• Home »
  • Entertainment »
  • సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చందా రేట్లు చెప్పాలని పే చానల్స్ కు ట్రాయ్ ఆదేశాలు

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చందా రేట్లు చెప్పాలని పే చానల్స్ కు ట్రాయ్ ఆదేశాలు

ట్రాయ్ అవకాశమిచ్చిన 27.5% చందాల పెంపును సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కొత్త రేట్లు వెల్లడించాలని ట్రాయ్ పే చానల్స్ ను ఆదేశించింది. తమ అధీనంలోని ఏ చానల్స్ గరిష్ఠ నెలసరి చందాతోబాటు ప్రకటనలు ఎంత సమయం చూపిస్తున్నారో కూడా తెలియజేయాలని కోరింది. ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలకు ఆలస్యం కాకుండా వెంటనే వివరాలు సమర్పించాలని సూచించింది.

ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవటంతోబాటు ఎమ్మెస్వోల మధ్య ఎలాంటి వివక్షా చూపకుండా ఉండేందుకు పే చానల్స్ తమ చందా రేట్లను ప్రకటించాల్సి ఉందంటూ హోమ్ కేబుల్ నెట్ వర్క్స్ అధిపతి విక్కీ చౌధురి ట్రాయ్ కొత్త చైర్మన్ కు లేఖ రాసిన నేపథ్యంలో ట్రాయ్ స్పందించింది. కొత్త చందారేట్లకు విధానం రూపొందించాలని ట్రాయ్ ని సుప్రీంకోర్టు కోరినప్పటికీ ఈలోపు పే చానల్ యాజమాన్యాలే తమ రేట్లు వెల్లడించాలని చెప్పటం విశేషం.

పే చానల్స్ ఇప్పటికే పెంచి వసూలు చేసిన మొత్తాలను వెనక్కి ఇవ్వాలని ఎమ్మెస్వోలు ఇప్పుడే పట్టుబట్టవద్దని, తరువాత లెక్కలు సరిచూసుకొని సర్దుబాటు చేసుకొవచ్చునని సుప్రీంకోర్టు చెప్పటం వలన డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్ కంటే అనలాగ్ లో ఎక్కువ ఇబ్బందుఎదురవుతున్నాయని ఎమ్మెస్వోలు ట్రాయ్ కి చెప్పారు. వెంటనే రేట్ల విషయం ఒక కొలిక్కి తీసుకురావాలన్న అభ్యర్థనమీద ట్రాయ్ స్పందించింది