• Home »
  • Cable »
  • ఎమ్మెస్వో గుత్తాధిపత్యం మీద ట్రాయ్ ని ప్రశ్నించిన టిడిశాట్

ఎమ్మెస్వో గుత్తాధిపత్యం మీద ట్రాయ్ ని ప్రశ్నించిన టిడిశాట్

“ మా ప్రాంతంలో ఉన్న ఎమ్మెస్వో నాకు సిగ్నల్స్ ఇవ్వటం లేదు. దయచేసి నాకు సిగ్నల్స్ ఇచ్చేలా ఆదేశించండి”  ఒక కేబుల్ ఆపరేటర్ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ టైబ్యునల్ (టిడిశాట్ ) కు మొరపెట్టుకున్న వైనం ఇది. అదేంటి, ఒక ఎమ్మెస్వో కాకపోతే మరో ఎమ్మెస్వో దగ్గరకు వెళ్ళాలిగాని ఫలానా ఎమ్మెస్వో నుంచి మాత్రమే తీసుకుంటానని పట్టుబట్టి ఇక్కడి దాకా రావటమేంటన్నది టిడిశాట్ కి అర్థం కాని ప్రశ్న. తీరా అదే మాట ఆపరేటర్ ని అడిగితే, “ అయ్యా, మా ప్రాంతంలో ఒకే ఎమ్మెస్వో ఉన్నాడు. గుత్తాధిపత్యం కాబట్టి నేను చచ్చినట్టు అక్కడినుంచే సిగ్నల్స్ తీసుకోవాలి. తప్పనిసరిగా ఆ ఎమ్మెస్వో చెప్పిన ధరకే తీసుకోవాలి. అయినా సరే ఇవ్వనంటున్నాడు “ అంటూ సమాధానం వచ్చింది.

సరే, చూద్దాం అనుకున్న టిడిశాట్ ఆ ఎమ్మెస్వోను అడిగింది. “ మీ ప్రాంతంలో ఒక కేబుల్ ఆపరేటర్ సిగ్నల్స్ అడిగితే ఇవ్వనని చెప్పే హక్కు లేదు గదా,ఎలాంటి వివక్షా చూపించకూడదన్న నిబంధన కూడా ఉంది కదా “ అని. అందుకు ఆ ఎమ్మెస్వో ఇచ్చిన సమాధానం “ నేను సిగ్నల్స్ ఇవ్వనని అనటం లేదు. డిజిటల్ సిగ్నల్స్ మాత్రమే ఇస్తాను. అనలాగ్ సిగ్నల్స్ ఇవ్వను. ఆ కేబుల్ ఆపరేటర్ మూడో దశ డిజిటైజేషన్ లో ఉన్నాడా, నాలుగో దశలో ఉన్నాడా అన్నది నాకనవసరం. నా దగ్గర నుంచి సిగ్నల్స్ తీసుకోవాలంటే నేనిచ్చే డిజిటల్ సిగ్నల్ మాత్రమే తీసుకోవాలి. అతని ప్రాంతంలో ప్రతి ఇంట్లో సెట్ టాప్ బాక్స్ ఉండాల్సిందే. అనలాగ్ అడిగాడు. ఇవ్వలేనని చెప్పేశా” అని.

ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు ? ఇంకా డిజిటైజేషన్ పూర్తి కాని నాలుగో దశలో ఉన్నప్పుడు ఆ కేబుల్ ఆప్రేటర్ అనలాగ్ సిగ్నల్స్ ఇచ్చే హక్కుంది. చందాదారులు కూడా అనలాగ్ సిగ్నల్స్ ఇమ్మని డిమాండ్ చేసే హక్కుంది. మరి ఆ కేబుల్ ఆపరేటర్ కు అనలాగ్ సిగ్నల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదా? డిజిటైజేషన్ పూర్తయిన ఇళ్ళకు డిజితల్ సిగ్నల్స్, అనలాగ్ ప్రాంతాలకు అనలాగ్ సిగ్నల్స్ ఇచ్చుకొవటానికి ఎమ్మెస్వోలకు వెసులుబాటు ఉన్నమాట నిజం. అయితే, కచ్చితంగా ఇచ్చి తీరాలనే నిబంధన ఉన్నదా? ఒకవేళ ఒక ఎమ్మెస్వో ఇవ్వని పక్షంలో మరో ఎమ్మెస్వోను ఆశ్రయించటానికి అక్కడ ఒకే ఎమ్మెస్వో గుత్తాధిపత్యం ఉంది. ఇలాంటి గుత్తాధిపత్యాలకు అడ్డుకట్టవేయలేకపోవటం టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) వైఫల్యంగానే భావించాలా ? ఇదీ ఇప్పుడు టిడిశాట్ కి వచ్చిన అనుమానం. అదే ప్రశ్నను ట్రాయ్ కి సంధించింది.

