టీవీ వాడకందారులూ, స్పందించండి!

డిజిటైజేషన్ లో సేవల నాణ్యత మీద వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకోవటానికి విడుదల చేసిన చర్చాపత్రం మీద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్ ) జులై 1 వరకుగడువు పొడిగించింది.  మే 18 న ట్రాయ్ చర్చాపత్రం విడుదలచేస్తూ డిజిటైజేషన్ లో సేవలు ఉండాల్సిన తీరుతెన్నులను ప్రస్తావించింది. నాలుగో దశ డిజిటైజేషన్ కూడా సాగుతుండగా దేశవ్యాప్తంగా టీవీ వినియోగదారులకు అందాల్సిన సేవల విషయంలో ఒక నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించే క్రమంలో ట్రాయ్  ఒక చర్చాపత్రాన్ని రూపొందించింది.

కేబుల్ టీవీ డిజిటైజేషన్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ, డిటిహెచ్ రూపంలో కొన్నేళ్ళ కిందటే డిజిటైజేషన్ జరిగింది. హెడ్ ఇండ్  ఇన్ ద స్కై (హిట్స్) రూపంలోను, ఐపిటివి రూపంలోను ఇప్పుడు తాజాగా డిజిటైజేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో డిజిటల్ పంపిణీ వేదికలే భవిష్యత్తుగా మారిపోయాయి. కొత్త టెక్నాలజీతోబాటే నిబంధనలూ తయారయ్యాయి. అయితే వినియోగదారుల హక్కుల పరిరక్షణ, సేవల్లో లోపాలకు ఆయా పంపిణీ సంస్థలని బాధ్యులుగా చేయటం లాంటి అంశాలమీద ట్రాయ్ అభిప్రాయాలు కోరుతోంది.

గతంలో ఇచ్చిన గడువులోగా వినియోగదారులు తమ అభ్యంతరాలు తెలియజేసే అవకాశం లేదు కాబట్టి మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించింది.  గతంలో జూన్ 17 వరకే అవకాశం ఇచ్చినప్పటికీ ఈ విషయంలో స్పందించాల్సింది వినియోగదారులు కాబట్టి మరింత సమయం ఇవ్వటం సమంజసమని ట్రాయ్ భావించింది. ఈ అభిప్రాయాలమీద ప్రతిస్పందించటానికి  మరో వారం పాటు గడువు ఇచ్చింది.

చందాదారులు ఒక సర్వీస్ ప్రొవైడర్ నుంచి మరొక సర్వీస్ ప్రొవైడర్ కు మారటానికి కనీసం కొంత వ్యవధి ఉండాలా, కనెక్షన్ తొలగించాలంటే ఎంత గడువు ఇవ్వాలి? ఏదైనా చానల్ నిలిపివేయాలంటే చందాదారుకు ఎంత ముందుగా తెలియజేయాలి? పాకేజీల మార్పు విషయం ఎప్పుడు తెలియజేయాలి? అనే రకరకాల అంశాలతో 50 కి పైగా ప్రశ్నలతో ట్రాయ్ ఆ చర్చాపత్రంలో పేర్కొంది. పూర్తి చర్చా పత్రం కోసం ఈ కింది లింక్ చూడండి:

http://trai.gov.in/Content/ConDis/20772_0.aspx