• Home »
  • Cable »
  • స్టార్ సినిమా బజ్ రంగి భాయిజాన్ ప్రసారం: డెన్ మీద టిడిశాట్ ఆగ్రహం

స్టార్ సినిమా బజ్ రంగి భాయిజాన్ ప్రసారం: డెన్ మీద టిడిశాట్ ఆగ్రహం

ప్రసార హక్కులున్న స్టార్ ఇండియా అనుమతి లేకుండా బజ్ రంగి భాయిజాన్ చిత్రాన్ని తన కేబుల్ చానల్ లో ప్రసారం చేసినందుకు డెన్ నెట్ వర్క్స్ మీద టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పైరసీ కిందికి వస్తుందని స్పష్టం చేసింది. స్టార్ ఇండియా చానల్స్ ఏవీ ప్రసారం చేయకూడదని. ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. సిగ్నల్ పైరసీకి పాలడిన అభియోగం మీద నష్టపరిహారం కోరే హక్కు కూడా స్టార్ ఇండియాకు ఉంటుందని టిడిశాట్ వెల్లడించింది.

ఇటీవలే స్టార్ గోల్డ్ లో ప్రసారమైన సల్మాన్ ఖాన్ చిత్రం బజ్ రంగి భాయిజాన్ ను డెన్ నెట్ వర్క్ లో ప్రసారం చేయటం ద్వారా డెన్ సిగ్నల్ పైరసీకి పాల్పడిందంటూ స్టార్ ఇండియా ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో డెన్ నెట్ వర్క్ తన సమాధానాన్ని తెలియజేయాలని డెన్ తరఫు న్యాయవాది అభయ్ చటోపాధ్యాయని టిడిశాట్ ఆదేశించింది. స్టార్ గోల్డ్ ను తాము కేవలం అ లా కార్టే విధానంలో మాత్రమే అందిస్తుండగా ఆ నిబంధనకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతీ లేకుండా డెన్ తన సొంత కేబుల్ చానల్ డెన్ సినిమా లో ఆ చిత్రాన్ని ప్రసారం చేయటం అక్రమమే అవుతుందని స్టార్ ఇండియా తన ఫిర్యాదులో పేర్కొంది.

స్టార్ ఇండియా తన వాదనలను బలపరచే వీడియోలు, స్క్రీన్ షాట్స్ టిడిశాట్ కు అందజేసింది. దీంతో తన క్లయింట్ అయిన ఎమ్మెస్వోతో చర్చించి సమాధానమిస్తానని డెన్ తరఫు న్యాయవాది టిడిశాట్ కు చెప్పారు. డెన్ చేస్తున్న పనులు క్రిమినల్ చర్యలుగా పరిగణించవలసి వస్తుందని టిడిశాట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మరో వైపు ఈ కేసుతో సంబంధం లేకుండా డెన్ కి హెచ్ డి చానల్స్ మినహా మిగతా సిగ్నల్స్ వీలైతే అదే రోజున ఇవ్వాలని స్టార్ ఇండియాని టిడిశాట్ ఆదేశించింది. అదే విధంగా డెన్ కూడా వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. స్టార్ తన చానల్స్ నిలిపి వేసిందంటూ డెన్ తొలుత టిడిశాట్ ను ఆశ్రయించింది. అయితే స్టార్ ఇండియాకు బకాయి పడిన మొత్తం రూ. 24 కోట్ల 50 లక్షలు వెంటనే చెల్లించాలని టిడిశాట్ ఆదేశించింది.