• Home »
  • Broadband »
  • తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో కేబుల్ ఇంటర్నెట్ : 3 వేల కోట్లతో భారత్ నెట్

తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో కేబుల్ ఇంటర్నెట్ : 3 వేల కోట్లతో భారత్ నెట్

తమిళనాడులో ఇంటింటికీ కేబుల్ ద్వారా ప్రసారాలు అందజేస్తున ప్రభుత్వం ఇప్పుడు ప్రతి గ్రామపంచాయితీని ఆప్టికల్ ఫైబర్ తో కలిపేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సాయంతో 3 వేల కోట్ల పథకాన్ని చేపట్టింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ మేరకు ఆ రాష్ట శాసనసభలో ఒక ప్రకటన చేశారు. ఆ విధంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో ఆప్టిక్ ఫైబర్ ద్వారా 12,524 గ్రామ పంచాయితీలను కలపబోతోంది.

ఇందుకోసం వెచ్చించే రూ.3 వేలకోట్ల రూపాయలలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. ఇప్పటికే తమిళనాడు అరసు కేబుల్ నెట్ వర్క్ పేరుతో కేబుల్ సేవలందిస్తున్న రాష్ట ప్రభుత్వం ఇప్పుడు బ్రాడ్ బాండ్ సేవలకోసం ప్రత్యేకంగా తమిళనాడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేబుల్ ద్వారా ఇంటెర్నెట్ ప్రొటోకాల్ టీవీ (ఐపిటీవీ) తో బాటు బ్రాడ్ బాండ్ నెట్ కనెక్టివిటీ కూడా చౌక ధరకే అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.