• Home »
  • Digitisation »
  • డిజిటైజేషన్ లో అపశ్రుతులన్నిటీకీ బాధ్యత ట్రాయ్ దే

డిజిటైజేషన్ లో అపశ్రుతులన్నిటీకీ బాధ్యత ట్రాయ్ దే

డిజిటైజేషన్ జరుగుతున్న ప్రాంతాలలో ఎమ్మెస్వోలకు, స్థానిక కేబుల్ ఆపరేటర్లకు మధ్య ఇంటర్ కనెక్ట్ అగ్రిమెంట్లకు సంబంధించిన వివావాదాలను వెంటనే పరిష్కరించాలని బొంబాయ్ హైకోర్టు ఇటీవల టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) ని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా సమస్యలన్నిటినీ పరిష్కరించాలని కూడా సూచించింది. మహారాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్ మీద ముంబయ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలమీద ఇప్పుడు ట్రాయ్ కసరత్తు ప్రారంభించింది.

డిజిటైజేషన్ మొదలైనప్పటినుంచీ అనేక వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. డిజిటైజేషన్ చట్టం చేసే సమయంలో ట్రాయ్ చేసిన కసరత్తు నామమాత్రంగా ఉండటం వల్లనే ఇప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే వాదనకు బలం చేకూరుతోంది. క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలను పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్ ఎమ్మెస్వోలనే ఎమ్మెస్వోలకు ప్రతినిధులుగా ఊహించుకొని చట్టం రూపొందించటం వలనే ఇన్ని అనర్థాలు వస్తున్నాయని స్వతంత్ర ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు ఇప్పుడు వాపోతున్నారు.

బ్రాడ్ కాస్టర్లకూ, ఎమ్మెస్వోలకు మధ్య రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ మీద అగ్రిమెంట్లు జరగాల్సి ఉంది. అయితే, పాకేజీల విషయం, అ లా కార్టే రేట్లు, బొకే రేట్లు తేలకుండా పాకేజీల మీద ఒక అవగాహనకు రావటం కుదరదన్నది ఎమ్మెస్వోల వాదన. ఎమ్మెస్వోలు ముందుకు రాకపోవటం వల్లనే అగ్రిమెంట్లు కావటం లేదన్నది బ్రాడ్ కాస్టర్ల వాదన. ఇదిలా ఉంటే, మరోవైపు ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకూ మధ్య కూడా ఒప్పందాలు జరగటం లేదు. బిల్లింగ్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. చందాదారు దరఖాస్తు ఫారాలు సేకరించటంలో ఆపరేటర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారనేది ఎమ్మెస్వోల ప్రధాన ఆరోపణ.

అయితే, ఈ ఇబ్బందులన్నీ ముందుగా ఊహించలేదా? ఊహించకపోవటం తప్పేనని ట్రాయ్ ఒప్పుకుంటుందా? నిజానికి ఒప్పుకొని తీరాల్సిన తప్పిదాలు జరిగాయి కాబట్టి కనీసం సరిదిద్దుకోవటం తక్షణ కర్తవ్యం. డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్ ఇంటర్ కనెక్ట్ రెగ్యులేషన్స్ అండ్ టారిఫ్ ఆర్డర్స్ ను పునఃపరిశీలించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇతీవల ముంబై హైకోర్టుకు వెళ్ళిన కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య చెప్పిన విషయాలన్నీ క్షేత్ర స్థాయిలో ఎదురబుతున్న వాస్తవాంశాలే కాబట్టి ఆ ఫిర్యాదును ప్రాతిపదికగా తీసుకొని ట్రాయ్ సవరణలు చేపట్టటం సమంజసంగా ఉంటుంది. చర్చా పత్రాలు విడుదలచేసి అభిప్రాయ సేకరణ జరపటమే తప్ప కేబుల్ ఆపరేటర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. అప్పుడే చెప్పవచ్చు కదా అనే ట్రాయ్ ప్రశ్నకు సమాధానంగా కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య తాను మంత్రిత్వశాఖకు, ట్రాయ్ కి రాసిన లేఖలన్నిటినీ కోర్టు ముందుంచింది.

