• Home »
  • Cable »
  • డిటిహెచ్ మీద వినోదపు పన్ను వేయండి, హాత్ వే బకాయిలూ వసూలు చేయండి: తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం

డిటిహెచ్ మీద వినోదపు పన్ను వేయండి, హాత్ వే బకాయిలూ వసూలు చేయండి: తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం

కేబుల్ కనెక్షన్ల సంఖ్య ఇంకా నిర్థారణ కాలేదు గనుక డిజిటైజేషన్ పూర్తయ్యాకనే వినోదపు పన్ను వసూలు చేయటం సమంజసంగా ఉంటుందని తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పన్నుల పట్ల ఎమ్మెస్వోలకు అవగాహన కలిగించేందుకు, పన్ను బకాయిలు వసూలయ్యేందుకు వీలుగా వాణిజ్య పన్నుల శాఖ ఏర్పాటుచేసిన సదస్సులో పలువురు ఎమెస్వోలతోబాటు ఆయన పాల్గొన్నారు.

సమావేశం ప్రారంభంలో వణిజ్యపన్నులశాఖ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 80 లక్షల కనెక్షన్లుండగా అందులో డిక్లేర్ అయినవి కనీసం 60 లక్షలుంటాయని గుర్తు చేస్తూ ఈ కనెక్షన్లకు నెలకు రూ. 5 చొప్పున వసూలైనా, రాష్ట్ర ప్రభుత్వానికి నెలనెలా కనీసం రూ.3 కోట్లు వచ్చేదన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకుంటూ అందరూ పన్నులు చెల్లించాలని విజ్ఞప్తిచేశారు.

అయితే, ఎమ్మెస్వోల నిస్సహాయత ఎలాంటిదో గుర్తించాలను సుభాష్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో ఉండే ఆపరేటర్ ఇచ్చిన కనెక్షన్లను మాత్రమే లెక్కలోకి వస్తాయి తప్ప ఊహాజనితమైన అంకెలతో వసూళ్ళు చేపట్టాలనుకోవటం అర్థరహితమని వ్యాఖ్యానించారు. డిజిటైజేషన్ పూర్తయిన తరువాత కనెక్షన్ల సంఖ్య కచ్చితంగా తేలే అవకాశం ఉంది కాబట్టి మరో మూడు నెలలు వేచి ఉండటం మంచిదని సూచించారు.

నిజానికి టీవీ ప్రసారాల ద్వారా ఎక్కువగా లాభపడుతున్నది పే చానల్స్ మాత్రమేనని, అలాంటప్పుడు కోట్లకొద్దీ ప్రజలనుంచి పిండుతున్న చానల్స్ ఆదాయం నుంచే వినోదపు పన్ను కూడా వసూలు చేసే విషయం ఆలోచించాలని సుభాష్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. కేవలం తెలంగాణలోనే పే చానల్స్ దాదాపు ఏటా 600 కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నాయని గుర్తుచేశారు. ప్రజలను వదిలేసి వాళ్ళనుంచి వసూలు చేసే విషయం పరిశీలించాలని కోరారు.

కేబుల్ వ్యాపారంతోబాటు ఎదిగిన డిటిహెచ్ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో ఉండగా వాళ్ళనుంచి మాత్రం వినోదపు పన్ను వసూలు చేయకుండా చిన్న చిన్న వ్యాపార్రులుగా ఉన్న ఎమ్మెస్వోలు, ఆపరేటర్లనుంచి వసూలు చేయాలనుకోవటం దారుణమన్నారు.
ఎమ్మెస్వోల నుంచి వసూలు చేయాలనుకున్నా, ముందుగా డిజిటైజేషన్ పూర్తయిన హైదరాబాద్ నుంచి ప్రారంభించాలని, హాత్ వే లాంటి కార్పొరేట్ ఎమ్మెస్వో ఇప్పటివరకు ఎంత మొత్తం చెల్లించకుండా వినోదపు పన్ను ఎంత ఎగవేసిందో లెక్క చూసి ముక్కుపిండి వసూలు చేయాల్సిన బాధ్యత వాణిజ్యపన్నులశాఖ మీద ఉన్నదని గుర్తుచేశారు. సొంత కనెక్షన్లే ఐదు లక్షలకు పైగా ఉన్న హాత్ వే నుంచి ఎంత వసూలు చేశారో అధికారులు ముందుగా పరిశీలించాలన్నారు.

ఎలాగూ డిజిటైజేషన్ పూర్తయిన తరువాత కనెక్టివిటీ లెక్క తేలుతుంది కాబట్టి అప్పుడు ఎలాగూ చెల్లించటానికి ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు సిద్ధంగానే ఉన్నారని, నవతెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకుంటూ పన్నులు చెల్లిస్తారని కూడా ఆయన హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్ ఎమ్మెస్వో ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ వాట్ సమస్యను ప్రస్తావించారు. నల్గొండ ఎమ్మెస్వో భాస్కర్ మాట్లాడుతూ ఇందులో ఉన్న చిక్కులను, సమస్యలను వాణిజ్యపన్నులశాఖ అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెస్వోలు పలువురు వినోదపు పన్ను భారం గురించి మాట్లాడారు.