• Home »
 • Cable »
 • డిజిటైజేషన్ మూడో దశ అలా సాగి, ఇలా ఆగి…

డిజిటైజేషన్ మూడో దశ అలా సాగి, ఇలా ఆగి…

తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెస్వోల సంఘం కన్వీనర్ మోహన్ చొరవ తీసుకొని హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావటంతో మూడో దశ డిజిటైజేషన్ గడువు వ్యవహారం కీలకమైన మలుపు తిరిగింది. గడువు పొడిగించే ప్రసక్తే లేదంటూ ప్రభుత్వం భీష్మించుకోవటం ఒకవైపు, సెట్ టాప్ బాక్సులు అందకపోవటం మరోవైపు ఎమ్మెస్వోలను, ఆపరేటర్లను తీవ్రంగా కలవరపరచాయి. అదే సమయంలో కోట్లాది మంది ప్రేక్షకులు కూడా కొత్త సంవత్సరం వేడుకలు చూసే అవకాశం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు నుంచి తెచ్చుకున్న స్టే ఉత్తర్వుల కారణంగా అనలాగ్ ప్రసారాలు మరో రెండు నెలలపాటు కొనసాగే అవకాశం రావటం కొంత ఊరట నిచ్చింది. ఈ వ్యవహారంలో కేంద్రం అనుసరించిన వైఖరి, క్షేత్రస్థాయి పరిస్థితి, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలమీద సమగ్ర విశ్లేషణే ఈ వ్యాసం.

ఎం ఐ బి : మొండివాదనతో మంకుపట్టు

ఈ వ్యవహారంలో ఇంత గందరగోళం ఏర్పడటానికి ప్రధానకారణం కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ. అధికారులు కాగితాలమీద లెక్కలు వేసుకొని గడువులు నిర్దేశించటం, కళ్ళకు గంతలు కట్టుకొని అంతా సాఫీగా సాగుతున్నదనుకోవటమే తప్ప క్షేత్ర స్థాయిలో అసలేం జరుగుతోందన్న స్పృహ లేకపోవటం అనేక అనర్థాలకు దారితీసింది. మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం మూడో దశ ప్రాంతాల్లో డిసెంబర్ చివరికల్లా 76.45% సెట్ టాప్ బాక్సుల అమరిక పూర్తయింది. ఐగా, కోర్టులో తేలాల్సి ఉన్న తమిళనాడును మినహాయిస్తే ఇది 86.25% చేరుకుంటుంది.

ఈ లెక్కలను మంత్రిత్వశాఖ స్వయంగా ప్రకటించింది. డిసెంబర్ 30 న జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఈ విజయానికి తనను తాను అభినందించుకుంది. మంత్రిత్వశాఖ కార్యదర్శి సునిల్ అరోరా అధ్యక్షతన జరిగిన సమావేశం డిజిటల్ సెట్ టాప్ బాక్సుల లెక్కలు సమీక్షించుకొని తన భుజం తానే తట్టుకుంది. 76.45% వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసుకోకపోవటం ఒక తప్పయితే, మిగిలిన 23 శాతం ఇళ్ళలో టీవీ ప్రసారాలు ఆగిపోవటం తన వైఫల్యమని గుర్తించకపోవటం మరో విషాదం.

 

