• Home »
  • Cable »
  • బ్రైట్ వే లో వాటాదారుణ్ణి మాత్రమే, నెక్స్ట్ డిజిటల్ మాకు పోటీ కాదు : సుభాష్ రెడ్డి

బ్రైట్ వే లో వాటాదారుణ్ణి మాత్రమే, నెక్స్ట్ డిజిటల్ మాకు పోటీ కాదు : సుభాష్ రెడ్డి

తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షునిగా ఉన్న సుభాష్ రెడ్డి తన సహచర ఎమ్మెస్వోలతో చర్చించి బ్రైట్ వే కమ్యూనికేషన్స్ ను ఉమ్మడి ప్రయోజనాలకోసమే ఉపయోగించాలని నిర్ణయించారు.  సహకార విధానాన్ని తలపించేలా రూపొందించిన ఈ కాన్సెప్ట్ మీద ఆయనతో ఇంటర్వ్యూ సంక్షిప్తంగా:..

ఉమ్మడి హెడ్ ఎండ్ ఆలోచన ఎలా వచ్చింది?

సమస్యలో నుంచి వచ్చిన పరిష్కారమిది. ఎమ్మెస్వోల వ్యాపారం కాపాడుకోవాల్సిన అవసరముంది. కార్పొరేట్ ఎమ్మెస్వోల చేతుల్లోకి వెళితే ఇక వ్యాపారం ఉండదు. ఒకవైపు అందరికీ ఈ విషయాన్ని వివరిస్తూనే మరోవైపు లైసెన్స్ కి దరఖాస్తు చేసి చాలమంది ఎమ్మెస్వోలకు ఈ కాన్సెప్ట్ వివరించాను. చాలామంది పెట్టుబడి పెట్టి మొదలుపెడదామంటూ ముందుకొచ్చారు. చిన్నా చితకా హెడ్ ఎండ్ పెట్టి ఇబ్బందులు పడే కంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగినట్టే ఉండాలనుకున్నాం. ఎంతో పరిశోధన చేశాం. ఎన్నో చోట్ల హెడ్ ఎండ్స్ చూసి వచ్చాం. అన్ని విధాలా సంతృప్తి చెందిన తరువాతనే ఎరిక్ సన్ హెడ్ ఎండ్ ఎంచుకున్నాం.

మీరు స్వయంగా ఒక పెద్ద ఎమ్మెస్వో అయి ఉండి మీరు ఆహ్వానిస్తుంటే మీతో చేరటానికి వెనకడుగేసే అవకాశం లేదా?

నిజమే. కానీ ఎవరినీ వచ్చి నా ఎమ్మెస్వో లో చేరమని అడగ లేదు. నిజానికి నేనే ఆదర్శంగా ఉండాలని నా ఎమ్మెస్వోను కూడా కంపెనీలో భాగస్వామిని చేశా. అందరినీ అదే పద్ధతి పాటించవలసిందిగా అడుగుతున్నా. అందుకే ఇందులో ఎలాంటి అనుమానాలకూ ఆస్కారం లేదు. ఇంతకంటే సులువైన, లాభదాయకమైన, రిస్క్ లేని విధానాన్ని ఏ కార్పొరేట్ ఎమ్మెస్వో కూడా ఇవ్వటం సాధ్యం కానే కాదు. మొదటి నుంచీ ఈ వ్యాపారంలో ఉండటం వలన, ఎమ్మెస్వోల కష్ట నష్టాలు తెలియటం వలన వాళ్ళకు నష్టం కలగని విధంగా ఈ పద్ధతిని ఎంపిక చేశాం.

ఎమ్మెస్వోలతో ఒప్పందాలు పూర్తయ్యాయా?

ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పటినుంచీ కలిసి పనిచేస్తున్న దాదాపు పదిమంది ఎలాగూ ఇప్పటికే ఉన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున దూర ప్రాంతాల నుంచి ఎమ్మెస్వోలు వచ్చి ఇందులో భాగస్వాములు కావటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా అందరికీ న్యాయబద్ధంగా ఉండేలా ఒప్పందపత్రాలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఒప్పందాలు జరుగుతాయి. ఈ లోపు హెడ్ ఎండ్ పనితీరు కూడా చూసి సంతృప్తి చెందుతారనే నమ్మకముంది.

దూరప్రాంతాలకు ఎలా పంపుతారు ?

బ్రాడ్ బాండ్ ద్వారా ఎమ్మెస్వో పాయింట్ దాకా పంపుతాం. రిలయెన్స్, ఎయిర్ టెల్ సంస్థలతో చర్చలు జరిపాం. ఏ సర్వీస్ ప్రొవైడర్ ని ఎంచుకోవాలనేది ఆ ఎమ్మెస్వో ఇష్టానికే వదిలేస్తున్నాం. ధర, సర్వీసు నాణ్యత ఆధారంగా ఎమ్మెస్వోలు ఎంచుకోవచ్చు.