ఇక అసలు విషయంలోకి వస్తే ఇది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన కేసు. మాల్వా కేబుల్ ఆపరేటర్లకు అనలాగ్ సిగ్నల్స్ కావాలి. కానీ అక్కడ ఫాస్ట్ వే ట్రాన్స్ మిషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది గుతాధిపత్యం చెలాయిస్తున్న ఎమ్మెస్వో. దీంతో మాల్వా కేబుల్ ఆపరేటర్స్ సంఘర్ష్ కమిటీ ( మాల్వా కేబుల్ ఆపరేటర్ల పోరాట సంఘం ) టిడిశాట్ లో ఒక పిటిషన్ వేసింది. అంతా పరిశీలించిన ట్రైబ్యునల్ “ పిటిషనర్ కు ఎలాంటి సాయమూ చేయగలిగే పరిస్థితిలో లేం. న దగ్గర లేనిది నేనెలా ఇవ్వగలనని ఎమ్మెస్వో అంటున్నాడు. ప్రత్యేకంగా అనలాగ్ సిగ్నల్స్ కోసం మరో కంట్రోల్ రూమ్ నడపాల్సిందేననీ చెప్పలేం. ఇంకొకరి దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకోవటం లేదు కాబట్టి ఆ ఎమ్మెస్వోకి ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేం. అసలు పంజాబ్ లోనే ఎవరికీ అనలాగ్ సిగ్నల్స్ ఇవ్వటం లేదంటున్నారు. రాష్ట్రంలో అందరు కేబుల్ ఆపరేటర్లకిస్తున్నట్టే అదే రేట్ కార్డ్ ప్రకారం ఇస్తామని కూడా చెబుతున్నారు కాబట్టి వివక్ష చూపుతున్నారని అనటానికీ వీల్లేదిక్కడ.” అని వ్యాఖ్యానించింది.

ఈ పరిస్థితుల్లో టిడిశాట్ అనేకాంశాలను ట్రాయ్ ముందుంచింది. ఏ ఎమ్మెస్వో అయినా ఒక కేబుల్ ఆపరేటర్ అడిగినప్పుడు సిగ్నల్స్ ఇచ్చి తీరాలన్న నియమాన్ని, ఎలాంటి వివక్షా చూపకుండా ఇతర ఆపరేటర్లకు ఇచ్చిన ధరకే ఇవ్వాలన్న నియమాన్ని విడివిడిగా కాకుండా ఉమ్మడిగా అమలు చేయించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరింది. ఒక ఎమ్మెస్వో డిజిటైజేషన్ కిందికి మారినప్పుడు తన పరిధిలో ఉన్న అనలాగ్ సిగ్నల్స్ పంపిణీదారులైన ఆపరేటర్లను పట్టించుకోకపోతే “సిగ్నల్స్ ఇచ్చి తీరాలి” అనే నిబంధనకు గండి కొట్టినట్టే కదా? అని కూడా ట్రైబ్యునల్ అడిగింది.  అదే విధంగా డిజిటైజేషన్ ఇంకా అమలుకావటానికి గడువు ఉన్నచోట కూడా బలవంతంగా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించింది.

మొత్తంగా చూస్తే ఇలాంటి గుత్తాధిపత్యాలు ఉండటం వల్లనే కేబుల్ ఆపరేటర్లు గాని, వారి పరిధిలోని చందాదారులుగాని అలాంటి ఎమ్మెస్వోల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తున్నదని, ఈ పరిస్థితి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ట్రాయ్ ని ట్రైబ్యునల్  కోరింది. టిడిశాట్ చైర్మన్ అఫ్తాబ్ ఆలం, సభ్యులు బిబి శ్రీవాస్తవ, కుల్దీప్ సింగ్ ఈ మేరకు ట్రాయ్ కి ఆదేశాలు జారీచేశారు.