• Home »
  • Cable »
  • మూడోదశ డిజిటైజేషన్ స్టే ఉత్తర్వులమీద ఎట్టకేలకు సెప్టెంబర్ 7నుంచి విచారణ

మూడోదశ డిజిటైజేషన్ స్టే ఉత్తర్వులమీద ఎట్టకేలకు సెప్టెంబర్ 7నుంచి విచారణ

గడిచిన డిసెంబర్ 31 నాటికే మూడోదశ డిజిటైజేషన్ గడువు ముగిసినట్టు భావించిన సమయంలో దేశవ్యాప్తంగా అనేక హైకోర్టులిచ్చిన స్టే ఉత్తర్వుల మీద ఎట్టకేలకు విచారణ ప్రారంభమవుతోంది.అన్ని కేసులనూ సుప్రీంకోర్టుకు బదలాయించాలన్న సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ విజ్ఞప్తికి స్పందించిన సుప్రీంకోర్టు ఈ కేసులన్నిటి విచారన బాధ్యత ఢిల్లీ హైకోర్టుకు అప్పగించిన సంగతి తెలిసిందే. మొత్తానికి వచ్చే నెల 7 న ఎక్కువమొత్తం కేసుల విచారణ ప్రారంభించాలని, 8న మరో రెండు కేసులు కూడా విచారించాలని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించుకుంది.

7 న విచారణకు వచ్చే స్టే ఉత్తర్వుల కేసులలో తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య ,  ఎపి ఎమ్మెస్వో వెల్ఫేర్ ఫెడరేషన్, డెన్ మనోరంజన్ శాటిలైట్, భీమా రిద్ధి డిజిటల్ సిస్టమ్స్, రోహ్ తక్ కేబుల్ ఆపరేతర్స్ అసోసియేషన్, సాయి బిగ్ స్టార్ వెల్ఫేర్ అసోసియేషన్, విక్టరీ డిజిటల్, శ్రీ చౌడేశ్వరీ కేబుల్ నెట్ వర్క్, శ్యామ్ బాబా కేబుల్ నెట్ వర్క్, పాంచజన్య మీడియా, భారత్ డిజిటల్ కేబుల్ నెట్ వర్క్, నాసిక్ జిల్లా కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్, యోగేష్ కేబుల్ నెట్ వర్క్స్ ఉన్నాయి.

ఈ మొదటి విడత కేసుల విచారణను 7న జస్టిస్ సంజీవ్ సచ్ దేవ చేపడతారు. ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే పిటిషనర్లందరికీ నోటీసులు జారీచేయటంతోబాటు ప్రతివాది అయిన సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు కూడా నోటీసు జారీచేసింది. మధ్యప్రదేశ్ కు చెందిన డిజియానా సిస్టమ్స్, ఓమ్ సిస్టమ్స్ కేసులు మాత్రం 8న విచారణకు వస్తాయి. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ విచారిస్తారని మంత్రిత్వశాఖ ఇప్పటికే వెల్లడించింది.

మూడో దశ డిజిటైజేషన్ కోసం అవసరమైన సెట్ టాప్ బాక్సులు అందుబాటులో లేకపోయిన ప్రభుత్వం మొండిగా గడువు ముగిసినట్టు ప్రకటించి అనలాగ్ సిగ్నల్స్ నిలిపివేయాలని ఆదేశించటం తగదంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెస్వోలు ఉమ్మడి హైకోర్టులో స్టే తెచ్చుకోవటంతో అదే స్టే ఆధారంగా అనేక రాష్ట్రాలు మూడో దశ డిజిటైజేషన్ గడువు పూర్తికాకుండా స్టే ఆదేశాలు సంపాదించుకొగలిగిన సంగతి తెలిసిందే. ఈ విధంగా మొత్తం 62 కేసులు నమోదైనట్టు టాస్క్ ఫోర్స్ సమావేశం కూడా వెల్లడించింది.

ఈ 62 కేసులలో 12 కేసులను అక్కడి కోర్టులే పరిష్కరించగా ముగ్గురు పిటిషనర్లు తమ కేసులను ఉపసంహరించుకున్నారు. మిగిలినవాటిలో 29 కేసులు ఢిల్లీ హైకోర్టుకు బదలీ అయ్యాయి. ఇంకా 18 కేసులు బదలీ కావాల్సి ఉంది. సెప్టెంబర్ 13 న కూడా ఇంకో రెండు కేసులు ఢిల్లీ హైకోర్టులో విచారణకు వస్తున్నాయి. మొత్తంగా స్టే ఉత్తర్వులకారణంగా మూడో దశలో ఇప్పటికీ అనలాగ్ ప్రసారాలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు నాలుగో దశ డిజిటైజేషన్ కు ప్రభుత్వం ప్రకటించిన గడువు ఈ డిసెంబర్ తో పూర్తి కావాల్సి ఉంది.