• Home »
 • Cable »
 • రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ కోసం ట్రాయ్ చెప్పే మూడు నమూనాలు ఏంటి?

రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ కోసం ట్రాయ్ చెప్పే మూడు నమూనాలు ఏంటి?

కేబుల్ టీవీ డిజిటైజేషన్ లో అత్యంత కీలకంగా మారిన రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ మీద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించింది. అటు పే చానల్స్ గరిష్ఠ ధరల నిర్ణయంలోనూ, ఇటు అ లా కార్టే, బొకే ధరల విషయంలోనూ నిర్దిష్టమైన నియంత్రణ సాధించటానికి, అన్ని వర్గాలవారికీ ఆమోద యోగ్యంగా ఉండటానికి అనువైన ఆర్ ఐ ఓ ఒప్పందాలను రూపొందించటం తక్షణ కర్తవ్యంగా భవిస్తోంది. అదే సమయంలొ ఈ ఒప్పందాలు ఏకపక్షంగా ఉండకుండా చూసేందుకు, విమర్శలు రాకుండా ఉండేందుకు వీలుగా పారదర్శకంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ పాటికే ఒక చర్చా పత్రాన్ని విడుదలచేసి మార్చి 18 ని గడువు తేదీగా ప్రకటించింది.

రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ద్వారా మాత్రమే చానల్స్ కు ఆయా వర్గాల ఆధారంగా గరిష్ఠ ధర నిర్దేశించుకోవటం సాధ్యమవుతుందని, బ్రాడ్ కాస్టర్లు ఏవైనా డిస్కౌంట్లు ఇవ్వదలచుకున్నా ఒక ప్రాతిపదిక తయారవుతుందని ట్రాయ్ చెబుతోంది. టీవీ రంగంలో వచ్చిన పరిణతి, వివిధ వర్గాల వారి ఆలోచనా ధోరణి ఫలితంగా అందరికీ ఆమోదయోగ్యమైన నమూనా తయారవుతుందని ట్రాయ్ ఆశాభావంతో ఉంది. స్థూలంగా ట్రాయ్ ప్రతిపాదించిన నమూనాలు మూడు కాగా ఒక్కో నమూనాలో మంచి చెడ్డలూ, లోటు పాట్లూ పాఠకులకు తెలియజేయటానికే ఈ వ్యాసాన్ని అందిస్తున్నాం.

మూడు రకాల నమూనాలూ బ్రాడ్ కాస్టర్లు తమ ప్రసారాలను టోకున కేబుల్ పంపిణీ దారులకు, డిటిహెచ్ ఆపరేటర్లకు, హిట్స్ ఆపరేటర్లకు అందించే ధరలను ప్రతిబింబిస్తాయి. నియంత్రిత ఆర్ ఐ ఓ అయితే వివిధ ప్లాట్ ఫామ్స్ కు అందించే ధరలలో ఎలాంటి వివక్షా చూపదు. అందుకే ట్రాయ్ కూదా తన చర్చా పత్రంలో ఆచరణాత్మకంగా ఉండే మూడు నమూనాలను పరిచయం చేసింది. ఒకటి యూనివర్సల్ నమూనా, రెండోది మార్పులకు అనుగుణంగా ఉండే సరళమైన నమూనా, మూడోది నియంత్రిత నమూనా. ఈ మూడు నమూనాల ప్రభావం పరిశ్రమ మీద ఎలా ఉండే అవకాశమున్నదో ఈ వ్యాసంలో చూద్దాం.