కేబుల్ టీవీ డిజిటైజేషన్ అనేది ప్రజలక్షేమం కోసం చేపట్టినదేనని ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ ఈ ప్రక్రియ మొత్తాన్ని ప్రజలతో సంబంధం లేకుండా బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు బలవంతంగా అమలుచేయటానికి ఉసిగొల్పింది. ఎమ్మెస్వోలను, కేబుల్ ఆపరేటర్లను దొంగలుగా చిత్రించటానికి ప్రభుత్వంతో బ్రాడ్ కాస్టర్లు కుమ్మక్కయారు. కనెక్టివిటీ తగ్గించి చెబుతున్నారంటూ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టింది బ్రాడ్ కాస్టర్లే. నిజానికి పే చానల్ రేట్లు ఇష్టమొచ్చినట్టు నిర్ణయించుకొని ప్రకటనల పరిమితిని సైతం పాటించకుండా అటు చందాల రూపంలోనూ, ఇటు ప్రకటనల రూపంలోనూ ఆదాయం పొందుతున్న బ్రాడ్ కాస్టర్లు కేవలం తమ సొంత ప్రయోజనాలకోసమే డిజిటైజేషన్ కోసం పట్టుబట్టారు. ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిపోతున్నదని, అనలాగ్ వల్లనే ఈ నష్టం జరుగుతున్నదని ప్రభుత్వానికి చెప్పింది బ్రాడ్ కాస్టర్లే.

ప్రభుత్వం కూడా వాస్తవాలు గుర్తించకుండా అనుకున్నదే తడవుగా ప్రజలమీద డిజిటైజేషన్ రుద్దింది. అభివృద్ధి చెందిన దేశాలలో సైతం ప్రభుత్వమే సెట్ టాప్ బాక్సులు ఉచితంగా ఇవ్వటమో, సబ్సిడీ మీద ఇవ్వటమో చేస్తుండగా భారతదేశంలో మాత్రం కేబుల్ ప్రేక్షకుడే కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాణ్యమైన ప్రసారాలు అందుతాయని, చూసే చానల్స్ కే డబ్బు కట్టవలసి ఉంటుంది గనుక నెలవారీ కేబుల్ బిల్లు తగ్గుతుందని ప్రభుత్వం బుకాయించింది. కానీ వాస్తవంలో అలా జరగలేదు. అటు బిల్లులూ పెరిగాయి, ఇటు సెట్ టాప్ బాక్స్ భారమూ పడింది.ప్రభుత్వ నిబంధనలేవీ చందాదారులకు మేలు చేయలేకపోయాయి. ఈ పరిశ్రమలోని అన్ని వర్గాలూ లాభపడేవిధంగా డిజిటైజేషన్ ను తీర్చిదిద్దకపోవటం ముమ్మటికీ ప్రభుత్వానిదే తప్పు.

ఈ ప్రక్రియ మొదలైంది 2011 నవంబర్ లో. అంటే ఇప్పటికి నాలుగేళ్ళు గడిచింది. చందాదారులు లాభపడకపోగా ఎమ్మెస్వోలూ, కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టి నెట్ వర్క్ లను ఆధునీకరించుకోవాల్సి వస్తోంది. కొన్ని చోట్ల సెట్ టాప్ బాక్సులమీద సబ్సిడీ ఇచ్చి ఆ భారాన్ని కూడా మోయాల్సి వస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో బాగా లాభపడే బ్రాడ్ కాస్టర్లు మాత్రం కేబుల్ టీవీ డిజిటైజేషన్ కు పైసా ఖర్చుపెట్టటం లేదు. ఎమ్మెస్వోలు ఈ రోజుకూ చానల్స్ వారీగా చందాదారుడికి బిల్లు ఇవ్వటం మొదలు పెట్టలేదు. ట్రాయ్ పదే పదే చేస్తున్న విజ్ఞప్తులన్నీ చెవిటివాడిముందు శంఖమూదినట్టు తయారయ్యాయి. ఇదంతా చూస్తుంటే డిజిటైజేషన్ అమలులో దారుణమైన పొరపాట్లు జరుగుతున్నాయన్న విషయం ఒప్పుకోక తప్పదు.

