• Home »
  • Cable »
  • మౌలిక సదుపాయాల ఉమ్మడి వాడకం సాధ్యాసాధ్యాలపై ట్రాయ్ చర్చాపత్రం

మౌలిక సదుపాయాల ఉమ్మడి వాడకం సాధ్యాసాధ్యాలపై ట్రాయ్ చర్చాపత్రం

శాటిలైట్ టీవీ చానల్స్ పంపిణీకి మొదట్లో కేబుల్ ఆపరేటర్లు మాత్రమే ఉండగా పే చానల్స్ పంపిణీ కోసం ఎమ్మెస్వోలు కూడా అవతరించారు. అయితే, కొన్ని చోట్ల ఆపరేటర్లే ఎమెస్వోలుగా అవతారమెత్తారు. మరికొన్ని చోట్ల సొంతగా కనెక్షన్లు లేనివాళ్ళు కూడా ఎమ్మెస్వోలయ్యారు. ఆ తరువాత కాలంలో డైరెక్ట్ టూ హోమ్ (డిటిహెచ్) లాంటి పంపిణీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయటంతో వరుసగా ఆరు సంస్థలు లైసెన్స్ తీసుకొని ఈ రంగంలో పోటీలో ఉన్నాయి. అయితే, ఆ తరువాత కాలంలో హెడ్ ఎండ్ ఇన్ ద స్కై (హిట్స్ ) పేరుతో మరో పంపిణీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అయితే చాలా కాలం వరకు ఈ వ్యవస్థ పనితీరుమీద అవగాహాన లేకపోవటం వలన ఇటీవల డిజిటైజేషన్ వేగం పుంజుకునేదాకా ఇది ప్రజాదరణ పొందలేకపోయింది. హిట్స్ వేదికలలో ఇప్పటికి రెండు ప్రధాన సంస్థలు రంగంలో దిగాయి. మొదట జైన్ హిట్స్ కు లైసెన్స్ రాగా ఆ తరువాత కాలంలో హిందుజా వారి నెక్స్ట్ డిజిటల్ కూడా రంగ ప్రవేశం చేసింది.

ఈ పంపిణీ సంస్థలు పోటాపోటీగా పనిచేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల వాటి సామర్థ్యం పూర్తిగా వాడుకోలేకపోవటం, ఒకేచోట అందరికీ ఒకే రకమైన మౌలిక సదుపాయాలు అవసరమైనప్పటికీ వేర్వేరుగా సిద్ధం చేసుకోవటం లాంటివి చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు ఈ మౌలిక సదుపాయాలను ఉమ్మడిగా వాడుకుంటే ఖర్చు తగ్గటం, వనరుల వృధాను అరికట్టటం లాంటి ప్రయోజనాలు కలుగుతాయన్నది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అభిప్రాయం. టెలికామ్ రంగంలో టవర్ల వినియోగంలో ఇలాంటి ఉమ్మడి వినియోగం ఫలించింది కాబట్టి అదే సూత్రాన్ని టీవీ చానల్స్ పంపిణీ లోనూ ఉపయోగించటం సత్ఫలితాలిస్తుందని ట్రాయ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలోని వివిధ వర్గాలవారి అభిప్రాయాలను సేకరించే క్రమంలో ముందుగా ఒక చర్చాపత్రాన్ని విడుదలచేసింది.

ట్రాన్స్ పాండర్ పంచుకోవటం

డైరెక్ట్ టు హోమ్ ( డిటిహెచ్ ) గాని, హెడ్ ఎండ్ ఇన్ ద స్కై ( హిట్స్) గాని పక్కపక్కనే ఉన్న శాటిలైట్స్ ను వాడుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే. పునఃప్రసారానికి డిటిహెచ్ ఆపరేటలు కెయు బాండ్ వాడుకుంటుండగా  ఇద్దరు హిట్స్ ఆపరేటర్లు మాత్రం సి బాండ్ ట్రాన్స్ పాండర్ వాడుకుంటున్నారు. ఈ విషయాన్ని ట్రాయ్ తన చర్చాపత్రంలో పేర్కొంటూ  డిటిహెచ్/హిట్స్ ఆపరేటర్లు అందించే అత్యధిక చానల్స్  రీట్రాన్స్ మిట్ అవుతున్నవేనని గుర్తుచేసింది. దీనివలన ఉపగ్రహాలను సమర్థంగా వాడుకోలేకపోతున్నారని విశ్లేషించింది.