నియంత్రిత అర్ఐఓ నమూనా (Regulated RIO model )

ఈ నమూనా కింద బ్రాడ్ కాస్టర్లు తమ రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ప్రధానాంశాలను స్థూలంగా ప్రకటించవలసి ఉంటుంది. అయితే, నియంత్రణ వ్యవస్థ వివిధ రకాల చానల్స్ ధర మీద గరిష్ఠ పరిమితిని నిర్దేశించవచ్చు. అదే విధంగా అ లా కార్టే ధరలు, బొకే ధరలు ఎలా ఉండాలో కూడా చెప్పవచ్చు. ఆ విధంగా వివిధ పంపిణీ ప్లాట్ ఫామ్స్ మధ్య బ్రాడ్ కాస్టర్ ఎలాంటి వివక్షా చూపకుండా జాగ్రత్తపడవచ్చు. డిస్కౌంట్ల విషయంలోనూ పారదర్శకత ఉంటే సమన్యాయం అందుతుంది. ఒకవేళ కనెక్షన్ల సంఖ్యను బట్టి డిస్కౌంట్ ఇచ్చినా అది కూడా ఒక లెక్కప్రకారం జరుగుతుంది. ఈ విభాగంలో బ్రాడ్ కాస్టర్ తన చానల్స్ ను పే చానల్స్ గా ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంటుంది.

 1. అనుకూలతలు:

ఎ. వివక్ష చూపకపోవటం వలన ఈ నమూనాలో అందరికీ సమాన న్యాయం అందుతుంది. సమాన అవకాశాల మధ్య అందరూ పోటీ పడే వీలు కలుగుతుంది. డిటిహెచ్ కి ఒకరకమైన ధర, హిట్స్ కి ఒకధర, పెద్ద ఎమ్మెస్వోకి ఒక ధర, చిన్న ఎమ్మెస్వోకి ఒక ధర అంటూ ఉండవు. అంతా పారదర్శకంగా సాగుతుంది.

బి. గరిష్ఠ పరిమితికి లోబడి బ్రాడ్ కాస్టర్ తన చానల్స్ కు ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు ఈ నమూనాలో ఉంటుంది. ఏకస్వామ్య ప్రవర్తనతో మరీ అధిక ధరలు నిర్ణయించే అవకాశం ఉండదు.

సి. ఇది పంపిణీదారుల, చందాదారుల ప్రయోజనాలను కాపాడుతుంది.

డి. బ్రాడ్ కాస్టర్ ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య తదితర ప్రత్యేక చానల్స్ అందించేలా ప్రోత్సహిస్తుంది.

ఇ. మార్కెట్ పోటీ సూత్రాలకు అనుగుణంగా ధరలు నిర్ణయించేందుకు ఇది అవకాశం కలిగిస్తుంది.

ఎఫ్. సంబంధితుల మధ్య వివాదాలు బాగా తగ్గిపోతాయి. ఆ విధంగా ఈ రంగం ఎదుగుదలకు దోహదపడుతుంది.

 1. ప్రతికూలతలు:

ఎ. ధరలమీద నియంత్రణ ఉండటం వలన తమ సృజనాత్మకమైన కార్యక్రమాలకు సైతం ధర పరిమితంగా ఉంటుందని, అది తమ సృజనాత్మకతను దెబ్బతీయటమేనని కొంతమంది బ్రాడ్ కాస్టర్లు భావించవచ్చు.  తమ కార్యక్రమాల తీరునుబట్టి తామే ధర నిర్ణయించుకునే అవకాశం కోల్పోతామన్న భయాలుంటాయి.

బి. ఇందులో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరూ నియంత్రణకు లోబడి ఉండాలి. ఇలా అందరూ పాటిస్తున్నదీ లేనిదీ సరిచూడటమనేది చాలా ఖర్చుతో కూడా కూడుకున్న వ్యవహారం.

iii. ఆచరణాత్మకత:

ఎ. ఇప్పుడు పరిశ్రమలోని వివిధ వర్గాల స్థాయి, పరిశ్రమలో కనిపిస్తున్న పరిణతి దృష్ట్యా ఆలోచిస్తే ఈ నమూనా బాగా అమలు జరగటానికి అవకాశముంది.

బి. కొన్ని చానల్స్ నిర్ణయించే ధరలమీద గరిష్ఠ పరిమితి విషయంలో కాస్త కఠినంగా ఉండటం మినహాయిస్తే, ఇప్పుడున్న నియంత్రణ వ్యవస్థకు ఇది చాలా దగ్గరగా ఉంది.

