• Home »
  • Broadband »
  • మూడో ఏడాదీ లాభాల బాటలో తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ

మూడో ఏడాదీ లాభాల బాటలో తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ

ప్రేక్షకుల మీద చందా భారాన్ని అదుపులో ఉంచుతూనే తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని అరసు కేబుల్ టీవీ వరుసగా మూడో ఏడాది కూడా లాభాల బాటలో సాగుతోంది. ఒకవైపు డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్స్ రాకపోవటంతో కోర్టులో పోరాడుతూనే డిజిటల్ హెడ్ ఎండ్ ఏర్పాటు చేసుకోవటంతోబాటు ఇంటింటికీ బ్రాడ్ బా డ్ సేవలకూ సిద్ధమైంది. ప్రజాసేవతోబాటు లాభాలు ఎలా సాధ్యమో నిరూపించింది.

తమిళనాడు సమాచార సంకేతిక పరిజ్ఞాన శాఖామంత్రి ఎం. మణికంఠన్ శాశ్నసభ సమావేశాల సందర్భంగా సమర్పించిన నివేదికలో అరసు కేబుల్ పురోగతిని వివరించారు. పే చానల్ యాజమాన్యాలతో చర్చలు, సంప్రదింపుల ద్వారా ధరలు తగ్గించటం ద్వారా చందాదారులమీద భారం తగ్గిస్తూ వచ్చినట్టు అందులో పేర్కొన్నారు. ఆ విధంగ రూ. 11 కోట్ల 50 లక్షలు ఆదా అయింది.

ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అరసు లాభం roo.32 కోట్ల 60 లక్షలు. అంతకు ముందు ఆర్థిక సంవత్సర లాభం రూ. 18 కోట్ల 60 లక్షలు. 2011 లో  చందాదారుల సంఖ్య 5 లక్షలుండగా ఇప్పుడది భారీగా పెరిగి 70 లక్షల 52 వేలకు చేరింది. 26 వేల 246 మంది కేబుల్ ఆపరేటర్లు ఈ వ్యవస్థలో సేవలందిస్తున్నారు.

అరసు కేబుల్ చెన్నై మెట్రో నగరంలో 90 నుంచి 100 చానల్స్ అందిస్తూ నెలవారీ చందా రూ.70 వసూలు చేస్తోంది. 820 మంది కేబుల్ ఆపరేటర్ల ద్వారా 3 లక్షల 40 వేలమంది చందాదారులకు ప్రసారాలు అందిస్తోంది. పే చానల్స్ నుంచి డిస్కౌంట్లు పొందటం ద్వారా ఖర్చు అదుపు చేస్తూ లాభాల్లో నడవటం సాధ్యమైందని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది.

అనలాగ్ లో ప్రసారాలు అందిస్తున్న అరసు కేబుల్ రాష్ట్ర వ్యాప్తంగా పాత ఎమ్మెస్వోల నుంచి లీజుకు తీసుకున్న హెడ్ ఎండ్స్ ( కంట్రోల్ రూమ్స్ ) నుంచి ప్రసారాలు అందిస్తూ వస్తోంది. 27 జిల్లాల్లో లీజుల మీద ఆధారపడగా నాలుగు జిల్లాల్లో అత్యాధునిక హెడ్ ఎండ్స్ నెలకొల్పింది. ఇప్పుడు మొత్తం 83 హెడ్ ఎండ్స్ నుంచి 26 వేల 246 మంది ఆపరేటర్ల సాయంతో ఇంటింటికీ ప్రసారాలు అందిస్తోంది

అయితే, డిజిటల్ లైసెన్స్ రాకపోవటంతో అరసు కేబుల్ భవిష్యత్తు అయోమయంలో పడింది. రాష్ట్ర ప్రభుత్వాలకు గాని కేంద్ర ప్రభుత్వం విభాగాలకు గాని టీవీ రంగంలో ప్రసారాలకూ, పంపిణీకీ అనుమతి లేదని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిబంధనలు సూచిస్తుండటంతో చిక్కులు మొదలయ్యాయి. ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అడ్డు తగలటం తగదని తమిళనాడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఇప్పటివరకూ ప్రభుత్వంనుంచి ఎలాంటి స్పందనా కనబడలేదు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది.

అయినప్పటికీ అరసు కేబుల్ తన పని తాను చేసుకుంటూ పోతోంది. డిజిటల్ హెడ్ ఎండ్ ఏర్పాటుకు, సెట్ టాప్ బాక్సుల సమీకరణకు సిద్ధమైంది. మరో వైపు కమ్యూనికేషన్లు, ఐటి మంత్రిత్వశాఖ నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గా మొత్తం రాష్ట్రవ్యాప్త సేవలకు అనుగుణంగా లైసెన్స్ తీసుకుంది. రైల్ టెల్ తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకొని రాష్ట్రమంతటా కేబుల్ ఆపరేటర్ల ద్వారా ఇంటింటికీ బ్రాడ్ బాండ్ సేవలు అందించబోతోంది. పైలట్ ప్రాజెక్టుగా 35 మంది ఆపరేటర్ల పరిధిలో 1000 కనెక్షన్లు ఇచ్చి పనితీరును పరిశీలిస్తోంది.