ఒకే పనికి వేరువేరుగా ఉపగ్రహాన్ని వాడుకోవటం అనవసరమైన వృధాగా అభివర్ణించింది. వేరువేరు ఆపరేటర్లు ఒకే టాన్స్ పాండర్ సాయంతో  రీ ట్రాన్స్ మిట్ చేసుకోవటానికి వీలున్నదని, ట్రాన్స్ పాండర్ ను ఉమ్మడిగా వాడుకోవటం ప్రయోజనకరమని ట్రాయ్ సూచిస్తోంది. దీనివలన ట్రాన్స్ పాండర్ లో బాండ్ విడ్త్ వృధా కాకుండా ఆపటానికి, తద్వారా ఖర్చు తగ్గించుకోవటానికి వీలవుతుందని సూచించింది. ఉమ్మడిగా లేని చానల్స్ కు మాత్రం అదే ఉపగ్రహంలో గాని, పొరుగున ఉన్న మరో ఉపగ్రహంలోగాని అదనపు ట్రాన్స్ పాండర్ సామర్థ్యాన్ని అద్దెకు తీసుకుంటే సరిపోతుందని వివరణ ఇచ్చింది.

ఎర్త్ స్టేషన్ మౌలిక సదుపాయాలు పంచుకోవటం

ట్రాన్స్ పాండర్ లో చోటు పంచుకోవటం మీద అవగాహన ఏర్పడిందంటే కచ్చితంగా ఎర్త్ స్టేషన్ వాడకం విషయంలోనూ అదే విధమైన అవగాహన ఏర్పడే అవకాశముంటుంది. అంటే చానల్స్ సిగ్నల్స్ ను అప్ లింక్ చేయటానికి అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలన్నిటినీ ఉమ్మడిగా వాడుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా ఎర్త్ స్టేషన్, ట్రాన్స్ పాండర్ ను స్వచ్ఛందంగా పంచుకోవటం ద్వారా డిటిహెచ్ / హిట్స్ ఆపరేటర్లు మూల ధన వ్యయాన్ని, నిర్వహణ వ్యయాన్ని చెప్పుకోదగినంతగా ఆదా చేసుకోవచ్చు. అదే సమయంలో వాళ్ళకు సేవల నాణ్యతలోనూ ఏ విధమైన లోటూ కనబడదు. వైవిధ్యభరితమైన  చానల్స్ ఇవ్వటంలోనూ లోపం ఏర్పడదు. ఎలక్ట్రానిక్ ప్రొగ్రామ్ గైడ్ (ఇపిజి) కూదా ఎవరికి వారే వేరువేరుగా ఇచ్చుకోవచ్చు.

హిట్స్ ఆపరేటర్లు తాము సమీకరించుకున్న చానల్ ఫీడ్ ను ఎమ్మెస్వోలకు ఇవ్వటం ద్వారా పరోక్షంగా వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించినట్టవుతుంది. ఎమ్మెస్వో లాగానే హిట్స్ ఆపరేటర్ కూడా టీవీ సేవలు అందించటంలో చురుగ్గా వ్యవహరిస్తాడు. అదే సమయంలో తన మౌలిక సదుపాయాలను ఎమ్మెస్వోలు వాడుకోవటానికి అందుబాటులో ఉంచుతాడు.  ఒక ఎమ్మెస్వో తాను కొన్ని ఇళ్ళకు నేరుగా సేవలందిస్తూ నే కొంత మంది ఆపరేటర్ల ద్వారా మరికొన్ని ఇళ్ళకు కనెక్షన్లు ఇవ్వటం లాంటిదే. అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేయటం. హిట్స్ ఆపరేటర్ కూడా ప్రత్యక్షంగా తన వ్యాపారం చేసుకుంటూనే ఎమ్మెస్వోలకు కూడా పరోక్షంగా సేవలు అందించవచ్చు. కాబట్టి ఇలాంటి విధానంలో అందుబాటులో ఉన్న ఎర్త్ స్టేషన్, ట్రాన్స్ పాండర్ సౌకర్యాలను ఉమ్మడిగా వాడుకుంటూ ఖర్చులు తగ్గించుకోవటం  సాధ్యమవుతుందని ట్రాయ్ చర్చా పత్రం పేర్కొంది.