ఇంతకీ ఆ లెక్కల్లో డొల్లతనం ఏంటి ? ఒక ఎమ్మెస్వో ఎన్ని సెట్ టాప్ బాక్సులు పెట్టాడో చూస్తున్నారు తప్ప వాటిలో ఎన్ని మూడో దశ ఇళ్ళలో పెట్టాడు, ఎన్ని నాలుగో దశ ఇళ్ళలో పెట్టాడు అనే విషయమే పట్టించుకోలేదు. చాలా చోట్ల ఎమ్మెస్వోల పరిధిలో మున్సిపల్ పట్టణాలతోబాటు ఆ పరిసరగ్రామాలు కూడా ఉంటాయి. మొత్తంగా కలిపి 30 శాతం బాక్సులు పెట్టిన చోట ఆ సంఖ్య మొత్తాన్ని పట్టణానికి మాత్రమే ఆపాదిస్తే నిజంగానే 75% పెట్టినట్టు అనిపించవచ్చు. కానీ వాస్తవంగా పట్టణం వరకే లెక్కిస్తే అలాంటి పరిస్థితి లేదు. ఇదీ అసలు రహస్యం. నిజానికి ప్రభుత్వం మూడు, నాలుగు దశలకు కలిపి గడువు ప్రకటించి ఉంటే ఆచరణ యోగ్యంగా ఉండేది, ఈ లెక్కలకూ అప్పుడు కొంత అర్థం ఉండేది. బుకాయింపులకు అడ్డుకట్ట పడేది. అలా జరగలేదు కాబట్టే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయటానికి అవకాశం ఏర్పడింది.

ఇదీ ప్రభుత్వం వాదన

టాస్క్ ఫోర్స్ సమావేశంలో మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ ఆర్. జయ చేసిన ప్రకటనలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి :

