• Home »
  • Audience »
  • డిజిటల్ హెడ్ ఎండ్స్ తనిఖీ ఆడిటర్ల నియామకంపై స్పందనకు గడువు పెంపు

డిజిటల్ హెడ్ ఎండ్స్ తనిఖీ ఆడిటర్ల నియామకంపై స్పందనకు గడువు పెంపు

టీవీ చానల్స్ ను పంపిణీ చేసే డిజిటల్ వేదికలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు, హిట్స్, ఐపిటీవీ ఆపరేటర్ల లావాదేవీలను, సాంకేతిక ఏర్పాట్లను తనిఖీ చేసి నివేదికలిచ్చేందుకు స్వతంత్ర ఆడిటర్లను నియమించాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) భావిస్తోంది.  అర్హతలున్న సంస్థలను, వ్యక్తులను స్వతంత్ర ఆడిటర్లుగా ఎంపానెల్ చేసి వాళ్లచేత తనిఖీలు చేయించుకునే ఏర్పాటు చేయబోతోంది.

ఈవిషయంలో సంబంధిత విభాగాల వారి స్పందించి అభిప్రాయాలు తెలియజేయటానికి జనవరి 22 ఆఖరు తేదీ కాగా ఇప్పుడు ఆ తేదీని ఫిబ్రవరి 5 వరకు పొడిగించినట్టు ట్రాయ్ ప్రకటించింది. అదే విధంగా ఆ అభిప్రాయాలమీద స్పందించటానికి 19 వరకు సమయమిచ్చింది. ఇకమీదట ఎలాంటి పొడిగింపూ ఉండబోదని కూడా స్పష్టం చేసింది.

టీవీ చానల్స్ ను పంపిణీ చేసే డిజిటల్ వేదికలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు, హిట్స్, ఐపిటీవీ ఆపరేటర్ల లావాదేవీలను, సాంకేతిక ఏర్పాట్లను తనిఖీ చేసి నివేదికలిచ్చేందుకు స్వతంత్ర ఆడిటర్లను నియమించాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) భావిస్తోంది.  అర్హతలున్న సంస్థలను, వ్యక్తులను స్వతంత్ర ఆడిటర్లుగా ఎంపానెల్ చేసి వాళ్లచేత తనిఖీలు చేయించుకునే ఏర్పాటు చేయబోతోంది.

డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్స్ కోసం ఆడిటర్ల  ఎంపానెల్ మెంట్ పేరుతో ట్రాయ్ ఒక చర్చాపత్రం జారీచేసి సంబంధిత భాగస్వాములందరూ తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. పంపిణీ వేదికల తీరును తనిఖీ చేసి ధ్రువపత్రం జారీచేయదగ్గ ఆడిట్ సంస్థలు లేదా వ్యక్తుల ఎంపానెల్ మెంట్ కు ఎలాంటినిబంధనలు విధించాలి, వాటి పరిధి ఎలా ఉండాలి, ఆడిట్ ఫీజు ఎంత ఉండాలి, చెల్లింపు ఎలా జరగాలి, ఆడిట్ ఎంత సమయంలో పూర్తి చేయాలి, ఎంపానెల్ మెంట్ నుంచి ఎలా తొలగించాలి, నివేదికలు ఎలా ఇవ్వాలి అనే అంశాల మీద అభిప్రాయాలను కోరుతోంది.

ఆడిట్ చేయాల్సిన అంశాలను కూడా నిర్ణయించటం ఈ చర్చా పత్రంలో కీలకభాగం. కండిషనల్ యాక్సెస్ సిస్టమ్, సబ్ స్క్రిబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లను తనిఖీ చేయటంతోబాటు ఆ హెడ్ ఎండ్ వాడుకుంటున్న కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ఎలా పనిచేస్తున్నది, అది గతంలో ఎప్పుడైనా హాకింగ్ కి గురైనట్టు దాని చరిత్ర చెబుతున్నదా అనే విషయాలను తనిఖీ చేస్తారు. అదే విధంగా ఎసెమ్ ఎస్ అన్ని కీలక విషయాలనూ నమోదు చేయగలుగుతున్నదా, అందరు చందాదారులకు  సంబంధించిన  సమాచారాన్ని  భదరపరుస్తున్నదా, ఒక్కో సెట్ టాప్ బాక్స్ ఎక్కడ ఉన్నదీ కనిపెట్టగలుగుతున్నదా, సెట్ టాప్ బాక్సులు, వ్యూయింగ్ కార్డ్ ( విసి) ను అనుసంధానం చేయగలుగు తున్నదా అనే విషయాలను పరిశీలించి ధ్రువీకరించటం ఈ ఆడిటర్ల పరిధిలో ఉంటుంది.