అయితే, కొంతమంది అభిప్రాయమేంటంటే, హిట్స్ ఆపరేటర్ తన ఫీడ్ ని ఇతర ఎమ్మెస్వోలకు పంచే అవకాశమే లేదని. ఒక ఎమ్మెస్వో సమీకరించుకున్న ఫీడ్ ని అప్ లింక్ చేయగలడే తప్ప తన ఫీద్ ని ఇవ్వటమంటే అది మామూలు వ్యాపారమే అవుతుందని, అలాంటి వ్యాపారం తనద్వారా జరగాలని మాత్రమే కోరుకుంటాడని వాదిస్తిన్నవాళ్ళున్నారు. పైగా, ఒక్కో ఎమ్మెస్వోకు అప్ లింక్ చేసి ఇవ్వటమంటే ఒక్కొక్కరికీ ఒక్కో టాన్స్ పాండర్ అవసరమవుతుంది. అప్పుడు మౌలిక వసతులను సమర్థంగా వాడుకున్నట్టు కానే కాదు. అయితే, ఒక హిట్స్ ఆపరేతర్ మౌలిక సదుపాయాలను సమర్థంగా వినియీహ్గించుకోవటమంటే హిట్స్ సమీకరించిన చానల్స్ ను ఎక్కువమంది ఎమ్మెస్వోలు తీసుకొని వాడుకోవటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దీనివలన ట్రాన్స్ పాండర్ ఆదా అవుతుంది. అనేక హెడ్ ఎండ్స్ పెట్టుకోవాల్సిన అవసరముండదు. అయితే ట్రాయ్ చేస్తున్న ఈ వాదన చూస్తుంటే, ఎమ్మెస్వోలందరూ హిట్స్ సేవలు తీసుకోమని సూచిస్తున్నట్టే ఉంది. నిజానికి ఇప్పుడు జరుగుతున్నది అదేమ్ హిట్స్ కోరుకుంటున్నదీ అదే. మరి ప్రత్యేకంగా ట్రాయ్ చెబుతున్నదేంటి ? అని ప్రశ్నిస్తున్నవాళ్ళున్నారు.

ఎమ్మెస్వోల మధ్య మౌలిక వసతుల ఉమ్మడి వాడకం

ఒక హెడ్ ఎండ్ ను అనేకమంది ఎమ్మెస్వోలు పంచుకోవచ్చునని ట్రాయ్ సూచిస్తోంది. నిజానికి ఇది కూడా కొత్తేమీ కాదు. ఒక పెద్ద ఎమ్మెస్వో డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టి, మిగిలిన చిన్న ఎమ్మెస్వోలకు ఫీడ్ ఇవ్వటం ఇప్పుడు జరుగుతున్నదే. అందరూ కలిసి ఒక హెడ్ ఎండ్ పెట్టుకోవటమనే సహకార విధానం చాలా అరుదుగా విజయవంతమవుతాయని కోల్ కతా లో జరిగిన కొన్ని ప్రయోగాలు రుజువు చేశాయి. ఒక హెడ్ ఎండ్ లో మొదలైన ట్రాన్స్ పోర్ట్ స్ట్రీమ్ ను  సైమల్ క్రిప్టింగ్ టెక్నాలజీ ద్వారా అనేకమంది ఎమ్మెస్వోలు పంచుకోవచ్చు. అంటే, ఎనిమిది మంది సర్వీస్ ప్రొవైడర్లు ఒక ఉమ్మడి ట్రాన్స్ పోర్ట్ స్ట్రీమ్ పంచుకోవచ్చునని ట్రాయ్ గుర్తు చేస్తోంది. దీనివలన మూలధన వ్యయంతోబాటు సిగ్నల్స్ రీ ట్రాన్స్ మిషన్ కి అయ్యే నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని సూచిస్తోంది.