ఈ పరిస్థితి ఇలా దాపురించటానికి కారణమేంటి ? చందాదారులకు అతి దగ్గరాగా ఉంటూ క్షేత్ర స్థాయి సమస్యలన్నిటిమీదా పూర్తి స్థాయి అవగాహన ఉన్న కేబుల్ ఆపరేటర్ల మాట వినటానికి ట్రాయ్ ఏనాడూ ఆసక్తి చూపలేదు. ఈ ప్రక్రియ మొత్తం ప్రేక్షకుల కోసమే నని చెప్పుకున్న ప్రభుత్వం ఆ ప్రేక్షకులతో ఎలాగూ చర్చించలేదు సరికదా, వారి తరఫున మాట్లాడగల కేబుల్ ఆపరేటర్లనూ పట్టించుకోలేదు. అటు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ గాని, ఇటు ట్రాయ్ గాని కేవలం పే టీవీ యజమానుల తరఫున వారి న్యాయవాదుల లాబీ వల్లించే చిలకపలుకులనే ప్రామాణికంగా తీసుకుంది. పైగా, ఈ పే చానల్స్ ఇచ్చే చందాలమీద ఆధారపడి బ్రతికే ఫిక్కీ, అసోచామ్, సిఐఐ లాంటి సంస్థలు ఇచ్చే నివేదికలనే ట్రాయ్ ప్రామాణికంగా తీసుకుంది.

కేబుల్ టీవీ వ్యాపారం మీద ట్రాయ్ కి ఉన్న అవగాహన ఎంత లోపభూయిష్టమైనదంటే, కేబుల్ పరిశ్రమ మీద దాని అవగాహన ఇలా ఉంది :

ఎ. భారతదేశంలో ఉన్న మొత్తం 15 కోట్ల కేబుల్, శాటిలైట్ ఇళ్ళన్నీ ప్రస్తుతం పే టీవీ మార్కెట్. మొత్తం 830 చానల్స్ లో పే చానల్స్ అనేవి కేవలం 200 మించి ఉండవు. వీటిలో అత్యధికశాతం కేవలం నాలుగైదు భారీ మీడియా గ్రూపుల చేతుల్లోనే ఉన్నాయి. మనం బలవంతంగా రుద్దకపోతే కనీసం 80 శాతం మంది ఈ చానల్స్ తీసుకోవటానికి ఇష్టపడరు. చెన్నై లో కాస్ ( కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ) అమలు చేసినప్పుడు ఇదే అనుభవం ఎదురైంది. ఇంతకన్నా రుజువు అక్కర్లేదు.

బి. ట్రాయ్ ఊహించుకున్న మరో విషయమేంటంటే భారతదేశంలో టీవీ చూసే 70 కోట్లమంది ప్రజలు సొంతగా సెట్ టాప్ బాక్సులు కొనుక్కోగలరు, బ్రాడ్ కాస్టర్లు ఎంత రేటు చెప్పినా కళ్ళుమూసుకొని ఆ చందా కట్టటానికి సిద్ధంగా ఉంటారు అని. పైగా భారతదేశంలో టీవీ చూసే ప్రతి ప్రేక్షకుడూ డిజిటల్ వీడియోను అనుభూతి చెందటానికి అవసరమైన టీవీ సెట్ వాడుతున్నాడని కూడా ట్రాయ్ భావించింది. డిజిటైజేషన్ నిబంధనలన్నిటికీ ఈ భావనే ప్రధాన ప్రాతిపదిక.