సి. గరిష్ఠ ధర నిర్ణయమనేది నాన్ అడ్రెసిబుల్ వ్యవస్థ ధరకు అనుసంధానం చేయకపోవచ్చు. పారదర్శకత స్థాయి కూడా పెంచవచ్చు.

 1. సవాళ్ళు:

ఎ. నియంత్రణ వ్యవస్థకు తగినట్టుగా సాగుతున్నట్టు నిర్థారించుకోవటానికి మరిన్ని వనరులు అవసరమవుతాయి.

బి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఈ రంగం అభివృద్ధికి తగినట్టుగా  అప్పుడప్పుడు అనేక అంశాల సర్దుబాటు అవసరం కావచ్చు.

సార్వజనీన నమూనా (Universal RIO model )

ఈ సార్వజనీన నమూనా ప్రకారం బ్రాడ్ కాస్టర్ తన ఒక్కో చానల్ ధరనూ నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంటాడు. అయితే, బ్రాడ్ కాస్టర్ తప్పనిసరిగా తన ఒక్కో చానల్ ఆర్ ఐ ఓ ధరను అ లా కార్టే పద్ధతిలో నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్ ఐ ఓ లో ఇంటర్ కనెక్షన్ కు సంబంధించిన ఇతర షరతులు కూడా ఉంటాయి. ఒకవేళ ఏవైనా డిస్కౌంట్లు ఇవ్వదలచుకుంటే అంతా పారదర్శకంగా ఆర్ ఐ ఓ లోనే విస్పష్టంగా వెల్లడించవలసి ఉంటుంది.

పంపిణీ వేదికలతో జరిగే వ్యవహారాలన్నీ ఆర్ ఐ ఓ లో పేర్కొన్న నిబంధనలకు లోబడి మాత్రమే జరగాలి. ఎలాంటి పరస్పర ఒప్పందాలూ ఈ నమూనాలో అంగీకరించబడవు. బ్రాడ్ కాస్టర్లు బొకే రూపంలో చానల్స్ ఇవ్వజూపటానికి వీల్లేదు. చందాదారు చెల్లింపు భయంకరంగా పెరిగే అవకాశం ఇందులో అంతర్లీనంగా ఉంది. అయితే, ధర పెరిగేకొద్దీ ప్రేక్షకుల సంఖ్య తగ్గే ప్రమాదముంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకపోవచ్చు కూడా. ప్రేక్షకులు తగ్గారంటే కచ్చితంగా ప్రకటనల ఆదాయం గణనీయంగా పడిపోతుంది. అప్పుడు రెండు ఆదాయలనూ బ్రాడ్ కాస్టర్ సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది.

 1. అనుకూలతలు:

ఎ. కార్యక్రమాల తయారీదారులైన బ్రాడ్ కాస్టర్లు తమ చానల్స్ కు ధరలు నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ పొందగలుగుతారు

బి. వైవిధ్య భరితమైన కార్యక్రమాలతో సరికొత్త చానల్స్ అందుబాటులోకి రావటాన్ని ప్రోత్సహిస్తుంది

సి. చానల్స్ లో కార్యక్రమాల నాణ్యత బాగా పెరిగే అవకాశముంటుంది.

డి. బ్రాడ్ కాస్టర్ స్థాయిలో పెట్టుబడులు పెరిగే అవకాశముంది.

ఇ. పంపిణీ దారులకు అనేక చానల్స్ నుంచి ఎంచుకునే అవకాశం బాగా పెరుగుతుంది

 1. ప్రతికూలతలు:

ఎ. బ్రాడ్ కాస్టర్ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం వలన తన కార్యక్రమాల సాయంతో గుత్తాధిపత్యం చెలాయిస్తూ అధిక ధరలు నిర్ణయించే ప్రమాదముంది. దీనివలన చందాదారుడి మీద అసాధారణమైన భారం పడే అవకాశముంది.