 1. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వచ్చిన అభ్యర్థనలు, జాబితాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల జాబితాను సవరించాం. దాని వలన మూడో దశ పట్టణాల సంఖ్య కుదించబడింది. మహారాష్ట్ర. కర్నాటక, బీహార్, తమిళనాడు, లక్షదీవులు, దాద్రా-నాగర్ హవేలి నుంచి ఇంకా స్పందన తెలియాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ అభ్యర్థన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మొత్తంగా చూస్తే సవరించిన జాబితా ప్రకారం మూడో దశ డిజిటైజేషన్ లో ఉన్న మొత్తం పట్టణాల సంఖ్య 6,016.
 2. ఇప్పటి వరకు సెట్ టాప్ బాక్సులు అమర్చటంలో జరిగిన పురోగతిని పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా అది 45% గా నమోదైంది. ఇంకా ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎమ్మెస్వోకు డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్స్ ఇవ్వని తమిళనాడును మినహాయిస్తే ఇది 86.25%. ఇందులో డిటిహెచ్ ఆపరేటర్ల సమాచారం కూడా చేరి ఉంది. ( అంటే, ఇందులో కచ్చితంగా మూడో దశ మాత్రమే ఉందని చెప్పలేం. డిటిహెచ్ ఆపరేటర్లు కూడా అలా చెప్పలేదు.మొత్తంగా వాళ్ళు కొత్తగా తెచ్చుకున్న కనెక్షనల్ సమాచారం మాత్రమే ఇచ్చారు. దాని ఆధారంగా ప్రభుత్వం అది కూడా కేబుల్ డిజిటైజేషన్ లో భాగంగానే చెప్పుకుంది )
 3. దేశవ్యాప్తంగా మొత్తం 685 పట్టణాలలో ఒక్కటంటే ఒక్క సెట్ టాప్ బాక్స్ కూడా పెట్టలేదు. అంటే మూడో దశ డిజిటైజేషన్ జరగాల్సిన పట్టణాలలో 11% పట్టణాలలో పురోగతి శూన్యం. ఈ పట్టణాలలో 280 పట్టణాలు పశ్చిమ బెంగాల్ లో ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించటమే కాదు, ఈ సమావేశం తరువాత ఆ పట్టణాలను తొలగించటం ద్వారా అమలులో పెరుగుదలశాతం పెంచి చూపుకునే ప్రయత్నం చేసింది. మూడో దశ విజయవంతమైందని చెప్పుకోవటానికి వీలుగా ఎప్పటికప్పుడు అనేక పట్టణాలను నాలుగో దశలోకి మారుస్తూ రావటం దాదాపు నాలుగైదు నెలలుగా సాగుతున్న పరిణామమే.పెద్ద పట్టణాలను నాలుగో దశలోకి నెట్టి చిన్న పట్టణాలను జోడించటం చాలా చోట్ల కనిపించింది. సెట్ టాప్ బాక్సులు పెట్టుకోని కొన్ని పట్టణాలలో ఇళ్ళ సంఖ్య వెయ్యికంటే తక్కువ ఉన్నట్టు కూడా ప్రభుత్వం చెప్పుకుంది. అందువలన దాన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదనే అభిప్రాయం చెప్పటమే అందులో లక్ష్యం. అయితే, అంత చిన్న ఊళ్ళను మూడో దశలో ఎలా చేర్చారన్న ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. జాబితా రూపకల్పనలో జరిగిన దారుణమైన నిర్లక్ష్యానికి అదొక ఉదాహరణ. కొన్ని పట్టణాలను నాలుగో దశకు ఏ ప్రాతిపదికన బదలాయించారో కూడా ప్రభుత్వ చెప్పదు, చెప్పలేదు.
 4. మూడో దశకు రిజిస్టర్ చేసుకున్న మొత్తం 510 మంది ఎమ్మెస్వోలలో కేవలం 190 మంది ఎమ్మెస్వోలు మాత్రమే సెట్ టాప్ బాక్సుల సీడింగ్ వ్యవహారాన్ని మంత్రిత్వశాఖ వారి ఎం ఐ ఎస్ లో చేర్చారన్నది ప్రభుత్వం వినిపించిన మరో వాదన. నిజానికి మూడింట రెండొంతులమంది ఎమ్మెస్వోలు మాత్రమే డిజిటల్ హెడ్ ఎండ్స్ పెట్టుకున్నారు తప్ప మిగిలినవాళ్ళు పెద్ద ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకోవటానికే పరిమితమయ్యారు. కార్పొరేట్ ఎమ్మెస్వోలు ఆ విధంగా లబ్ధి పొందారు. అందువలన లైసెన్స్ తీసుకున్నవాళ్ళందరూ హెడ్ ఎండ్స్ పెట్టకపోవటం చాలా సహజం. అదే విధంగా, 135 మంది ఎమ్మెస్వోలు ఇంకా ఎం ఐ ఎస్ లోకి లాగిన్ కాలేదని, 185 మంది లాగిన్ అయినప్పటికీ సెట్ టాప్ బాక్సుల సీడింగ్ మీద ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని ప్రభుత్వం చెబుతోంది.
 5. ఇక ఎమ్మెస్వోల రిజిస్ట్రేషన్ విషయానికొస్తే, ఇప్పటి దాకా మంజూరు చేసిన లైసెన్సుల సంఖ్య 600 దాటలేదు. స్వయంగా మంత్రిత్వశాఖ ఆదే విషయం వెల్లడించింది. 90 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, 170 మంది దరఖాస్తుదారులు అఫిడ్ విట్లు ఇవ్వాల్సి ఉందని, తాజాగా మరో వందకు పైగా దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం చెప్పింది. అయితే, లైసెన్సుల మంజూరు ప్రక్రియను మూడో దశ చివర్లోనే బాగా వేగవంతం చేసిన విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకొని తీరాల్సి ఉంది. మరో దారుణమైన వైఫల్యమేంటంటే, హోం మంత్రిత్వశాఖ విచారణ అవసరం లేదని ప్రకటించి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ అందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు రాకపోవటం.
 6. గడిచిన రెండు నెలలుగా టోల్ ఫ్రీ నెంబర్ వాడకంలోకి వచ్చినట్టు కూడా ప్రభుత్వం ఈ టాస్క్ ఫోర్స్ సమావేశంలో వెల్లడించించి. 18001804343 నెంబరుకు ప్రస్తుతం సగటున రోజుకు 500 వరకు కాల్స్ వస్తున్నాయని చెప్పింది. అయితే, ఎప్పుడో ఏడాది కిందటం ఏర్పాటు చేయాల్సిన నెంబరు మూడో దశ చివరికి వచ్చాక గాని ప్రభుత్వానికి కుదరలేదు. పైగా దశలవారీగా మరిన్ని భాషలకు విస్తరిస్తూ వస్తున్నారు తప్ప అన్ని భాషలకూ రెండు నెలలకిందట మొదలు కాలేదు.
 7. డిజిటల్ హెడ్ ఎండ్స్ ను తనిఖీ చేయటానికి దూరదర్శన్, ఆకాశవాణి నుంచి దాదాపు 400 మంది అధికారులను డెప్యుటేషన్ మీద పంపుతున్నట్టు మంత్రిత్వశాఖ ప్రకటించింది. వీరిలో దాదాపు 50 మంది మాత్రమే తనిఖీ నివేదికలు పంపారని ప్రభుత్వమే ఒప్పుకుంది.
 8. గడువు తేదీ పెంచవలసిందిగా కోరుతూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వినతులు అందినట్టు మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ జయ వెల్లడించారే తప్ప వాటిమీద ఎందుకు సానుకూలంగా స్పందించలేకపోతున్నారో మాత్రం చెప్పలేదు. లేఖలు పంపిన వారిలో ఉత్తరాఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలున్నాయని, కొంతమంది ఎమ్మెస్వోలు కూడా ఉన్నారని వెల్లడించారు.
 9. అన్నిటికంటే చివరగా మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ జయ సెట్ టాప్ బాక్సుల సమస్యను ప్రస్తావించారు. బాక్సుల కొరత ఉన్నట్టు కొంతమంది ఎమ్మెస్వోలు చెప్పారని, మరికొందరి ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు జరగటం లేదని ఫిర్యాదు చేశారని చెప్పారు. అంతకు మించి దాన్ని పెద్ద సమస్యగా మాత్రం చెప్పలేదు.