ఇలా ఎక్కువమంది ఎమ్మెస్వోలు ఉమ్మడిగా సిగ్నల్స్ వాడుకోవటానికి ఒకే డిజిటల్ హెడ్ ఎండ్ మీద ఆధారపడటం వలన సెట్ టా బాక్సుల మార్పిడి కూడా సులభమవుతుందని ట్రాయ్ చెబుతోంది. అప్పుడు కేబుల్ టీవీ నెట్ వర్క్స్ కోసం గొడవపడటం కూడా బాగా తగ్గిపోతుందని ట్రాయ్ సూచిస్తున్నది. కానీ అసలు విషయం అక్కడే ఉంది. ఇద్దరు సమాన హోదా ఉన్న ఎమ్మెస్వోలు ఎవరికి వాళ్ళే సొంత సామ్రాజ్యాల విస్తరణకు పోటీ పడతారు. భవిష్యత్తులో ఎవరు ఎవరికి పోటీగా తయారవుతారో నమ్మలేని స్థితిలో ఉండటం వలన కలవటం చాలా అరుదుగా జరుగు తుంది. చిన్న ఎమ్మెస్వోలను తుడిచిపెట్టటానికి మాత్రమే అక్కడక్కడా ఇలాంటి కలయికలు జరుగుతుంటాయి. ఒక పెద్ద ఎమ్మెస్వో ఉంటే చిన్న ఎమ్మెస్వోలకు ఫీడ్ ఇస్తాడే తప్ప భాగస్వామ్యం ఇవ్వడు. ఫీడ్ ఇవ్వటమన్నది ఇప్పుడు ఎలాగూ జరుగుతూనే ఉంది. అందువలన ట్రాయ్ ఇప్పుడు కొత్తగా చెబుతున్నదేమీ లేదు.

సైమల్ క్రిప్టింగ్ టెక్నాలజీని వాడుకుంటూ ఉమ్మడి ట్రాన్స్ పోర్ట్ స్ట్రీమ్  ద్వారా బహుళ ఎమ్మెస్వోల సిగ్నల్స్ ఒకే కొయాక్సియల్ కేబుల్ టీవీ నెట్ వర్క్ ద్వారా పంపవచ్చు. ఒప్పందాలను బట్టి ఒకరి కంటే ఎక్కువమంది ఎమ్మెస్వోల సిగ్నల్స్ ను చందాదారులు అందుకోవచ్చు. అప్పుడు చందాదారు తనకిష్టమైన సర్వీస్ ప్రొవైడర్ ను ఎంచుకోవచ్చు. ఉమ్మడిగా ట్రాన్స్ పోర్ట్ స్ట్రీమ్ వాడుకోవటం వలన బాండ్ విడ్త్ అవసరాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఒకే ఆప్టికల్ ఫైబర్ ద్వారా రెండు, లేదా అంతకంటే ఎక్కువ సిగ్నల్స్ కూడా వెళతాయి. అలాంటి పరిస్థితిలో కేబుల్ ఆపరేటర్ తాను రీ ట్రాన్స్ మిట్ చేయటానికి అనుమతిపొందిన స్ట్రీమ్ నే వాడుకుంటూ ఆ కొయాక్సియల్ కేబుల్ టీవీ నెట్ వర్క్ కే రీ ట్రాన్స్ మిట్ చేస్తాడు.