సి. ఎమ్మెస్వోల దగ్గర కోట్లాది రూపాయలు మూలుగుతున్నాయని, లేకపోయినా వెంటనే సమకూర్చుకోగలరని ట్రాయ్ కి అపారమైన విశ్వాసం. లక్షల సంఖ్యలో సెట్ టాప్ బాక్సులు దిగుమతి చేసుకోవటానికి ఎమ్మెస్వోల దగ్గర డబ్బు మూలుగుతున్నదనే అభిప్రాయంతో హడావిడి గడువు తేదీలు ప్రకటించింది. గడువుకు ముందే డిజిటైజేషన్ పూర్తవుతుందన్న భరోసా కూడా ట్రాయ్ కి ఉండేది.

డి. ఇక కేబుల్ ఆపరేటర్ల మీద ట్రాయ్ కున్న అవగాహన గురించి వింటే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆపరేటర్లందరూ విద్యావంతులని, సాంకేతికంగా సుశిక్షితులని, లేదా శిక్షణ పొందిన సిబ్బందిని నియమించుకున్నారని, డిజిటల్ టెక్నాలజీని వెంటనే అందిపుచ్చుకుంటారని, ఈ క్రమంలో కార్పొరేట్ ఎమ్మెస్వోల దగ్గర ఏజెంట్లుగా మారటానికి సిద్ధంగా ఉంటారని ట్రాయ్ భావించింది. కేబుల్ ఆపరేటర్లు పాతికేళ్ళుగా పెంచి పోషించుకుంటూ వస్తున్న నెట్ వర్క్ లను వదులుకుంటే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదనే స్థిరమైన అభిప్రాయం ట్రాయ్ కి ఉంది.

ఇలాంటి అభిప్రాయాలతో డిజిటైజేషన్ కు శ్రీకారం చుట్టటమే ఇప్పుడెదురవుతున్న అనర్థాలన్నిటికీ అసలు కారణం. స్వతంత్ర ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు సహకార సంఘాలుగా ఏర్పడి వ్యాపారాన్ని కాపాడుకోవచ్చునని ఏనాడూ ట్రాయ్ సూచించలేదు. ఎప్పుడూ కార్పొరేట్ ఎమ్మెస్వోల పక్షపాతిగానే ఉండిపోయింది. ఒక గందరగోళ వాతావరణాన్ని చేజేతులా సృష్టించుకుంది. అడుగడుగునా కోర్టు కేసులు ఎదురవుతుంటే ఇప్పుడు నిర్ఘాంత పోతోంది. ప్రతి నిబంధనా, ప్రతి టారిఫ్ ఆర్డర్ కోర్టులో సవాలు చేయబడింది. టిడిశాట్ చైర్మన్ మాటల్లో చెప్పాలంటే, 2015 లో దాఖలైన మొత్తం 545 కేసుల్లో 433 కేబుల్ టీవీ పరిశ్రమకు సంబంధించినవే. ఇప్పుడు కోర్టులు ప్రతి పొరపాటునూ సవరించుకుంటూ రావాల్సి వస్తోంది.
కేబుల్ ఆపరేటర్లు గతపాతికేళ్ళుగా పరిశ్రమను సజీవంగా ఉంచుతూ ఎలా ఎదిగేలా చేసారో చూసి నేర్చుకోవాల్సిన అవసరం ట్రాయ్ కి ఉంది. డబ్బునవాళ్ళకు ఒక ధర, పేదలకు ఒక ధర విధిస్తూ అందరి ప్రయోజనాలూ కాపాడుతూ ఎలా వ్యవహరిస్తూ వచ్చారో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆపరేటర్ కు నష్టం కలిగించే పరిస్థితిలో పరిశ్రమ ఒక్క కనెక్షన్ కూడా కోల్పోకుండా చూసుకోవాల్సిన అవసరముంది.