డిటిహెచ్ ప్రతినిధులు మాత్రం వాళ్ళకు ఇప్పుడు కోటీ 60 లక్షల సెట్ టాప్ బాక్సులు పనిచేస్తున్నవి ఉన్నాయని, మరో 20 లక్షల బాక్సులు త్వరలోనే అమర్చటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకున్నారు. ఇవి కాకుండా డిడి ఫ్రీడిష్ మరో 40 లక్షల సెట్ టాప్ బాక్సులు పంపిణీ చేయగా డిజిటల్ కేబుల్ ఇంకో 80 లక్షల బాక్సులు పెట్టబోతున్నట్టు వెల్లడించారు. మొత్తానికి డిటిహెచ్ బాక్సులను కూడా డిజిటైజేష లెక్కల్లో కలపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఎమ్మెస్వోల వాదన


అయితే, ఎమ్మెస్వోల వాదన మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినా ప్రభుత్వం ఆ వాదన వినటానికి ఆసక్తి చూపించలేదు. ఒరిస్సాకు చెందిన అతిపెద్ద ఎమ్మెస్వో అయిన ఆర్టెల్ కమ్యూనికేషన్స్ సంస్థ ప్రతినిధి సెట్ టాప్ బాక్సుల విడిభాగాల కొరత ఉండటం వలన బాక్సులు తగినన్ని మార్కెట్లో అందుబాటులో లేకపోవటాన్ని టాస్క్ ఫోర్స్ దృష్టికి తెచ్చారు. తయారీదారులదగ్గరే ఈ సమస్య ఉండటం వలన ఆర్డర్ కి తగినట్టు సరఫరా చేయలేకపోతున్నారని చెప్పారు. అడ్వాన్స్ చెల్లింపు జరిపినప్పటికీ బాక్సులు అందించకపోవటానికి కారణం కొన్ని కీలకమైన విడిభాగాలు అందుబాటులో లేకపోవటమేనని చెప్పారు. ఇప్పటివరకు 30 శాతం బాక్సులు మాత్రమే అమర్చగా మరో 20 శాతం అవసరాలకు సరిపడా బాక్సులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

