లోగో మార్చిన టెన్ స్పోర్ట్స్

భారత్-జింబాబ్వే వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ ప్రసారం చేస్తున్న స్పోర్ట్స్ చానల్ టెన్ స్పోర్ట్స్ ఈ ప్రత్యక్షప్రసారాల ప్రారంభం సందర్భంగా తన కొత్త లోగో ఆవిష్కరించింది. బంగ్లాదేశ్ టూర్ లో ఘోర వైఫల్యం చవిచూసిన భారత జట్టుకు ఈ సిరీస్ చాలా కీలకమని భావిస్తుండగా ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఎ సిరీస్ మీద కనీసం 20 కోట్ల ఆదాయం రావాలని టెన్ స్పోర్ట్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
సంస్థ ఆశయాలనూ, ఆకాంక్షలనూ ప్రతిబింబించేలా క్రీడాస్ఫూర్తినీ విజయాన్నీ సూచించేలా విస్తృతమైన పరిశోధన జరిపి ఈ కొత్త లోగో ను తయారుచేసినట్టు టెన్ స్పోర్ట్స్ సీఈవో రాజేశ్ సేథీ చెప్పారు. ఈ సిరీస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, చెప్పుకోదగినంత పేరుమోసిన ఆటగాళ్ళు లేకపోయినా ఇప్పటికే 60 శాతం ప్రకటనల సమయం అమ్ముడుపోవటం అందుకు ఊతమిస్తున్నదని అన్నారు. 10 సెకెన్ల స్పాట్ కు రూ. 3 నుంచి 3.5 లక్షలమేరకు అమ్మగలిగినట్టు వెల్లడించారు. ఫాగ్, కార్బన్, పే యు లాంటి బ్రాండ్లు ఈ సిరీస్ లో చేరాయి.