• Home »
  • Cable »
  • సెట్ టాప్ బాక్సులు మార్చేస్తే ఎమ్మెస్వో మారినట్టే : ఫిరాయింపుల మీద ఫిర్యాదులు

సెట్ టాప్ బాక్సులు మార్చేస్తే ఎమ్మెస్వో మారినట్టే : ఫిరాయింపుల మీద ఫిర్యాదులు

ఖరీదైన డిజిటైజేషన్ వ్యవహారంలో లాభాల వేట మొదలవుతుంది కాబట్టి కనెక్షన్ల కొనుగోలు వ్యాపారం జోరందుకుంటుందన్న అనుమానాలు నిజమయ్యాయి. కేబుల్ ఆపరేటర్లకు వలవేసి తమవైపు ఆకర్షించుకునేందుకు ఎమ్మెస్వోలు భారీ మొత్తంలో ఆశలు చూపిస్తారన్న విషయాన్ని ట్రాయ్ గ్రహించకపోవటం వల్ల ఇప్పుడు  అనారోగ్యకరమైన పోటీ మొదలైంది. డిజిటైజేషన్ చట్టంలో తగిన నియమనిబంధనలు లేకపోవటమే ఈ అనర్థాలకు కారణం.

ఒక ఎమ్మెస్వో పరిధిలోని ఆపరేటర్లను మరో ఎమ్మెస్వో అహ్వానిస్తున్నాడు. పాత ఎమ్మెస్వోకు బకాయిలు ఇవ్వకుండా ఉండేందుకు కూడా కొంతమంది ఆపరేటర్లు మారటానికి మొగ్గుచూపుతున్నారు. తాత్కాలిక లబ్ధికోసం ఇలా మారటం పరిశ్రమకు మంచిది కాదన్నది కొంతమంది నిపుణుల అభిప్రాయమైతే, ఎమ్మెస్వోల మధ్య పోటీ వలన ఆపరేటర్లు లాభపడే అవకాశం రావటం మంచిదేనన్నది మరికొందరి వాదన.

ఒక ఎమ్మెస్వో పరిధిలో సెట్ టాప్ బాక్సులను వెనక్కి తీసుకొని, కొత్త ఎమ్మెస్వో సెట్ టాప్ బాక్స్ పెడితే ఆ కనెక్షన్ కొత్త ఎమ్మెస్వో సొంత మవుతుంది. ఎలాగూ తాను సొంత ఖర్చుతో బాక్స్ కొని ఇస్తున్నాడు కాబట్టి ఆ పాత బాక్స్ తనే తీసుకొని కనబడకుండా దాచేస్తాడు. అ విధంగా గుట్టు చప్పుడు కాకుండా కనెక్షన్ మీద యాజమాన్యం మారిపోతుంది. ఇంకా విచిత్రమేంటంటే, వినియోగదారుడికి ఏ మాత్రం సంబంధం లేకుండానే సర్వీస్ ప్రొవైడర్ మారిపోతాడు.

కొంతకాలంగా ఇలాంటి ఘటనలు చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నప్పటికీ ఇప్పుడు  తాజాగా పాట్నా కు చెందిన ఎమ్మెస్వో “ సిటీ మౌర్య కేబుల్ నెట్ వర్క్ “ చేసిన ఫిర్యాదుతో టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ (టిడిశాట్) ముందుకు కదిలింది. తన పరిధిలోని కేబుల్ ఆపరేటర్లు మరో ఎమ్మెస్వో తరలించుకుపోతున్నాడనేది సైటీ మౌర్య ఫిర్యాదు. ఈ తరహా పరిణామాలు దేశ వ్యాప్తంగా ఎంత ప్రభావం చూపుతాయో గ్రహించిన టిడిశాట్ వెంటనే ఒక అడ్వకేట్ కమిషనర్ ను నియమించింది.

ఎమ్మెస్వో స్వయంగా సిగ్నల్స్ నిలిపివేసినట్టు కేబుల్ ఆపరేటర్ డికె క్లాసిక్ టిడిశాట్ కు చెప్పగా ఎమ్మెస్వో మాత్రం కేబుల్ ఆపరేటర్ తనకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, సెట్ టాప్ బాక్సులు కూడా తిరిగి ఇవ్వకుండా స్విచాఫ్ చేసినట్టు ఆరోపించారు. ఎమ్మెస్వో సిటీ మౌర్య సిగ్నల్స్ ఆపేయటం వల్లనే మరో ఎమ్మెస్వోను ఆశ్రయించాల్సి వచ్చిందని కూడా టిడిశాట్ కు చెప్పుకున్నారు. దీంతో అడ్వకేట్ కమిషనర్ చేత విచారణ జరిపించాలని టిడిశాట్ నిర్ణయించింది.

అడ్వకేట్ కమిషనర్ డిగ్గీ పాఠక్ ఇప్పుడు పాట్నా వెళ్ళి తన విచారణ ప్రారంభిస్తారు. ముందుగా ఆయనకు డి.కె. క్లాసిక్ అనే ఒక కేబుల్ ఆపరేటర్ పరిధిలో ఉన్న కనెక్షన్ల జాబితా అందజేస్తారు. అకస్మాత్తుగా ఆయన పాట్నా వెళ్ళి ఎమ్మెస్వో, ఆపరేటర్ ప్రతినిధులను పిలిపించి కొంతమంది చందాదారుల ఇళ్ళను సందర్శిస్తారు. పిటిషనర్ సెట్ టాప్ బాక్సులు అక్కడ పనిచేస్తున్నదీ లేనిదీ తనిఖీ చేస్తారు. ఒకవేళ అవి స్విచాఫ్ చేసి ఉంటే, ఎప్పటినుంచి స్విచాఫ్ అయిందీ తెలుసుకుంటారు.  అది ఎమ్మెస్వో వైపు నుంచి జరిగిందా, ఆపరేటర్ వైపు నుంచి జరిగిందా అనేది కూడా నిర్థారించుకుంటారు.

అడ్వకేట్ కమిషన్ కి వాస్తవంగా అయినఖర్చులు కాకుండా రోజుకు 15 వేల రూపాయల చొప్పున చెల్లిస్తారు. ఈ ఖర్చును ఫిర్యాదు చేసిన ఎమ్మెస్వో, ప్రతివాది అయిన కేబుల్ ఆపరేటర్ సమానంగా భరించాలి. అడ్వకేట్ కమిషన్ నివేదిక ఆధారంగా సెప్టెంబర్ 3న విచారణ జరుగుతుంది.