• Home »
  • Broadcasting »
  • ప్రైవేట్ రంగంలో డిజిటల్ రేడియో సేవలకు ట్రాయ్ సానుకూలం

ప్రైవేట్ రంగంలో డిజిటల్ రేడియో సేవలకు ట్రాయ్ సానుకూలం

ప్రస్తుతం ఎఫ్ ఎం రేడియో బ్రాడ్ కాస్టింగ్ కోసం ఉపయోగిస్తున్న 88-108 మెగా హెర్ట్జ్  ఫ్రీక్వెన్స్సీ  బాండ్ లోనే డిజిటల్ రేడియో సేవలందించేందుకు ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) భావిస్తోంది. ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వశాఖలకు తన సిఫార్సులను తెలియజేసింది.

భారతదేశంలో డిజిటల్ రేడియో ప్రసార సేవలు పేరుతో పంపిన సిఫార్సులలో స్పెక్ట్రమ్ సమర్థ వినియోగానికి డిజిటల్ రేడియో సేవలు అవసరమని ట్రాయ్ అభిప్రాయపడింది. అప్పుడే రేడియో శ్రోతలకు వైవిధ్యభరితమైన ప్రసారాలు అందటానికి వీలవుతుందని పేర్కొంది. అందుకే ఒకనిర్దిష్ట కాలపరిమితిలో  డిజిటల్ రేడియో సేవల అందుబాటు విధానం అమలయ్యేలా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరింది.

డిజిటల్ రేడియో రెసీవర్లు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా వాటి తయారీదారులకు రాయితీలు ప్రకట్ఇంచాలని కూడా ట్రాయ్ సూచించింది. ఇదిడిజిటల్ రేడియో ప్రసార విధానం ప్రకటించిన తరువాత కనీసం మూడేళ్ళ పాటు అమలులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని పేర్కొంది. ఫ్రీక్వెన్సీ కేటాయింపు విధానంలో తగిన మార్పులు చేయటానికి టెలికామ్ శాఖలోని వైర్ లెస్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ విభాగం ( డబ్ల్యుపి సి) సిద్ధంగా ఉండాలని కోరింది.

ప్రస్తుతం ఉన్న ఎఫ్  రేడియో కేంద్రాలుసైతం తమ ప్రసారాలను అనలాగ్ విధానంతోబాటు డిజిటల్ లో కూడా అందించేందుకు అవకాశం కల్పిస్తూ అందుకు తగినవిధి విధానాలు రూపొందించాల్సిన అవసరముందని ట్రాయ్ అభిప్రాయపడింది. అవసరమైతే ఇందుకోసం ప్రత్యేకంగా వేలం కూడా జరపవచ్చునని సూచించింది. డిజిటల్ రేడియో వేలం ధరకు, ప్రస్తుతం చెల్లిస్తున్న ధరకు మధ్య తేడా మొత్తాన్ని చెల్లించే అవకాశం కల్పిస్తే అప్ గ్రేడ్ కావటానికి అనేక ఎఫ్ ఎం సంస్థలు ఆసక్తి చూపే అవకాశమున్నట్టు ట్రాయ్ తెలియజేసింది.