• Home »
  • Cable »
  • ఆపరేటర్ ను అడ్వాన్స్ అడిగిన సన్ గ్రూప్ పంపిణీ సంస్థ మీద టిడిశాట్ ఆగ్రహం

ఆపరేటర్ ను అడ్వాన్స్ అడిగిన సన్ గ్రూప్ పంపిణీ సంస్థ మీద టిడిశాట్ ఆగ్రహం

అడ్వాన్స్ చెల్లించకపోతే సిగ్నల్స్ నిలిపివేస్తామని స్థానిక కేబుల్ ఆపరేటర్ ను తెగేసి చెప్పిన సన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ మీద టిడిశాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభు కేబుల్ నెట్ వర్క్ పేరుతో కేబుల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆపరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మీద తీవ్రంగా స్పందించిన టిడిశాట్ ఈ విషయంలో వివరణ కోరుతూ సన్ డిస్ట్రిబ్యూషన్ కు షో కాజ్ నోటీస్ జారీచేసింది. సిగ్నల్స్ నిరాకరించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని కోరింది.

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ )  చట్టంలోని సెక్షన్ 20 కింద చర్యలు తీసుకునే వీలున్నదని టిడిశాట్ చైర్మన్ అఫ్తాబ్ ఆలమ్, సభ్యులు కుల్దీప్ సింగ్, బిబి శ్రీవాస్తవ పేర్కొన్నారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 2 వ తేదీకి వాయిదా వేశారు. నిజానికి జులై 6 న, ఆగస్టు 4 న కూడా టిడిశాట్ ఆదేశించినప్పటికీ సన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సిగ్నల్స్ ఇవ్వకపోవటంతో టిడిశాట్ ఈ చర్య తీసుకుంది.

అయితే, సన్ వాదన భిన్నంగా ఉంది. ఆ ఆపరేటర్ కార్యకలాపాలు నిర్వహించే ప్రదేశం డిజిటైజ్ అయిన ప్రాంతం కాదని, 2016 జనవరి 1నుంచి మాత్రమే డిజిటైజేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ప్రస్తుత ఒప్పందం నాలుగున్నర నెలలు మాత్రమే ఉంటుందని చెబుతోంది. అందుకే ఈ నాలుగున్నర నెలలకు, అంటే డిసెంబర్ 31 వరకు చందా మొత్తం చెల్లించి ఒప్పందం చేసుకోవాలని, అప్పుడే సిగ్నల్స్ ఇస్తామని చెప్పనంటోంది.
అయితే, సిగ్నల్స్ ఇవ్వటానికి అడ్వాన్స్ మొత్తం ఇమ్మని షరతు విధించటం ట్రైబ్యునల్ ఆదేశాలకు విరుధమని టిడిశాట్ ఆక్షేపించింది. అలా నిబంధనలు విధించే అధికారం సన్ కు లేదని స్పష్టం చేసింది. ఇది అర్థరహితమైన నిబంధనే కాకుండా, ఇంటర్ కనెక్ట్ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్టే అవుతుందని టిడిశాట్ వ్యాఖ్యానించింది.