సమస్యలన్నిటికీ మూలం పే టీవీ

డిజిటైజేషన్ అనగానే వినియోగదారుడికి అపరిమితమైన స్వేచ్ఛ లభిస్తుందని, కోరుకున్న చానల్స్ కు మాత్రమే చెల్లించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఊదరగొట్టింది. కానీ వాస్తవానికి అలా జరగలేదు. చానల్స్ రేత్లు నిర్ణయించటంలో అతి తెలివి ప్రదర్శించాయి. అ లా కార్టే పేరుతో చానల్స్ విడి ధరలు చాలా పెద్ద మొత్తాల్లో నిర్ణయించాయి. దీంతో చందాదారులు అనివార్యంగా బొకే పద్ధతిలో తీసుకోక తప్పటం లేదు. పే చానల్స్ కు గరిష్ఠ ధరలు నిర్ణయించటంలో ట్రాయ్ ఘోరంగా విఫలమైంది. అ లా కార్టే, బొకే ధరల నిర్ణయానికి ఒక ఫార్ములా రూపొందించటంలోనూ ట్రాయ్ మొహం చాటేసింది. చందాదారుల సమాచారం కోసం ఆ ధరల వివరాలన్నీ ఆయా పే చానల్స్ తమ వెబ్ సైట్స్ లో పెట్టేలా చూడాలి. ఈ ధరలను ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలలో కూడా పేర్కొనాలి. ప్రతి ఆరునెలలకొకసారి వీటిమీద సమీక్ష జరగాలి.
ఉచిత చానల్స్ ను భిన్నంగా చూడాలి
పే చానల్స్, ఫ్రీ టు ఎయిర్ చానల్స్ విషయంలో ట్రాయ్ వ్యవహారశైలి సైతం ఆమోదయోగ్యంగా లేదు. దాదాపు 630 ఉచిత చానల్స్ ను 200 పే చానల్స్ ను ఒకే గాటన కట్టటానికి ట్రాయ్ ప్రయత్నించింది. అన్నిటికీ ఒకే రకమైన నిబంధనలు పెట్టాలని ప్రయత్నించింది. ఇప్పుడు పెద్ద పెద్ద టీవీ గ్రూపులు రకరకాల చానల్స్ అనేకం సృష్టిస్తూ సొంతగా పాకేజీలు తయారుచేసి తక్కువ ధరకే విభిన్నమైన చానల్స్ అందిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. దీనివలన ఉచిత చానల్స్, చిన్న పే చానల్స్ బాగా నష్టపోతున్నాయి. వాటి మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది.
పేరు మోసిన ఉచిత చానల్స్ రూ. 3 చొప్పున అలా కార్టే ధర నిర్ణయించుకోవటానికి ట్రాయ్ వీలుకల్పించింది. నిజానికి ఉచిత చానల్ అ లా కార్తే ధర రూ.1 కి మించకూడదు. అయితే, ట్రాయ్ ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ ప్రకారం అ లా కార్టే చానల్ ధర మూడు రెట్లు పెంచుకోవటానికి వీలుండటం వలన ఉచిత చానల్స్ ధర రూ. 3 గా నిర్ణయించుకోవచ్చు.
బేసిక్ పాకేజ్ లో చందాదారుడు ఎంచుకున్నఉచిత చానల్స్ మాత్రమే 100 ఉండాలి. కానీ చాలామంది ఎమ్మెస్వోలు ఆ విధంగా 100 రూపాయలకు 100 ఉచిత చానల్స్ ఇవ్వాలన్న నిబంధనను పాటించటం లేదు. పైగా, వాళ్ళకు నచ్చిన ఉచిత చానల్స్ ఇస్తున్నారే తప్ప చందాదారుడు కోరిన ఉచిత చానల్స్ ఇవ్వటం లేదు. ఎమ్మెస్వోలు నిర్ణయించిన పాకేజీలనే తీసుకునేలా వినియోగదారులమీద వత్తిడి తెస్తున్నారు. అయితే, ఆపరేటర్ల ఇష్టప్రకారం బేసిక్ పాకేజ్ తయారు చేస్తే ఈ సమస్యే రాదు.
కేబుల్ నెట్ వర్క్స్ ద్వారా బ్రాడ్ బాండ్ ను విస్మరించారు
అన్ని కేబుల్ నెట్ వర్క్స్ ద్వారా హై స్పీడ్ బ్రాడ్ బాండ్ ఇవ్వగలిగే పరిస్థితి తీసుకురావాలన్న ఆలోచనను పూర్తిగా విస్మరించారు. కేబుల్ ఆపరేటర్ తన నెట్ వర్క్ ను అప్ గ్రేడ్ చేసుకోవటానికి కనీసం ఎంత ఖర్చవుతుందో లెక్కవేయటానికి కూడా ట్రాయ్ ఏనాడూ ప్రయత్నించలేదు. ఇది కూడా ట్రాయ్ తప్పిదమేనని చెప్పాల్సిందే.

