• Home »
  • Cable »
  • కార్పొరేట్ ఎమ్మెస్వోల మీద విరుచుకుపడ్డ తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం

కార్పొరేట్ ఎమ్మెస్వోల మీద విరుచుకుపడ్డ తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం

కార్పొరేట్ ఎమ్మెస్వోలు తమ ఏజెంట్లను తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల మీదికి ఉసిగొల్పుతున్నాయని, మాయమాటలతో వ్యవస్థనే ఛిన్నాభిన్నం చేసే ప్రయత్నంలో ఉన్నాయని తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం ఆరోపించింది. “ కార్పొరేట్ బ్రోకర్లారా ఖబడ్దారు “ అంటూ ఒక హెచ్చరిక పూర్వకమైన లేఖను సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టింది.

కార్పొరేట్ సంస్థల ఎంగిలిమెతుకులకు ఆశపడుతున్నారంటూ ఆయా సంస్థల ఉద్యోగులమీద తిట్ల వర్షం కురిపించింది. ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, ఎమ్మెస్వోల దగ్గర ఎన్ వో సి తెస్తే లైన్ ఇస్తామంటూ మభ్యపెడుతున్నారని తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం విమర్శించింది. లైన్ తీసుకోవటానికి ఇష్టపడనివాళ్లమీద డమ్మీలు వేస్తామని బెదిరిస్తున్నట్టు కూడా ఆరోపించింది. అవసరమున్నవాళ్ళు తీసుకుంటారని, అలా కాకుండా వీధులవెంట తిరగటం సమంజసం కాదని కార్పొరేట్ సంస్థలను హెచ్చరించింది.

హిట్స్, సిటీ, సి, ఎసిటి అంటూ గల్లీ గల్లీకీ తిరుగుతున్న కార్పొరేట్ ఎమ్మెస్వోల ఏజెంట్ల మాటలు నమ్మవద్దని తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం  ఆపరేటర్లకూ, ఎమ్మెస్వోలకూ విజ్ఞప్తి చేసింది.