర్క్ తన కనెక్టివిటీ నిరూపించుకోవాలంటూ ట్రైబ్యునల్ అడ్వకేట్ కమిషనర్ ను నియమించటం తెలిసిందే

ఆ సర్వే నివేదిక ప్రకారం చీరాల కేబుల్ నెట్ వర్క్ కు ఆ ప్రాంతంలో 2,150 కనెక్షన్లు ఉన్నాయి. నెట్ వర్క్ యజమాని ఒక్కో గ్రామంలో తన కనెక్షన్స్ గా సమర్పించిన జాబితా నుంచి పదేసి ఇళ్లకు, జాబితాలో లేని పదేసి ఇళ్ళకు వెళ్ళిన అడ్వకేట్ కమిషనర్ తన పరిశీలనలు నమోదు చేశారు. జాబితాలో లేని 150 ఇళ్ళలో నాలుగైదు చోట్ల కూడా కనెక్షన్లుండటంతో కనెక్టివిటీని ట్రైబ్యునల్ 2.5 శాతం పెంచింది.

బ్రాడ్ కాస్టర్లు రెండువారాల్లోగా చీరాల కేబుల్ నెట్ వర్క్ తో అగ్రిమెంట్లు చేసుకోవటంతోబాటు ఆ వెనువెంటనే సిగ్నల్స్ ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. చీరాల కేబుల్ నెట్ వర్క్ దాఖలు చేసిన నాలుగు పిటిషన్లను కలిపి తీర్పు వెలువరిస్తూ, ఒప్పందం చేసుకునే సమయానికి కనెక్టివిటీ పెరిగినా, నిబంధనల ప్రకారమే మార్పులు జరగాలని కూడా ఆదేశించారు.  నెట్ వర్క్ కు 2081 కనెక్షన్లున్నట్టు జనవరి 7 న అందిన నివేదికకు ట్రైబ్యునల్ ఆమోద ముద్ర వేసింది.

అడ్వకేట్ కమిషనర్ అందజేసిన సవివరమైన నివేదిక వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించినట్టు ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. అందువలన 14 పంచాయితీలలో కనెక్షన్లున్నాయన్న  పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తున్నట్టు పేర్కొంది. పిటిషనర్ పేర్కొనని 5 ఇళ్ళలో కూడా పిటిషనర్ సిగ్నల్స్ వస్తుండటాన్ని  కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం సగటున 2.5 శాతం ఇళ్ళకు అదనంగా కనెక్షన్లున్నట్టు అర్థమవుతోందని అభిప్రాయపడింది. అందుకే మొత్తం కనెక్టివిటీని 2081 కి బదులుగా 2,150 ఉన్నట్టు తేల్చింది.

అడ్వకేట్ కమిషనర్ తన ఖర్చుల వివరాలను బ్రాడ్ కాస్టర్ల తరఫు న్యాయవాది బి. ఎస్. సాయికి అందించాలని, వారు నిష్పత్తి ప్రకారం ఆ ఖర్చులు భరించాలని. 10 రోజుల్లోగా చెల్లింపులు జరపాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.