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు అమలు చేయటంలో ప్రధాన అవరోధాలు

ఎ) పే టీవీ చానల్స్ కూ, ఉచిత చానల్స్ కూ మధ్య తేడా ను గుర్తించకపోవటం
బి) స్థానిక కేబుల్ ఆపరేటర్ తన నెట్ వర్క్ కు యజమాని. అంతే తప్ప ఎమ్మెస్వోకు గాని బ్రాడ్ కాస్టర్ కు గాని ఏజెంటు గా భావించకూడదు.
సి) ఆదాయంలో వాటా అన్నంత మాత్రాన అన్ని రకాల అదాయాల్లోనూ వాటా వస్తుందన్న నమ్మకం లేదు. పే టీవీ అదాయం, కారేజ్ ఫీజు ఆదాయం, ప్లేస్ మెంట్ ఫీజు, స్థానిక కేబుల్ చానల్స్ ఆదాయంలో వాటా లాంటివి రాకపోవచ్చు. స్థానిక కేబుల్ ఆపరేటర్ ప్లాట్ ఫామ్ ను వాడుకుంటున్నప్పటికీ వాటాకు ఎలాంటి హామీ లేదు. అందుకే ఆపరేటర్ తాను మోసపోతున్నాననే భావనలో ఉంటున్నాడు. ఈ క్రమంలో బాగా నష్టపోతున్నది ఆపరేటరే.
డి) బ్రాడ్ బాండ్ నెట్ వర్క్ నడపటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవటానికి ఆపరేటర్ కు చాలా ఖర్చవుతుందన్న విషయాన్ని ఆదాయంలో వాటా లెక్కించేటప్పుడు గుర్తించటం లేదు.
ఇ) నియంత్రణ లమధ్య సాగుతున్న ఈ డిజిటైజేషన్ ప్రక్రియ అనంతరం స్థానిక కేబుల్ ఆపరేటర్ ఎదుగుదలకు ఎలాంటి భవిష్యత్తూ కనబడటం లేదు. ఎలాంటి ప్రోత్సాహకాలూ లేవు.
ఎఫ్) ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలకు ప్రామాణికమైన నమూనా ఏదీ లేదు. అటు కంటెంట్ కోసం, ఇటు ఆదాయం కోసం ఎమ్మెస్వో మీద ఆపరేటర్ పూర్తిగా ఆధారపడాల్సిన ప్రస్తుత పరిస్థితులలో బేరసారాల ద్వారా ఒప్పందాలు చేసుకోవటం అనే మాటకు అర్థం లేదు.
జి) అదనపు పెట్టుబడి పెట్టాల్సి రావటం, బిల్లుల వసూలు, పన్నుల వసూలు, డిజిటల్ చందాదారుడికి సేవలందించటం, 24 గంటల కాల్ సెంటర్ నడపటం, చందాదారులు కొత్త టెక్నాలజీని అర్థం చేసుకునేట్టు చూడటం, గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ చందా చెల్లించాల్సిన పరిస్థితికి ఒప్పించటం లాంటి ఎన్నో బాధ్యతలు మోపినా, అందుకు తగిన విధంగా ఆదాయంలో వాటా ఇచ్చే ఆలోచన చేయకపోవటం దారుణం.
హెచ్) ఎమ్మెస్వోల రిజిస్ట్రేషన్ లో అసాధారణమైన జాప్యం జరుగుతోంది. ఆచరణ సాధ్యం కాని గడువు తేదీలు పెట్టటం మరో సమస్య. బలపరచే వాతావరణమేదీ కల్పించకపోగా హడావిడి గడువుతేదీలతో పరిశ్రమను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాలు సాగుతున్నాయి. స్వదేశీ సెట్ టాప్ బాక్సుల తయారీ, సుంకాల్లొ మినహాయింపులు, పన్ను రాయితీలవంటివి చాలా ఆలస్యంగా గుర్తించటం మరో లోపం.
ఐ) గుత్తాధిపత్యాలు, బహుళ మీడియా యజమాన్యాలు : పే టీవీ యజమానులు, ఎమ్మెస్వోల మధ్య ఉండే సంబంధం మొత్తం కేబుల్ పరిశ్రమనే తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ దారుణాన్ని నియంత్రించటంలో ప్రభుత్వం పట్టెపట్టనట్టు వ్యవహరిస్తోంది.
జె) స్థానికంగా ఎమ్మెస్వోలు నడుపుకునే చానల్స్ కు సంబంధించి ఎలాంటి నియంత్రణా లేదు.