అందుకే డిమాండ్-సప్లై సూత్రానికి అనుగుణంగా అవసరమైతే కొన్ని అర్హతలు సడలించి మరీ కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని ట్రాయ్ అభిప్రాయపడింది. అందుకే ఎలాంటి షరతులు విధించాలో సూచించే సమయంలోనే అందుబాటు గురించి కూడా  ఆలోచించాలంటోంది. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1500 హెడ్ ఎండ్స్ తనిఖీకి ఎంతమంది అవసరమవుతారు, ఏ షరతులు విధిస్తే ఎంతమంది అర్హులు దొరుకుతారు అనే విషయంలో ఒక అంచనాకు రాలేకపోతున్నట్టు ట్రాయ్ ఒప్పుకుంది. సూచనల అనంతరం మాత్రమే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని స్వయంగా ప్రకటించింది.

ఫీజు విషయంలో కూడా తగిన సూచనలివ్వాలని కోరుతోంది. అయితే, ట్రాయ్ కూడా మూడు రకాలైన ఫీజు నమూనాలను సూచిస్తూ మరింతగా ఆలోచించాలని విజ్ఞప్తి చేసింది. చందాదారుల సంఖ్య ఆధారంగా ఫీజు నిర్ణయించటం ఒక పద్ధతి కాగా అడిటర్ నిర్దేశించే మొత్తాన్ని ఫీజుగా ఒప్పుకోవటం మరో పద్ధతి. అయితే, ఈ రెండూ కాకుండా ఈ రెండు నమూనాల మేలు కలయికను అమలు చేయటం మూడో పద్ధతి.

చందాదారుల సంఖ్య ఆధారంగ నిర్ణయించటమంటే చురుగ్గా ఉన్న చందాదారుల సంఖ్యను లెక్కలోకి తీసుకోవాలా రిజిస్టరైన వారందరినీ చందాదారులుగా పరిగణించాలా అన్నది మరో ప్రశ్న. అలా కాకుండా ఒక కనీస మొత్తాన్ని నిర్ణయించి, ఆ పైన చందాదారుల సంఖ్య ఆధారంగా ఫీజు నిర్ణయించటమా అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆడిటర్ తానే స్వయంగా ఫీజు నిర్ణయించుకునే అవకాశమిస్తే, అది ఎలా అనేది కొన్ని నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం జరగాలి. అత్యంత పారదర్శకంగానూ, అందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలు జరిగే విధంగాను ఉండాలి. అది ముందుగా ప్రకటించటం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేసినట్టవుతుంది.

ఆడిట్ సకాలంలో పూర్తి కావాలంటే ఆడిటర్ మీద కొన్ని ఆంక్షలు ఉండాలని కూడా ట్రాయ్ అభిప్రాయపడింది. సకాలంలో ఆడిట్ పూర్తి చేయలేని ఆడిటర్లమీద జరిమానా విధించటమో, వారి పారితోషికంలో కోత విధించటమో ఏదొ సమంజసమో సూచించాలని ట్రాయ్ కోరింది. ఆలస్యానికి సైతం ఒక పరిమితి ఉండాలన్నదే ట్రాయ్ అభిమతం. ఎందుకంటే పరిమితి మించి ఆలస్యం జరిగితే ఆ ఎమ్మెస్వో వ్యాపరానికి నష్టం వాటిల్లే ప్రమాదముంటుంది. అందుకే ఈ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించక తప్పదు. అందువలన ఒక గరిష్ఠ పరిమితి కూడా విధిస్తారు. ఆ తరువాత పానెల్ నుంచి తొలగిస్తారు.

టీవీ పరిశ్రమలో ఈ నిర్ణయాల వలన ప్రభావితమయ్యేవాళ్ళందరూ అంటే ముఖ్యంగా పంపిణీ వేదికలు, బ్రాడ్ కాస్టర్లు ఈ చర్చాపత్రాన్ని అధ్యయనం చేసిన మీదట చర్చకు పెట్టిన అంశాలమీద అంశాలవారీగా స్పందించాలని ట్రాయ్ కోరుతోంది. ఫీజు నిర్ణయం మొదలుకొని తనిఖీ అంశాలు, అర్హతలు, కాలవ్యవధి, ఆలస్యానికి జరిమానా వంటి విషయాలమీద అభిప్రాయాలు ఫిబ్రవరి 5  లోగా ట్రాయ్ కి పంపాల్సి ఉంటుంది. ఆ అభిప్రాయాలను ట్రాయ్ తన వెబ్ సైట్ లో ఉంచుతుంది. వాటిమీద స్పందించటానికి ఫిబ్రవరి 19 వరకూ సమయం ఉంటుంది.

మెయిల్ చేయాల్సిన చిరునామా:

sksinghal@trai.gov.in లేదా smk.chandra@trai.gov.in