• Home »
  • Cable »
  • ఎమ్మెస్వో-ఆపరేటర్ వివాదాల సత్వర పరిష్కారం: బొంబాయ్ హైకోర్టు ఆదేశాల మీద ట్రాయ్ స్పందన

ఎమ్మెస్వో-ఆపరేటర్ వివాదాల సత్వర పరిష్కారం: బొంబాయ్ హైకోర్టు ఆదేశాల మీద ట్రాయ్ స్పందన

డిజిటైజేషన్ వ్యవస్థలో ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలలో ఏర్పడుతున్న వివాదాలకు తెరదించేందుకు సిద్ధంగా ఉన్నట్టు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకటించింది. బొంబాయ్ హైకోర్టు ఈ విషయమై ఇచిన ఆదేశాలమీద ట్రాయ్ చాలా వేగంగా స్పందించింది. ఎక్కడెక్కడ సమస్యలు ఎదురవుతున్నాయో, ఏయే అంశాలమీద ఏకాభిప్రాయం కుదరటం లేదో వెంటనే తెలియజేయాలంటూ ఎమ్మెస్వోలకూ, కేబుల్ ఆపరేటర్లకూ ట్రాయ్ లేఖలు రాసింది.

తమ సమస్యలను das@trai.gov.in అనే చిరునామాకు ఈ మెయిల్ చేయాలంటూ ఒక ప్రొఫార్మాను కూడా పంపింది. ట్రాయ్ జోక్యం ఏయే అంశాల్లో అవసరమో చెబుతూ ఈ నెల 14 లోగా మెయిల్ పంపాలని కోరింది. రెండు వారాల్లోగా ఇరుపక్షాలతో సమావేశం ఏర్పాటుచేసి నాలుగు వారాల్లోగా సమస్యలు పరిష్కరించాల్సిందిగా బొంబాయ్ హైకోర్టు ఈ నెల 1 న ఆదేశించిన నేపథ్యంలో ట్రాయ్ ఈ విధంగా స్పందించింది.

ట్రాయ్ గనుక పరిష్కరించలేకపోతే తుది విచారణ చేపడతామని కూడా బొంబాయ్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న ట్రాయ్ ని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మూడు వారాల్లో సమాధానమివ్వాలని కోర్టు ఆదేశించింది. కేవలం కోర్టుకొచ్చినవారికే నోటీసులిచ్చి సమస్యను పరిష్కరించటానికి బదులు ఇతర ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్ల సంఘాలకు కూడా తెలియజేసి శాశ్వత పరిష్కారం దిశలో ప్రయత్నించాలని సూచించింది. తదుపరి విచారణని అక్టోబర్ 13 కు వాయిదా వేసింది.

ట్రాయ్ జారీ చేసిన డిజిటైజేషన్ నిబంధనలను సవాలు చేస్తూ మహారాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య, నాసిక్ కేబుల్ ఆపరేటర్ల సంఘం బొంబాయ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఎమ్మెస్వోల ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలను కూడా వారు సవాలు చేశారు. ఈ పిటిషన్లమీద హైకోర్టు విచారణ చేపట్టి ట్రాయ్ కి ఆదేశాలు జారీచేసింది.