• Home »
  • Cable »
  • ముగ్గురు కేబుల్ టీవీ ఆపరేటర్ల అరెస్ట్

ముగ్గురు కేబుల్ టీవీ ఆపరేటర్ల అరెస్ట్

కేబుల్ టీవీ డిజిటైజేషన్ ప్రభావం ఇప్పుడు నేరుగా కేబుల్ ఆపరేటర్ల మీద తన విశ్వరూపం ప్రదర్శించటం మొదలైంది. ముగ్గురు కేబుల్ ఆపరేటర్లు అరెస్టయ్యే పరిస్థితి వచ్చింది. కొత్త సినిమాలు ప్రదర్శించటం ద్వారా  మేధో సంపత్తి హక్కులు ఉల్లంఘించిన ఆరోపణమీద తమిళనాడులోని తిరుపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు కేబుల్ టీవీ యజమానులను అక్కడి ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలోనూ కొత్త సినిమాలు ప్రదర్శించిన కేబుల్ టీవీలమీద కేసులు పెట్టినప్పటికీ మళ్లీ రాజీపడేవారు. హక్కులు కొనుగోలు చేసిన చానల్స్ కేసు పెట్టిన సందర్భాలలో ఆపరేటర్లు,  ఎమ్మెస్వోలు ఆ చానల్స్ ప్రసారాలను నిలిపివేసి నిరసన తెలియజేసేవారు. కానీ ఇప్పుడు డిజిటైజేషన్ లో ఒప్పందాలు పకడ్బందీగా ఉండటం వలన ఎమ్మెస్వో తన ఇష్టమొచ్చినట్టు చానల్స్ నిలిపివేయటానికి వీల్లేదు.

కొత్త సినిమాలకోసం కోట్లు ఖర్చుపెట్టి హక్కులు కొనుక్కున్న శాటిలైట్ చానల్స్ ఇలాంటి సమాచారం అందుకున్నప్పుడు ఆ కేబుల్ టీవీ ప్రసారాన్ని లోగో సహా రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయటం ద్వారా తన సినిమాలను కాపాడుకుంటాయి. ప్రేక్షకులు ముందే కేబుల్ లో చూస్తే శాటిలైట్ చానల్ లో చూసేవారుండరు. అందుకే ఈ సమస్య.

అయితే, ఈ సమస్య రావటానికి అసలు కారణం మరొకటుంది. గతంలో సినిమానిర్మాతలు శాటిలైట్ చానల్స్ కు శాటిలైట్ హక్కులు, కేబుల్ టీవీలకు కేబుల్ హక్కులు అమ్ముకునేవారు. అయితే చౌక ధరకే హక్కులు కొనుక్కున్న కేబుల్ ఆపరేటర్లు వెంటనే ఆ సినిమాను ప్రదర్శించటం ద్వారా శాటిలైట్ హక్కుల కొనుగోలుదారుల ఆదాయానికి గండి కొడుతున్నారు.

అందుకే 1998 తరువాత శాటిలైట్ చానల్ యజమానులే కేబుల్ హక్కులు కూడా కొనుక్కోవటం మొదలైంది. ఈ పరిస్థితుల్లో 1998 తరువాత విడుదలైన సినిమాలు కేబుల్ టీవీలో ప్రసారం చేయటమంటే కచ్చితంగా పైరసీకి పాల్పడినట్టేనని తేలిపోయింది.

ఇక ప్రస్తుత విషయానికొస్తే, తిరుపూర్ జిల్లా ధారాపురానికి చెందిన శివం టీవీ, బాస్ టీవీ ఉడుమాలపేటకు చెందిన క్రిస్టల్ టీవీ ఎలాంటి ప్రసార హక్కులూ లేకుండా ఎనక్కు వైత్త అడిమై , కత్తి సినిమాలు ప్రదర్శించినందుకు కేసులు నమోదయ్యాయి. ఆ చిత్రాల నిర్మాతల ఫిర్యాదుల ఆధారంగా లక్ష్మణన్ (శివం టీవీ), శివకుమార్ (క్రిస్టల్ టీవీ), ప్రదీప్ ( బాస్ టీవీ) ల మీద కేసులు పెట్టారు.

ఈ కేబుల్ చానల్స్ అదే పనిగా కొత్త సినిమాలను ప్రసారం చేయటం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయని, అందుకే ఫిర్యాదుల మీద దర్యాప్తు అనంతరం లక్ష్మణన్, ప్రదీప్ లను అరెస్ట్ చేశామని, శివకుమార్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. కేబుల్ టీవీ చట్టంకింద, తమిళనాడు అరసు కేబుల్ టీవీ చట్టం కింద కేసులు నమోదు కాగా ఆ కేబుల్ టీవీ కార్యాలయాల్లో పరికరాలు స్వాధీనం చేసుకొని కార్యాలయాలను సీజ్ చేశారు.