• Home »
  • National Channels »
  • పిల్లల కోసం టెలీ వన్ సంస్థ ఉచిత హిందీ చానల్ ’ కార్టూన్ టీవీ ’

పిల్లల కోసం టెలీ వన్ సంస్థ ఉచిత హిందీ చానల్ ’ కార్టూన్ టీవీ ’

ఢిల్లీ కేంద్రంగా పనిచేసే టెలిషాపింగ్ సంస్థ టెలీ వన్ ప్రస్తుతం మహా మూవీ చానల్ అందిస్తుండగా వచ్చే నెలనుంచి పిల్లలకోసం ఒక ఉచిత చానల్ అందించబోతోంది. దాని పేరు కార్టూన్ టీవీ. హిందీ మాట్లాడే ప్రేక్షకులనే టార్గెట్ చేసుకున్న ఈ సంస్థ 4-14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకోసం, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పిల్లలకోసం కార్యక్రమాలు రూపొందించి అందించబోతోంది.

పిల్లలకోసం అనేక అంతర్జాతీయ చానల్స్ ఉన్నప్పటికీ అవన్నీ పే చానల్స్ కావటం, హిందీ ప్రేక్షకులకు తగినవి కాకపోవటం వల్లనే ఈ చానల్ ప్రారంభిస్తున్నట్టు టెలీ వన్ సీఈవో సంజయ్ వర్మ చెబుతున్నారు. గ్రామీణ ప్రామ్త ప్రేక్షకుల అభిరుచులమీద సర్వే జరిపిన అనంతరం అందుకు తగినట్టుగానే చానల్ ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఢిల్లీతోబాటు హైదరాబాద్ లొ కూడా ఒక స్టుడియో ఏర్పాటు చేసి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం ఆరుగంటలపాటు ఒరిజినల్ ప్రసారాలుంటాయి.  డబ్ చేసినవి, యానిమేషన్ కంటెంట్ తోబాటు ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఇందులో ఉంటాయి. మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ జరిగే ప్రాంతాల్లో చానల్ పంపిణీకి ఏర్పాటు చేయటంతోబాటు హిందీ ప్రాంతాల్లో బాగా ప్రజాదరణ పొందిన డిడి ఫ్రీడిష్ ద్వారా కూడా అందేట్టు చూస్తామంటున్నారు.

హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్, హిందీ సినిమాల తరువాత ఎక్కువగా చూసేది పిల్లల చానల్సే అయినప్పటికీ ప్రకటనల ఆదాయం మాత్రం రూ. 500 కోట్లకే పరిమితమైంది. ఏటా ఈ ఆదాయం 10 నుంచి 15% పెరుగుదల నమోదు చేసుకుంటూ వస్తోంది. అయితే కొత్త మార్కెట్ సృష్టించుకోవచ్చునని చానల్ భావిస్తోంది. కనీసం రెండేళ్ళలో లాభాల్లోకి వస్తామనే ధీమాతో ఉంది.