• Home »
  • Broadcasting »
  • టీవీ లైసెన్సింగ్ విధానం మీద చర్చాపత్రం: అభిప్రాయాలకు గడువు 31కి పొడిగింపు

టీవీ లైసెన్సింగ్ విధానం మీద చర్చాపత్రం: అభిప్రాయాలకు గడువు 31కి పొడిగింపు

టీవీ లైసెన్సింగ్ విధానంలో ఎలాంటి మార్పులు అవసరమో సూచించాల్సిందిగా టీవీ పరిశ్రమకు చెందిన వివిధ వర్గాలను కోరుతూ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక చర్చాపత్రం విడుదల చేసింది. అభిప్రాయాలు ఈ నెల 18 లోగా పంపాలని గతంలో కోరగా ఇప్పుడు ఆ గడువును ఈ నెలాఖరు దాకా పొడిగిస్తూ ప్రకటన జారీచేసింది.

టీవీ చానల్స్ లైసెన్సింగ్ విధానం మీద సమీక్ష జరిగి ఆరేళ్ళు పూర్తయింది. ఇప్పుడు అమలులో ఉన్న నిబంధనలు 2011 డిసెంబర్ నాటివి. ఆ తరువాత కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎన్నో లోపాలు బైటపడ్దాయి. అందుకే సరికొత్త నిబంధనావళి అవసరమని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అభిప్రాయపడుతోంది. అందుకు అనుగుణంగానే సిఫార్సులకోసం నియంత్రణ సంస్థ అయిన ట్రాయ్  ని సంప్రదించింది. పరిశ్రమలోని వివిధ వర్గాల అభిప్రాయాల సేకరణకోసం ట్రాయ్ ఒక చర్చా పత్రం విడుదల చేసింది.

ఈ చర్చా పత్రం ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలమీద దృష్టి సారిస్తోంది. చానల్ ప్రారంభించాలంటే ఆ సంస్థకు ఉండాల్సిన కనీస నెట్ వర్త్ నిబంధనను యథాతథంగా ఉంచటమా, సవరించటమా అనే అంశం మొదలుకొని చర్చ ప్రారంభించాల్సి ఉంది. లైసెన్స్ మంజూరి కోసం హోం శాఖ అనుమతితో బాటు టెలికమ్యూనికేషన్ తదితర విభాగాల అనుమతి ఏ మేరకు అవసరం, లైసెన్స్ ఫీజు ఎంత ఉండాలి, చానల్ ఎన్ క్రిప్షన్ వివరాలు, లైసెన్సుల బదలాయింపు లాంటివి ప్రధానంగా చర్చలో భాగమవుతాయి.

ఇలా అనేక అంశాలమీద అభిప్రాయాలు సేకరించటానికి ఈ చర్చా పత్రం వెలువరించిన ట్రాయ్ అందరూ స్పందించి తగిన సూచనలివ్వాలని కోరుతోంది. ఈ చర్చలో పాల్గొని ట్రాయ్ చేయబోయే సిఫార్సులకు తమవంతుగా అభిప్రాయాలు వెల్లడించదలచుకున్నవారు ముందుగా ఈ లింక్ లో ఉన్న చర్చా పత్రం పాఠాన్ని మొత్తం  చదవాలి.

http://trai.gov.in/sites/default/files/CP_ICT_20122017.pdf

ఆ తరువాత లిఖితపూర్వకమైన సూచనలు, సలహాలు, అభిప్రాయాలు జనవరి 31, 2018 లోపు

Shri S. K. Singhal, Advisor (B&CS), Telecom Regulatory Authority of India

 E Mail:  sksinghal@trai.gov.in or  vk.agarwal@trai.gov.in.

 

చిరునామాకు పంపాలి. ఈ అభిప్రాయాలను ట్రాయ్ తన వెబ్ సైట్ లో ఉంచుతుంది. వాటిమీద తిరిగి స్పందించ దలచుకున్నవాళ్ళకు మరో రెండు వారాల సమయం ఉంటుంది.