మూడో దశ గడువు తేదీని నిజానికి ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 11 నాడే ప్రకటించిందని, అలా ఏడాదికి ముందే చెప్పినప్పటికీ ఆఖరి నిమిషంలో బాక్సుల కొరతను ప్రస్తావించటం తగదని టాస్క్ ఫోర్స్ చైర్మన్ అభిప్రాయపడ్డారు. అనేక అవగాహనాసదస్సులు ఏర్పాటు చేశామని టాస్క్ ఫోర్స్ తరఫున ఉపసంఘాలు ఏర్పాటు చేసి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నామని ప్రభుత్వం సమాధానం ఇచ్చుకుంది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయినోడల్ అధికారుల శిక్షణాతరగతులు నిర్వహించామని చెప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రెటరీలతో సహా పలువురు అధికారులకు తగినంత అవగాహన కల్పించినట్టు కూడా టాస్క్ ఫోర్స్ సమావేశంలో చెప్పారు. అందువలన ఎట్టిపరిస్థితుల్లోనూ మూడో దశ డిజిటైజేషన్ గడువు పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

బ్రాడ్ కాస్టర్ల  వాదన

చానల్ యాజమాన్యాల సంఘమైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబిఎఫ్) ప్రతినిధులు మరో కొత్త సమస్యను లేవనెత్తారు. దాదాపు 700 మంది ఎమ్మెస్వోలకు మూడు, నాలుగు దశలకు సంబంధించి ఒకే హెడ్ ఎండ్ ఉండటం పెద్ద సమస్యకు దారితీస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అటు డిజిటైజ్ అయిన ఇళ్ళకు, ఇటు అనలాగ్ ఫీడ్ పంపిణీకి వేరు వేరుగా ఏర్పాట్లు చేసుకోవటంలో విఫలమయ్యారని ఆరోపించారు. మూడు, నాలుగు దశలకోసం డిజిటల్ హెడ్ ఎండ్, అనలాగ్ హెడ్ ఎండ్ లేకపోతే బిల్లు వసూళ్ళలో ఇబ్బందులు తలెత్తి డిజిటైజేషన్ ఫలితాన్ని బ్రాడ్ కాస్టర్ అందుకోవటం అసాధ్యమవుతుందని చెప్పారు. ఎమ్మెస్వోలు డిజిటల్ పట్టణాలలో అనలాగ్ సిగ్నల్స్ పంపిణీ చేసే పక్షంలో  మొత్తం సిగ్నల్స్ స్విచాఫ్ చేస్తామని ఇప్పటికే ఎమ్మెస్వోలకు హెచ్చరికలు జారీచేశామని కూడా ఐబిఎఫ్ ప్రతినిధులు టాస్క్ ఫోర్స్ సమావేశానికి తెలియజేశారు.

ఐబిఎఫ్ చెప్పిన ఈ విషయం ఆధారంగా మంత్రిత్వశాఖ ఒక సర్క్యులర్ జారీచేస్తూ ఎమ్మెస్వోలు డిజిటల్, అనలాగ్ హెడ్ ఎండ్స్ వేరువేరుగా నెలకొల్పుకోవాలని కోరింది. ఒకవేళ ఒకే చోట రెండు హెడ్ ఎండ్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే బ్రాడ్ కాస్టర్లనుంచి రిసీవర్లు వేరువేరుగా తీసుకోవాలని కూడా ఆ ఉత్తర్వులలో ఆదేశించింది. ఆ విధంగా డిజితైజేషన్ జరిగిన చోట డిజిటల్ సిగ్నల్స్ మాత్రమే ప్రసారం చేసేలా చూసుకొవాలని కోరింది. ఈ గడువు తేదీ తరువాత ఎమ్మెస్వోలకూ, బ్రాడ్ కాస్టర్లకూ మధ్య పాత అనలాగ్ ఒప్పందాలు చెల్లబోవని కూడా ప్రభుత్వం తరఫున జాయింట్ సెక్రెటరీ జయ స్పష్టం చేశారు.