బి. ఇలాంటి భవిష్యత్ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పంపిణీ స్థాయిలో పెట్టుబడులమీద ప్రభావం పడవచ్చు

iii. ఆచరణాత్మకత :

ఎ. బ్రాడ్ కాస్టర్లే తమ చానల్స్ /ప్రసారాల ధర నిర్ణయిస్తారు. ఈ నమూనా జయాపజయాలన్నీ ఈ రంగం ఎంత పరిణతి చెంది ఆలోచిస్తుందన్నదాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది.మరీ ముఖ్యంగా బ్రాడ్ కాస్టర్ల ఆలోచనావిధానం ఆధారంగా ఫలితం ఉంటుంది.

 1. సవాళ్లు

ఎ. నియంత్రణాధికార సంస్థ ప్రమేయం లేకుండా బ్రాడ్ కాస్టర్లు మాత్రమే రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ రూపొందించుకుంటారు. అలాంటప్పుడు ఆ ఒప్పందం బ్రాడ్ కాస్టర్ కు అనుకూలంగా ఉంటుందన్న మాటను కొట్టిపారేయలేం

బి. బ్రాడ్ కాస్టర్ కు అధిక అధికారాలివ్వటం వలన అది ఆర్థికవ్యవహారాల గొలుసుకట్టులో అసమతుల్యతకు దారితీయవచ్చు. ఇందులో పంపిణీదారులు, ఇతర భాగస్వాములు నష్టపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి.

సరళమైన ఆర్ ఐ ఓ నమూనా (Flexible RIO model )

మార్పులకు బాగా అనువుగా ఉండే ఈ సరళమైన నమూనా దాదాపుగా సార్వ జనీన నమూనానే పోలి ఉంటుంది. బ్రాడ్ కాస్టర్ తన అ లా కార్టే చానల్స్ ధరలు, బొకే ధరలు నోటిఫై చేసే స్వేచ్ఛ కలిగి ఉంటాడు. పైగా ధరల రూపకల్పనతో బాటు కొన్ని అంశాలమీద పరస్పర ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా బ్రాడ్ కాస్టర్ కు ఉంటుంది. అలాంటప్పుడు రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ లో పేర్కొన్న విధంగా ప్రత్యేకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటూ,  ఒక్కొక్కరికి ఒక్కో విధమైన డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో చిన్న ఎమ్మెస్వోలు బాగా నష్టపోవచ్చు కూడా.

 1. అనుకూలతలు:

ఎ. ఒక్కో పంపిణీదారుతో ఒక్కో విధంగా పరస్పర ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం బ్రాడ్ కాస్టర్ కు ఉంటుంది.

 1. ప్రతికూలతలు:

ఎ.  పరస్పర ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కల్పించటం వలన దీనిని ఆసరాగా చేసుకొని    వివిధ పంపిణీ దారుల మధ్య వివక్ష ప్రదర్శించే అవకాశాలు మెండుగా ఉంటాయి. చిన్న ఎమ్మెస్వోలు బాగా దెబ్బతినే అవకాశాలున్నాయి.

బి. అలాంటి వివక్ష ఫలితంగా వేరు వేరు చదాదారులను కూడా వేరువేరుగా చూసే ప్రమాదముంది. ఒక పంఇణీ దారుకు తక్కువ ధరకు చానల్స్ అందితే తక్కువ పాకేజ్ కే చానల్స్ అందించగలుగుతాడు, ఎకువ ధరకు పొందితే అనివార్యంగా ఎక్కువ ధరకు అమ్ముతాడు. దానివలన పోటీలో వ్యాపారం దెబ్బతినే ప్రమాదముంది.

సి.  సార్వజనీన ఆర్ ఐ ఓ నమూనాలో ఉండే ప్రతికూలత ఈ నమూనాకు కూడా వర్తిస్తుంది.

iii. ఆచరణాత్మకత

ఎ. ఈ నమూనా ఏ మేరకు విజయవంతం అవుతుందనేది కూడా బ్రాడ్ కాస్టర్లు ఎంత మానసిక పరిణతితో వ్యవహరిస్తారనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఇంటర్ కనెక్షన్స్ విషయంలో ఎంత పారదర్శకంగా ఉంటారనేది కూడా అంతే ముఖ్యం.

