• Home »
  • Cable »
  • మూడోదశ డిజిటైజేషన్ పై మరో నెల స్టే: ఎపి, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఆదేశం

మూడోదశ డిజిటైజేషన్ పై మరో నెల స్టే: ఎపి, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఆదేశం

మూడో దశ కేబుల్ డిజిటైజేషన్ గడువు మరో నెల పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మూడో దశ పట్టణాలలో ఇంకోనెలరోజులపాటు అనలాగ్ సిగ్నల్స్ ప్రసారం చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఇప్పటికే రెండు నెలలుగా ఉన్న స్టే ఉత్తర్వులు ఇప్పుడు మరో నెలరోజులపాటు పొడిగించటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెస్వోల సంఘం తరఫున పి. మోహన్, తెలంగాణ ఎమ్మెస్వోల తరఫున సుభాష్ రెడ్డి గత డిసెంబర్ లో హైకోర్టులో స్టే తెచ్చిన విషయం తెలిసిందే. ఆ స్టే గడువు ఈ రోజుతో పూర్తవుతుండటంతో మళ్ళీ కోర్టునాశ్రయించి స్టే ఇంకోనెల కొనసాగేట్టు ఉత్తర్వులందుకున్నారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఎమ్మెస్వోలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గతంలో స్టే ఇవ్వగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి రావచ్చునని భావిస్తున్నారు. ఇలా ఉండగా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ఆదేశాలనూ కలిపి విచారించాలంటూ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన సంగతి తెలిసిందే.