నోడల్ ఆఫీసర్ల తరఫున మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ,  క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం విధించిన గడువులోగా మూడవ దశ అమలు చేయటం సాధ్యం కాదని చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో గడువు పెంచటం ఒక్కటే మార్గమని కూడా సూచించారు. మహారాష్ట్రలో ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి ఆధారంగానే తాను గడువు పొడిగింపు కోరుతున్నానన్నారు.

చందాదారుల అభిప్రాయాలు

సవేరా అనే వినియోగదారుల సంఘం ప్రతినిధి మాట్లాడుతూ వినియోగదారులైన కేబుల్ టీవీ చందాదారులు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రస్తావించారు.  ఎమ్మెస్వోలనుంచి ఆపరేటర్లనుంచి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వీటి పరిష్కారం దిశలో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖను కూడా ఇందులో భాగస్వామిని చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే సమస్యలకు సత్వర పరిష్కారం దొరికేలా చూడటం సాధ్యమవుతుందన్నారు. మంత్రిత్వశాఖ అన్ని జిల్లాలలో వినియోగదారుల చైతన్య సదస్సులు ఏర్పాటు చేయాలని కూడా కోరారు. అయితే, దేశ వ్యాప్తంగా 11 వర్క్ షాప్స్ నిర్వహించినట్టు సమాధానం చెప్పి టాస్క్ ఫోర్స్ లో ప్రభుత్వం ఆ విషయాన్ని దాటవేసింది. నాలుగోదశలో కూడా ఇలాంటి సదస్సులు ఏర్పాటుచేసే ఆలోచన ఉందని మాత్రం చెప్పింది. దేసవ్యాప్తంగా వివిధ తేదీలలో వార్తాపత్రికలలో ఐదు ప్రకటనలు ఇచ్చామని చెప్పారు. అదే సమయంలో అటు ఎంటర్టైన్మెంట్ చానల్స్ లోను, ఇటు న్యూస్ చానల్స్ లోను ప్రకటనలు జారీచేస్తున్నామని వెల్లడించారు. అనేక చానల్స్ స్వయంగా ప్రకటనలు, స్క్రోలింగ్ ఇస్తున్నట్టు చెప్పారు.

ఆపరేటర్ల వాదన

మహారాష్ట్రకు చెందిన కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు ఆపరేటర్ల తరఫున తమ వాదన వినిపించారు. మహారాష్ట్ర లో దాదాపు 60 శాతం మేరకు ప్రాంతాలలో జాతీయ స్థాయి కార్పొరేట్ ఎమ్మెస్వోల రాజ్యమే నడుస్తున్నదని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు పది లక్షలకు పైగా సెట్ టాప్ బాక్సులు ఇంకా అమర్చాల్సి ఉందని చెప్పారు. అది అంత వేగంగా సాధ్యమయ్యే పని కాదని కూడా టాస్క్ ఫోర్స్ దృష్టికి తెచ్చారు. మహారాష్ట్రకు చెందిన 40 మంది ఎమ్మెస్వోలు డిజిటల్ ఎమ్మెస్వోగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా, వారి దరఖాస్తులు మంత్రిత్వశాఖ దగ్గర పెండింగ్ లో ఉన్నాయన్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదని 2015 జులై లోనే ప్రభుత్వం చెప్పినప్పటికీ నోటిఫికేషన్ మాత్రం ఇంకా జారీకాకపోవటం పట్ల కూడా టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. ఏమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం మూడో దశ డిజిటైజేషన్ గడువు పెంచటానికి సిద్ధంగా లేనట్టు స్పష్టం చేసింది.