ఇప్పుడు జరగాల్సిందేంటి ?

కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ తరహాలో ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలకు ఒక ప్రామాణికమైన పత్రం తయారుచేయాలని భారత కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య ( Cable Operators Federation of India -COFI) ట్రాయ్ కి సూచించింది. దాని వలన ఆపరేటర్లు దోపిడికి గురయ్యే అవకాశముండదు. అలాంటి నమూనా ఒప్పందాన్ని తయారుచేసి ట్రాయ్ తన వెబ్ సైట్ లో ఉంచటం వలన అందరికీ మేలు జరుగుతుంది.
ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలలో వాణిజ్యాంశాలు, సేవల నాణ్యత, డిజిటల్ సిగ్నల్ ప్రమాణాలు, ఆదాయంలో వాటా, బిల్లింగ్, సెట్ టాప్ బాక్స్ పోర్టబిలిటీ, పన్నులు తదితర అంశాలన్నీ ఉండాలి.
ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు ట్రాయ్ దగ్గర ఉండాలి. వాటిని ట్రాయ్ బహిరంగంగా తన వెబ్ సైట్ లో ఉంచాలి.
ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలలో స్థానిక ఆపరేటర్లకు తగిన రక్షణ ఉండేట్టు చూడాలి. వారి జీవనోపాధికి ఏ విధంగానూ భంగం కలగకుండా చూడాలి. డమ్మీ ఆపరేటర్ల వ్యవస్థను ప్రోత్సహించకుండా. అసాధారణమైన బిల్లులు పంపి భయపెట్టకుండా జాగ్రత్తలు తీసుకొవాలి.
ఎమ్మెస్వో అనే పదం స్థానంలో హెచ్ ఎస్ వో ( హెడ్ ఎండ్ సర్వీస్ ప్రొవైడర్ ) అని మార్చాలి.
ఇంటర్ కనెక్ట్ అగ్రిమెంట్లు ఇప్పుడున్న కాంట్రాక్ట్ చట్టం లేదా కాంపిటిషన్ చట్టం లాంటి చట్టాలకు అనుగుణంగా ఉండాలి.