 1. సవాళ్ళు:

ఎ.  పంపిణీ దారులందరికీ సమానమైన అవకాశాలు కల్పించటం ఒక సవాలు. అదే సమయంలో వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించటం కూడా చాల ముఖ్యం. చానల్ ధరలు విపరీతంగా ఉండకుండా చూడాలి.

బి. పారదర్శకత ఉండేలా, వివక్ష ఉండకుండా నిర్థారించుకోవాలి.

చర్చా పత్రంలో పేర్కొన్న ఏ నమూనా బ్రాడ్ కాస్టింగ్ రంగంలో టోకు స్థాయిలో సమంజసంగా ఉంటుందో చెప్పవలసిందిగా ట్రాయ్ టీవీ రంగ భాగస్వాములందరినీ కోరింది. అయితే, ఈ మూడు నమూనాలకే పరిమితం కాకుండా అన్నిటిలోని మంచి లక్షణాలను ఒక చోట చేర్చి ఒక సరికొత్త నమూనాను సైతం ప్రతిపాదించవచ్చు. అయితే, అందుకు కారణాలను వివరిస్తూ సమర్థించే ప్రయత్నం చేయాలి.

రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ తో నిమిత్తం లేకుండా మరో రెండు హేతుద్ధమైన నమూనాలు కూడా ఉన్నాయి. టోకు ధరల స్థాయిలో అవి కూడా బాగానే పనిచేసే అవకాశముంది. ఒకటి ధరను తట్టుకునే నమూనా అయితే, మరొకటి ధర ఆధారిత నమూనా.

ధరను తట్టుకునే నమూనా (Price Forbearance model )

ఈ నమూనాలో టోకు ధరల నిర్ణయంలో నియంత్రణ సంస్థ జోక్యం చాలా తక్కువగా ఉంటుంది.  నియంత్రణాసంస్థకు తెలియజేయాల్సిన విషయాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అయితే, ప్రసారాలు అందించటం అనేది చాలా పారదర్శకంగా, ఎలాంటి వివక్షా లేకుండా ఉండేలా నిర్థారించుకుంటుంది. బ్రాడ్ కాస్టర్లు తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా చాలా స్వేచ్ఛగా తమ చానల్స్ కు ధరలు నిర్ణయించుకొని అమ్ముకోవచ్చు. పోటీ వాతావరణంలో మార్కెట్ వ్యూహాలకు తగినట్టుగా సరికొత్త ఆఫర్లతో ముందుకు రావచ్చు. చందాదారులకు అమ్మే చిల్లర ధరను ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు నిర్ణయించుకోవచ్చు.

i.అనుకూలతలు:

ఎ. ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండటం వలన ఎలాంటి ప్రసారాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందో అంచనావేసుకొని విద్య, ఆరోగ్యం వంటి వైవిధ్యభరితమైన అంశాలకు సంబంధించిన చానల్స్ కూడా బ్రాడ్ కాస్టర్లు అందించే అవకాశం ఉంటుంది.

బి. బ్రాడ్ కాస్టర్లకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగవచ్చు

సి. ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన ప్రసారాలకు ఎక్కువ ప్రకటనలు రావచ్చు. దాని వలన చందా ఆదాయాలు తగ్గితే ప్రేక్షకులు లాభపడతారు.

 1. ప్రతికూలతలు:

ఎ. ఈ నమూనా వల్ల పెద్ద పెద్ద బ్రాడ్ కాస్టర్లు గుత్తధిపత్య ధోరణులకు పాల్పడే అవకాశాలు పెరగవచ్చు

బి. ధర నిర్ణయంలో గుత్తాధిపత్య నియంత్రణ వలన రకరకాల లిటిగేషన్లు తలెత్తే ప్రమాదముంది.