కోర్టులే ఆదుకున్నాయి
ఒకవైపు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ డిజిటైజేషన్ మీద ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ సమావేశం మూడోదశ గడువుకు 48 గంటలముందు ఇలా గడువు పొడిగింపు కుదరదంటూ స్పష్టం చేయగా ఆ తరువాత రెండు గంటలకే తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి చొరవతీసుకొని హైకోర్టులో నివేదించి స్టే తెచ్చుకోగలిగారు.  న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ఆదుకొకపోవటం, పైగా సెట్ టాప్ బాక్సుల విషయంలో కాకిలెక్కలు చెప్పటం ఎమ్మెస్వోలకు కలిసి వచ్చింది. ఈ సమస్యను ప్రధానంగా ప్రస్తావించటం ద్వారా స్టే తీసుకోగలిగారు. అకస్మాత్తుగా కోట్లాదిమంది ప్రజలు టీవీ ప్రసారాలకు దూరమయ్యే పరిస్థితి ఉండటం కోర్టు దృష్టికి వచ్చింది. సెట్ తాప్ బాక్సులు తగినన్ని సరఫరా అయ్యేట్టు చూడలేని ప్రభుత్వం ఇలా అర్థంతరంగా ప్రసారాలు నిలిపివేయించే పరిస్థితి తీసుకురావటం తగదన్నవాదనతో ఏకీభవించింది.

ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెస్వోలు తెచ్చుకున్న స్టే ఉత్తర్వులు ఇతర రాష్ట్రాల వారికి మార్గదర్శమయ్యాయి. మరుసటిరోజే ఆంధ్రప్రదేశ్ కూ స్టే లభించగా ఆ తరువాత నాలుగైదు రోజుల్లోనే దాదాపు ఏడెనిమిది రాష్ట్రాలలో ఊరట లభించింది. దీంతో దేస వ్యాప్తంగా ఎమ్మెస్వోల సంఘాల నాయకులు, అనేకమంది ఎమ్మెస్వోలు  ఈ విషయంలో చొరవ తీసుకొని, పూర్తి సమాచారంతో కోర్టును మెప్పించిన సుభాష్ రెడ్డిని అభినందనలలో ముంచెత్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రమూ ఊహించలేదు. గడువు పొడిగించకుండా తన పంతం నెగ్గించుకుంటున్నట్టు ఆనందించిందే తప్ప ఇలాంటి సమయాలలో కోర్టులు ఆదుకుంటాయని గుర్తుచేసుకోలేదు. ఆ తరువాత ఒక్కసారిగా చేదు అనుభవం ఎదురవటంతో ఏం చేయాలో పాలుపోలేదు.

న్యాయశాఖ అభిప్రాయం కోసం

అనేక రాష్ట్రాలలో హైకోర్టులు అలా స్టే లు ఇస్తూ ఉండగా ఏం చేయాలో చెప్పాల్సిందిగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ న్యాయమంత్రిత్వశాఖను సలహా అడిగింది. దీనిమీద ఆ యా హైకోర్టులకు ప్రభుత్వ స్పందన తెలియజేయాల్సి ఉండటంతో న్యాయ సలహా అనివార్యమైంది. అన్ని కేసులనూ కలిపి విచారించాల్సిందిగా కోరాలని మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుందని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్ అరోరా ఒక దశలో ధ్రువీకరించారు.

అయితే, ఎక్కువమంది ఎమ్మెస్వోలు సుప్రీంకోర్టు దాకా వచ్చి ఖర్చులు భరించే స్థితిలో ఉండరు కాబట్టి అదే మంచి పని అవుతుందనే అభిప్రాయం మంత్రిత్వశాఖలో వెల్లడైంది. అంతర్గతంగా మంత్రిత్వశాఖలో అనేక విడతలుగా చర్చలు జరిపిన మీదట ఈ వ్యవహారానికి హైదరాబాద్ తీర్పు బీజాలు వేసిందని గుర్తించారు. దీనికి తోడు బొంబాయ్ హైకోర్టు కుసుమ్ ఇన్ గాట్స్ కేసును ప్రస్తావించటంతో ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశమంతటా వర్తిస్తుందన్న మాటకు బాగా ప్రాచుర్యం లభించింది.
అయితే, విధానపరమైన వ్యవహారాలలో తీర్పు ఇచ్చే సమయంలో హైకోర్టులు చాలా అప్రమత్తంగా ఉండాలని గతంలో కేబుల్ టీవీ నెట్ వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ కి సంబంధించిన ఉత్తర్వులు జారీచేసే సమయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఉపయోగపడుతుందని మంత్రిత్వశాఖ అభిప్రాయపడుతోంది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించాలని కూడా ఆలోచించింది. ఒకవైపు హైకోర్టులలో సమాధానం ఇవ్వటానికి సిద్ధమవుతూనే మూడో దశ అమలును అడ్డుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని ప్రభుత్వం ధీమాగా ఉంది. అవసరమైతే చట్టపరమైన చర్యల ద్వారా డిజిటైజేషన్ ప్రక్రియ కొనసాగించేందుకు ప్రయత్నించాలని కూడా ఆలోచిస్తోంది.

