• Home »
  • Cable »
  • కాకినాడ శ్రీ మారుతీ డిజిటల్ తో ఒప్పందం చేసుకొండి : ఈటీవీ కి టిడిశాట్ ఆదేశం

కాకినాడ శ్రీ మారుతీ డిజిటల్ తో ఒప్పందం చేసుకొండి : ఈటీవీ కి టిడిశాట్ ఆదేశం

కాకినాడ ప్రాంతానికి ఎమ్మెస్వోగా కార్యకాలాపాలు సాగిస్తున్న శ్రీ మారుతీ డిజిటల్ సంస్థ రాత్రికి రాత్రి బిచాణా ఎత్తివేయవచ్చునన్న ఈటీవీ వాదనను టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ ( టిడిశాట్ ) తోసిపుచ్చింది. సిగ్నల్స్ ఇవ్వటానికి ఒప్పందం చేసుకోవటానికి నిరాకరిస్తున్న ఈటీవీ మీద శ్రీ మారుతీ డిజిటల్ నెట్ వర్క్ సంస్థ చేసిన ఫిర్యాదు మీద టిడిశాట్ సానుకూలంగా స్పందించింది.

ఈటీవీ సంస్థ తన ప్రతినిధిని శ్రీ మారుతీ డిజిటల్ నెట్ వర్క్ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న కాకినాడకు పంపాలని, అక్కడే ఎమ్మెస్వో తో కలిసి ఉమ్మడిగా శాంపిల్ సర్వే చేపట్టాలని టిడిశాట్ ఆదేశించింది. ఈ సర్వే పూర్తయ్యాక ఆ నివేదిక ఆధారంగా ఇరుపక్షాలూ ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించింది. తదుపరి విచారణ నవంబర్ 4 న చేపడతామని చెప్పింది.

డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్స్ లైసెన్స్ కోసం పిటిషనర్ పెట్టుకున్న దరఖాస్తును ఎమ్మెస్వో తరఫు న్యాయవాది ట్రైబ్యునల్ లో చూపించగా శ్రీమారుతీ డిజిటల్ నెట్ వర్క్ ఈ వ్యాపారంలోనే కొనసాగాలనుకుంటున్న దనటానికి అదే నిదర్శనమని ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. ఇంటర్ కనెక్ట్ ఒప్పందం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్టు ఈటీవీ ట్రైబ్యునల్ కి తెలియజేయటంతో ఉమ్మడి సర్వే అక్టోబర్ 20 లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.