సి. బ్రాడ్ కాస్టర్లు మరిన్ని బొకేలు తయారుచేయవచ్చు

డి. చందాదారుల స్వేచ్ఛ చాలా పరిమితంగా మారిపోవచ్చు

ఇ. కొత్తగా వచ్చేవాళ్ళకు చాలా తక్కువ అనుకూలత వలన మొత్తంగా చూస్తే ఈ రంగంలో అభివృద్ధి దెబ్బతినవచ్చు

ఎఫ్. పంపిణీ వ్యాపారంలో అనిశ్చిత వాతావరణం కారణంగా పెట్టుబడులు తగ్గిపోవచ్చు

iii. ఆచరణశీలత:

ఎ. ఈ నమూనా ఒక ఆదర్శవంతమైన, బాగా ఎదిగిన బహుళ మార్కెట్ లో పనిచేస్తుంది. అంటే నీతి నియమాలకు కట్టుబడి పనిచేసేచోట, వ్యాపార కార్యకలాపాలలో పారదర్శకత ఉండేచోట ఈ నమూనా బాగా పనికొస్తుంది.

బి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ లో నెలకొన్న పారదర్శక రహిత విధానంలో వివక్ష కొనసాగుతున్న తరుణంలో అందరి ఎమ్మెస్వోలకూ, ఇతర పంపిణీ దారులకూ ఒకే ధరకు ప్రసారాలిచ్చే పరిస్థితి లేనిచోట ఇది పనిచేయదు.

 1. సవాళ్ళు:

ఎ. భాగస్వాములందరికీ ఒకే విధమైన పోటీ అవకాశాలు కల్పించటం చాలా కష్టం

బి. కొద్దిమంది బ్రాడ్ కాస్టర్ల గుత్తాధిపత్యాన్ని తగినట్టు నియంత్రించటం సాధ్యం కాకపోవచ్చు

సి. బ్రాడ్ కాస్టర్ల స్థాయిలో ధరలనియంత్రణ లేనప్పుడు చందాదారులకు ధరలు భారీగా పెరగకుండా చూడటమన్నది సాధ్యం కాకపోవచ్చు.

డి. చందాదారులకు ఎంపిక స్వేచ్ఛ అన్నది అందని మానుపండుగా మిగలవచ్చు

ధర ఆధారిత నమూనా (Cost-based model )

ఈ విధానంలో ఒక చానల్ చందా ధరను వాస్తవంగా దానికయ్యే ఖర్చుల ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే, కార్యక్రమాల తయారీకి అయ్యే వాస్తవ ఖర్చు ఆధారంగా నిర్ణయిస్తారు. ఆ తరువాత ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని, చందాదారుల సంఖ్యను కూడా లెక్కగట్టి లాభాలు పోను అయ్యే ఖర్చును చందాదారుల సంఖ్యతో భాగించి అప్పుడు సగటున ఎంత ధర నిర్ణయించాలో తేల్చుకుంటారు. విడివిడిగా ఇవ్వటం కంటే బొకే రూపంలో ఇవ్వటం కూడా లాభదాయకమయ్యేలా బొకే ధరలు నిర్ణయిస్తారులా లెక్కించిందీ ఆ వివరాలను నియంత్రణా సంస్థ ( ట్రాయ్ ) కి అందజేయాలి. అందులో ఎంత మేరకు హేతుబద్ధత ఉన్నదో చూసినమీదట అధికారులు చానల్ ధరకు ఆమోదముద్ర వేస్తారు..

 1. అనుకూలతలు:

ఎ. ధర నిర్ణయానికి, నియంత్రణకు ఇది శాస్త్రీయ విధానం.

బి. ఇది పారదర్శకంగా ఉంటుంది

సి. ఇది పెట్టుబడులమీద హేతుబద్ధమైన ఆదాయాన్నిస్తుంది

 1. ప్రతికూలతలు :

ఎ. కార్యక్రమాల రూపకల్పన అనేది సృజనాత్మకమైన అంశం. అందువలన నిర్మాణ వ్యయాలు ఎప్పటికప్పుడు కార్యక్రమం ఆధారంగా, కాన్సెప్ట్ ఆధారంగా మారిపోతూ ఉండవచ్చు. ప్రదేశాన్ని బట్టి, చానల్ ను బట్టి కూడా మారే అవకాశముంది.