ఈ స్టే ఉత్తర్వుల వలన కేబుల్ ఆపరేటర్లు నష్టపోతారని, మరోవైపు డిటిహెచ్ ఆపరేటర్లు, హెడ్ ఎండ్ ఇన్ ద స్కై (హిట్స్) ఆపరేటర్లు లబ్ధిపొందుతారని ప్రభుత్వం చెబుతోంది.  డిటిహెచ్ ఆపరేటర్లు చాలా వేగంగా బాక్సులు అమర్చగలుగుతున్నారనటానికి ప్రభుత్వం దగ్గర సమాచారం ఉందంటున్నారు. పైగా ఈ స్టే వలన మూడు, నాలుగు దశలకే కాకుండా ఇంకా పూర్తి కాని మొదటి రెండు దశల మీద కూడా ప్రభావం ఉంటుందని బ్రాడ్ కాస్టర్లు. పంపిణీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మేకిన్ ఇండియా ప్రచారం పెద్దగా ఫలితాలు చూపకపోవటం వలన సెట్ టాప్ బాక్సుల కొరత  ఇంకా కొనసాగే అవకాశముందని ఇప్పటికీ చాలామంది అభిప్రాయపడటం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నది. ఈ బడ్జెట్ లో నైనా ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించవచ్చునని భావిస్తున్నారు.

వేచి చూడటమే వ్యూహమా ?

హైకోర్టులలో పెండింగ్ కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చేదాకా మూడో దశ డిజిటైజేషన్ మీద పట్టుబట్టకుండా ఉండటమే మేలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తరఫున పంజాబ్, హర్యానా హైకోర్టుకు హాజరై నప్పుడు ఇదే వైఖరి వెల్లడించింది. దీంతో సెట్ టాప్ బాక్సుల కొరత కారణంగా గడువు పెంచాలంటూ ఒక ఆపరేతర్ దాఖలు చేసిన పిటిషన్ ను ఆ హైకోర్టు కొట్టివేసింది. వివిధ హైకోర్టులలో ఉన్న కేసుల కారణంగా ఇప్పటికిప్పుడు సెట్ టాప్ బాక్సులు పెట్టుకోవాల్సిందేనని ప్రభుత్వం వత్తిడి చేయటం లేదని కోర్టుకు తెలియజేశారు. దీంతో పిటిషనర్ వాదనకు అర్థం లేకుండా పోయింది.

అంతకు ముందు అండర్ సెక్రెటరీ అనిల్ కుమార్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కు లేఖ రాస్తూ హైదరాబాద్ లో హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశం మొత్తానికి వర్తిస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. అన్ని పిటిషన్లలోనూ ప్రధానంగా సెట్ టాప్ బాక్సుల కొరతనే ప్రస్తావించటంతో ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కోవాలా అనే ఆలోచనలో ఉంది. అందుకే ముందుగా కొరతకు సంబంధిమ్చి పూర్తి అవగాహన వచ్చిన తరువాతనే కోర్టులో వాదించే ఉద్దేశంలో ఉంది. అవసరమైతే, నాలుగో దశకోసం సెట్ టాప్ బాక్సులకు రాయితీ ఇచ్చే విషయాన్ని కూడా వచ్చే బడ్జెట్ లో ప్రస్తావించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.