• Home »
  • Audience »
  • హాత్ వే చందాలు కట్టకండి: ప్రేక్షకులకు పిలుపునిచ్చిన టైమ్స్

హాత్ వే చందాలు కట్టకండి: ప్రేక్షకులకు పిలుపునిచ్చిన టైమ్స్

ఎమ్మెస్వో హాత్ వే తన పరిధిలోని ప్రేక్షకులకు టైమ్స్ చానల్స్ అందకుండా ప్రసారాలు నిలిపివేయటంతో టైమ్స్ ప్రతిఘటనకు దిగింది. అత్యాశతో అత్యధికంగా కారేజ్ ఫీజు వసూలు చేసుకోవాలన్న ధనదాహంతో హాత్ వే వ్యవహ్రించిన తీరు వల్లనే టైమ్స్ ప్రసారాలు ప్రేక్షకులకు అందటం లేదని టైమ్స్ ఆరోపించింది. హాత్ వే చందాదారులు హాత్ వే ని నిలదీసి టైమ్స్ చానల్స్ తీసుకోవాలని, లేదంటే తమ  బిల్లు చెల్లింపులో కోత విధిస్తామని  కరాఖండిగా తేల్చి చెప్పాలని పిలుపునిచ్చింది. దీంతో ఈ వ్యవహారం టీవీ పరిశ్రమలో తీవ్ర సంచలనం రేపింది.

హాత్ వే మెడలు వంచాలంటే  ప్రేక్షకులనుంచి వత్తిడి రావటం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్న టైమ్స్ నెట్ వర్క్ తన ఉద్యోగుల ద్వారా ఈ పనికి శ్రీకారం చుట్టింది. తన పరిధిలో ఉన్న పది వేల మందికి పైగా ఉద్యోగులనే ఆయుధంగా వాడుకుంటూ సామాన్య ప్రజలకు దగ్గరవ్వాలని నిర్ణయించింది. ఏకపక్షంగా హాత్ వే వ్యవహరిస్తున్న తీరును జనం ముందు పెట్టి ఎండగట్టాలని వ్యూహరచన చేసింది. దేశవ్యాప్తంగా తన నెట్ వర్క్ లోని ఉద్యోగులందరికీ ఒక బహిరంగ లేఖ రాసింది.

హాత్ వే తన గొంతెమ్మ కోర్కెలు తీర్చాలంటూ టైమ్స్ నెట్ వర్క్ మీద వత్తిడి తీసుకురావటం వల్లనే టైమ్స్ చానల్స్ ప్రేక్షకులకు దూరమయ్యాయని ఆ మెయిల్ లో పేర్కొన్నారు. కారేజ్ ఫీజు అన్యాయంగా వసూలు చేయాలనుకోవటం దుర్మార్గమంటూ చందాదారులే ఈ పరిస్థితి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేయటం గమనార్హం.

 “మీరు హాత్ వే చందాదారులైతే వాళ్ళ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి  టైమ్స్ చానల్స్ కావాలని ఫోన్ చేసి అడగండి. టైమ్స్ చానల్స్ ఇస్తేనే నెలవారీ  చందా కడతామని హెచ్చరించండి. ఒకవేళ వాళ్ళు మారకపోతే మీరు చందాకట్టేటప్పుడు ఆ మేరకు కోత పెట్టండి. మీరు మద్దతు ఫలితం మాకెంతగానో సహాయపడుతుంది. మీకూ అదెంతో ప్రయోజనకరం” అని టైమ్స్ ప్రతినిధి అశిష్ జైన్ పేర్కొన్నారు.  

కారేజ్ ఫీజు విషయంలో ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా హాత్ వే ఈ నెల 10 నుంచి దాదాపు కోటి ఇళ్ళకు టైమ్స్ ప్రసారాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.  దీంతో ప్రధానంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నగరాలలోని హాత్ వే చందాదారులకు టైమ్స్ చానల్స్ ప్రసారాలు అందటం లేదు.