కార్పొరేట్ ఎమ్మెస్వోలు తెలంగాణ జిల్లాల్లో రావటాన్ని అడ్డుకుంటున్నారా?

కార్పొరేట్ ఎమ్మెస్వోలను మేం అడ్డుకున్నామనటం సరికాదు. అలా అడ్డుకుంటే రాష్ట్రంలో కార్పొరేట్ ఎమ్మెస్వోలే ఉండేవారు కాదు గదా. ఎవరి వ్యాపారం వాళ్ళది. కానీ వ్యాపారానికి బదులు దౌర్జన్యం చేయాలనో , అనైతికంగా ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య చిచ్చుపెట్టి ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి మోసం చేయాలనో ప్రయత్నిస్తే మాత్రం కచ్చితంగా అడ్డుకుంటాం. దొడ్డి దారిన బాక్సులిచ్చి మా ఆపరేటర్లను మా ఎమ్మెస్వోల మీదికి ఉసిగొల్పటం లాంటివి సహించం. ఒకవైపు నాలుగు వందలచొప్పున ఒక్కో చందాదారుడి నుంచి వసూలు చేస్తూ, కొత్తగా ఆపరేటర్లను లోబరచుకోవటానికి తాత్కాలికంగా యాభై రూపాయలకూ, వంద రూపాయలకూ ఇస్తామని మోసం చేయబోతే అమాయకంగా మోసపోయే ప్రసక్తే లేదు. మా ఎమ్మెస్వోల ప్రయోజనాలకు, మా కేబుల్ ఆపరేటర్ల ప్రయోజనాలకూ, మా చందాదారుల ప్రయోజనాలకూ వ్యతిరేకంగా చేసే ఏ కుట్రనైనా అడ్డుకొని తీరతాం. అందులో అనుమానమే లేదు.

హిందుజా హిట్స్ మీద మీ అభిప్రాయమేంటి ?

అదొక టెక్నాలజీ. టెక్నాలజీని ఎవరూ అడ్డుకోకూడదు. అడ్డుకోవటం సాధ్యం కూడా కాదు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. నిజానికి అది కూడా ఒక కార్పొరేట్ ఎమ్మెస్వో. ఆ మాటకొస్తే మిగిలిన కార్పొరేట్ ఎమ్మెస్వోలకంటే చాలా పెద్దది. దాని వ్యాపార ప్రయోజనాలకోసం అది చెప్పే మాటలు అది చెబుతుంది.

మీకు ప్రధాన పోటీదారు నెక్స్ట్ డిజిటల్ అవుతుందా?

పోటీ అంటూ ఏమీలేదు. తెలంగాణలో దాదాపు కోటి కనెక్షన్లుంటాయని అంచనా. ఎమ్మెస్వోలకు న్యాయబద్ధంగా సేవలందించటానికి సిద్ధంగా ఉన్నాం.  ఎంతమంది అర్థం చేసుకొని రాగలిగితే ఉమ్మడి ప్రయోజనాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్ డిజిటల్ అంటారా.. అది గద్దలా దూసుకుపోతుందని వాళ్ళే చెప్పుకున్నారుగా. మేం కోడి పిల్లల్ని కోడి కాపాడినట్టు మా ఎమ్మెస్వోలను కాపాడుతామంటున్నాం. వాళ్ళేమో గద్దలా ఎగరేసుకుపోతా మంటున్నారు. చూద్దాం ఎమ్మెస్వోలు ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో.

కార్పొరేట్ ఎమ్మెస్వోల నుంచి పోటీ ఎలా ఎదుర్కుంటారు ?

ముందే చెప్పానుగా.. ఎవరినీ పోటీ అనుకోవటం లేదు. కోటి కనెక్షన్లలో కనీసం 30 లక్షలలు ఎలాగూ తగ్గవు. మాది వ్యాపారం కాదు. అందరికీ మంచి జరగటానికి ఏర్పాటృ చేసుకున్న ఒక న్యాయబద్ధమైన సంస్థ. వ్యవహారాలన్నీ అత్యంత పారదర్శకంగా జరుగుతాయి. వాటా విషయం కూడా ముందే స్పష్టంగా చెబుతున్నాం కాబట్టి ఎలాంటి అపోహలకూ తావుండదు. అందుకే మా బ్రైట్ వే మీద మాకంత నమ్మకముంది. మా ఎమ్మెస్వోలకూ మరింత నమ్మకం కలుగుతుంది.