• Home »
  • Cable »
  • తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ ఆదాయం ఏడాదికి 182 కోట్లు

తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ ఆదాయం ఏడాదికి 182 కోట్లు

తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అరసు కేబుల్ టీవీ కార్పొరేషన్ కి 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 181కోట్ల 91 లక్షలు వచ్చింది. ప్రారంభించిన మొదటి సంవత్సరం 2010-11 లో కేవలం రూ.2 కోట్లు ఉన్న రాబడి కేవలం నాలుగేళ్లలో ఈ స్థాయికి వచ్చింది. తమిళనాడు శాసనసభలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ప్రవేశపెట్టిన నోట్ లో ఈ వివరాలు వెల్లడించారు. చందాదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటంతోబాటు ప్రైవేట్ చానల్స్ నుంచి కారేజ్ ఆదాయం వలన ఈ పెరుగుదల సాధ్యమైనట్టు అందులో వివరణ ఇచ్చారు.

డిఎంకె ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటైనప్పటికీ ఆయన కొద్ది నెలలలే దీన్ని పక్కనబెట్టగా అన్నాడిఎంకె అధినాయలురాలు జయలలిత హయాంలో దీన్ని పరుగులు పెట్టించి ఇంటింటికీ చౌకగా కేబుల్ టీవీ ప్రసారాలు అందించటం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. 2011 లో 4 లక్షల 94 వేల చందాదారులతో ప్రారంభం కాగా ప్రస్తుతం ఈ సంఖ్య 70 లక్షల 52 వేలకు చేరుకుంది. మొత్తం 26,246 మంది కేబుల్ ఆపరేటర్ల ద్వారా ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వహిస్తోంది.

అయితే, తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఎమ్మెస్వో కు డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ దాదాపు నాలుగేళ్ళుగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ దగ్గర పెండింగ్ లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు శాటిలైట్, కేబుల్ టీవీ చానల్ రంగంలో ప్రవేశించకూడదన్న ట్రాయ్ నిబంధనలను సాకుగా చూపి ఇప్పటివరకూ లైసెన్స్ ఇవ్వలేదు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తకువ ధరకే కేబుల్ సర్వీస్ ఇస్తున్నామని చెప్పినా ఫలితం కనబడ లేదు.

ఆపరేటర్లకు అదనపు ఆదాయం రావటం కోసం ఈ మధ్యనే బ్రాడ్ బాండ్ సేవలు కూడా ప్రారంభించింది. ఇందుకోసం రైల్ టెల్ నుంచి బాండ్ విడ్త్ ఒప్పందం కుదుర్చుకుంది. పైలెట్ ప్రాజెక్టుగా 35 మంది ఆపరేటర్ల ద్వారా 1000 కనెక్షన్లు ఇచ్చింది. ఇకమీదట బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ కు విరివిగా ప్రాచుర్యం కల్పించాలని కూడా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.