బి. ఒకే తరహా కార్యక్రమంలో సైతం నిర్మాణ వ్యయం పెద్ద ఎత్తున ఒడిదుడుకులకు లోను కావచ్చు. అందువలన దాని ఖరీదును అంచనావేయటానికి ఒక నిర్దిష్టమైన కొలమానం అంటూ ఉండదు. ఇలా ప్రతి చానల్ కూ ప్రతి కార్యక్రమానికీ అయ్యే ఖర్చును సరి చూసి దాని చందా ధర నిర్ణయించటం అనేది ఆచరణలో చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. నియంత్రించటమనేది సాధ్యం కాకపోవచ్చు.

సి. ఒకసారి చందా ధర నిర్ణయించుకున్న తరువాత అదనపు పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన బ్రాడ్ కాస్టర్ కు రాకపోవచ్చు

డి. వివిధ దశలలో ఒక్కో రకమైన ధర పెట్టుకోవటానికి ఇది అవకాశమివ్వదు. నాణ్యతనుబట్టి ధర నిర్ణయించుకోలేకపోవటం సహజ సూత్రాలకు విరుద్ధం.

iii. ఆచరణాత్మకత:

ఎ. చానల్ చందా ధర నిర్ణయించటమనేది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. ముఖ్యంగా ఒక చానల్ లో విభిన్నమైన కార్యక్రమాలుండి వాటి నిర్మాణ వ్యయాల్లో చాలా తేడాలుంటే సగటు ధర నిర్ణయించటం వీలుపడకపోవచ్చు.

బి. ఆదాయ మార్గాల్లో రకాలున్నాయి. చందాలు, ప్రకటనలు, ఒటిటి, వాల్యూ యాడెడ్ సర్వీసులు, విదేశీ చందాల ఆదాయం లాంటివి. చానల్ ధరలు నిర్ణయించటానికి ముందు అలాంటి ఆదాయం ఎంత వస్తుందో తెలిసే అవకాశమే లేదు. అందుకే ముందుగా ధర నిర్ణయించటమనేది ఒక సవాలు.

సి. లెక్కించే విధానం సంక్లిష్టమైనది. ఒక్కో చానల్ లో ఒక కార్యక్రమం పెరిగినా, తొలగించినా ఆ లెక్కలో మార్పు వస్తుంది. అందువలన దీని నిర్వహణ చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది.

 1. సవాళ్ళు:

ఎ. అమలుచేయటం, ఆచరణాత్మకత ఒక పెద్ద సవాలుగా మారతాయి

బి. ఖర్చు లెక్కించటానికి ఆధారంగా తీసుకునే డేటా ఏ మాత్రం హేతుబద్ధంగా ఉందనేది ఎప్పటికీ ప్రశ్నార్థకమే. ఇది ఎన్నో రకాల వివాదాలకు దారితీసే ప్రమాదముంది. ఆవివాదాలకు పరిష్కారం కనుక్కోవటం సులభమేమీ కాదు.

డిజిటైజేషన్ లో సమగ్రమైన టారిఫ్ విధానం వెనుక …

బ్రాడ్ కాస్టర్లకూ, ఎమ్మెస్వోలు తదితర పంపిణీ దారులకు మధ్య తరచు తలెత్తే వివాదాలే ఇలా సమగ్రమైన టారిఫ్ విధానాన్ని రూపొందించాలని ట్రాయ్ ఆలోచించటానికి అసలు కారణం. ఒకవైపు బ్రాడ్ కాస్టర్లేమో ఇప్పుడున్న విధానం వలన సరికొత్త కార్యక్రమాలు రూపొందించలేకపోతున్నామంటారు. అలాంటి నియంత్రణ పద్ధతులవలన కార్యక్రమాల నాణ్యత రాను రానూ క్షీణిస్తోందని, ఎక్కువ పెట్టుబడి పెట్టి నాణ్యమైన ప్రసారాలు అందించలేకపోతున్నామని చానల్ యజమానులు వాదిస్తున్నారు. వారి వాదనలు మద్దతుగ ప్రత్యేకాంశాల చానల్స్ అందుబాటు పరిమితంగా ఉండటాన్ని  ఉదహరిస్తున్నారు.

ఇప్పుడున్న వ్యాపార నమూనా ఎట్టిపరిస్థితుల్లోనూ ఎదుగుదలకు అనువైనదికాదన్నది వాళ్ళ అభిప్రాయం. ఎప్పుడో 2004 లో చందా ధర మీద పరిమితి పెట్టి, దాన్నే కొనసాగించటాన్ని వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎమెస్వోలు ఇప్పుడున్న విధానంలో వివక్ష కొనసాగే అవకాశమే మెండుగా ఉండంటున్నారు. అందువలన నిజాయితీగా వ్యవహారాలు సాగే అవకాశమే లేదన్నది వాళ్ళ అభియోగం. రిపహ్రెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ కూ, పరస్పరం అంగీకరించిన ధరకూ మధ్య చాలా తేడా ఉండటం వలన ఒక బ్రాడ్ కాస్టర్ ఇచ్చే అన్ని చానల్స్ కూ కట్టాల్సిన పరిస్థితి వస్తున్నదని, అందులో చందాదారు ఎంపిక స్వేచ్ఛకు ఎలాంటి అవకాశమూ లేదని ఎమ్మెస్వోలు చెబుతున్నారు. ఒకవైపు పే చానల్ చందాలు పెరుగుతూ ఉంటే, మరోవైపు వాస్తవంగా వసూలయ్యే మొత్తాలు మాత్రం పెరగటం లేదంటున్నారు.

చిన్న, మధ్య తరహా ఎమ్మెస్వోలు చెబుతున్నదేంటంటే పరస్పర ఆమోదంతో కుదుర్చుకుంటున్న ఇంటర్ కనెక్షన్ ఒప్పందాలు వివక్షరహిత ఒప్పందాల లక్ష్యాలను చేరుకోవటం లేదని. బ్రాడ్ కాస్టర్లు నిజంగా ఎలాంటి వివక్షా చూపకుండా తమకు సిగ్నల్స్ అందిస్తున్నారా అని తెలుసుకోవటానికి అవకాశమే లేదని కూడా ఆరోపిస్తున్నారు. బ్రాడ్ కాస్టర్లకూ, ఎమ్మెస్వోలకూ మధ్య, ఎమ్మెస్వోలకూ ఆపరేటర్లకూ మధ్య ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల విషయంలో ఎన్నో వివాదాలున్నాయి. ఇలాంటి వివాదాలు పరిశ్రమ ఎదుగుదలకే గొడ్డలిపెట్టుగా పరిణమిస్తాయి. పైగా డిజిటైజేషన్ వలన చానల్స్ ఎంపిక స్వేచ్ఛ పెరిగినా, నియంత్రణ మాత్రం ఆపరేటర్/ఎమ్మెస్వో చేతిలోనే ఉన్నదని చందాదారు అభిప్రాయపడుతున్నాడు. ఆ విధంగా తన బడ్జెట్ తన చేతిలో లేకుండా పోతున్నదనే అభిప్రాయంలో ఉన్నాడు.

దీనివలన చందాదారుడు పెద్ద పెద్ద బొకేలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అ లా కార్టే పద్ధతిలో ఇచ్చినా, అవి అలవిమాలినంత పెద్ద రేట్లలో ఇస్తున్నారు. అలా బలవంతంగానైనా బొకేలు తీసుకునేట్టు చేస్తున్నారు.అందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలించి మెరుగైన విధానాన్ని రూపొందించిందేకు ట్రాయ్ ఈ చర్చా పత్రాన్ని పరిశ్రమ ముందుంచింది. మార్చి 4 లోగా స్పందనలు తెలియజేయటానికి, 18 లోగా ఆ స్పందనల మీద వ్యాఖ్యానించటానికి అవకాశం కల్పించింది.