సైమల్ క్రిప్ట్ టెక్నాలజీ

వేరు వేరు కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ( కాస్ ) వాడుకునే డిటిహెచ్, హిట్స్ ఆపరేటర్లు  ఈ సైమల్ క్రిప్ట్ టెక్నాలజీని వాడుకుంటూ ఉమ్మడి చానల్స్ ను ఎన్ క్రిప్ట్ చేసుకోవటం సాధ్యమవుతుందని ట్రాయ్ ఈ చర్చాపత్రంలో సూచించింది.

మౌలిక వసతుల ఉమ్మడివాడకం వల్ల లాభాలు

మౌలిక సదుపాయాలను ఎలా ఉమ్మడిగా వాడుకోవచ్చునో తెలియజేస్తూ ట్రాయ్ రకరకాల అవకాశాలను ఈ చర్చాపత్రంలో తెలియజేసింది. అనేక ప్రయోజనాలను కూడా సూచించింది. అదే సమయంలో మూల ధన వ్యయాన్ని, నిర్వహణ వ్యయాన్ని ఎలా తగ్గించుకోవచ్చునో కూడా వివరించింది. మూలధన వ్యయం తగ్గే అవకాశం ఉండటం వలన కొత్తవాళ్ళు రంగంలో దిగటానికి ప్రధాన అవరోధం తొలగిపోయినట్టవుతుంది. హిట్స్ వేదిక వారి మౌలికసదుపాయాలు వాడుకోవటమంటే డిజిటైజేషన్ కార్యకలాపాలను ఆర్థికంగా గిట్టుబాటు అయ్యేటట్టు చూసుకోవటమే. పైగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటైజేషన్ వేగవంతం కావటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

డిటిహెచ్ లో ట్రాన్స్ పాండర్ బాండ్ విడ్త్ ఆదా చేయటం వలన దానిని బ్రాడ్ బాండ్ సర్వీసుల లాంటి ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్ అవసరాలకోసం వాడుకోవటానికి వీలవుతుంది. మరీ ముఖ్యంగా కొండప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు బ్రాడ్ బాండ్ సేవలు అందించటం సాధ్యమవుతుంది. ఈ పొదుపు వలన ఎంతో విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. కారణమేంటంటే ఇప్పుడు మన శాటిలైట్ చానల్స్ కి అధికశాతం విదేశీ శాటిలైట్స్ మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాం.  మౌలిక సదుపాయాలను ఉమ్మడిగా వాడుకోవటం వలన బ్రాడ్ కాస్టింగ్, టీవీ పంపిణీ రంగాలలో వర్చువల్ నెట్ వర్క్ ఆపరేషన్స్ (విఎన్ వో) ప్రవేశపెట్టేందుకు అవకాశాలేర్పడతాయి. నిర్దిష్టంగా చందాదరుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సేవలు సరసమైన ధరలకు అందించగలిగేలా వి ఎన్ వో లు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను వాణిజ్యపరంగా వాడుకోగలుగుతాయి..

మౌలిక సదుపాయాల ఉమ్మడి వాడకంలో ఎదురయ్యే సవాళ్ళు

అయితే, మౌలిక సదుపాయాలను ఉమ్మడిగా వాడుకోవటంలో ఎదురయ్యే సవాళ్ళగురించి కూడా ట్రాయ్ కి తెలుసు. ముఖ్యంగా మూదు రకాల సవాళ్ళు ఎదురవుతాయని గుర్తించింది. అవి నిర్వహణపరమైనవి, వాణిజ్యపరమైనవి, నియంత్రణపరమైనవి.

డిటిహెచ్ రంగంలో పంపిణీదారుడు శాటిలైట్ సామర్థ్యాన్ని ఇతర పంపిణీదారులతో పంచుకోదలచుకుంటే చందాదారుల ఆవరణలో డిష్ యాంటెన్నా అందుకు తగినట్టుగా మార్చుకోవాల్సి ఉంటుంది. శాటిలైట్ మారినప్పుడు మార్చుకోవటం ఏమంత సులభం కాదు. సర్వీస్ ప్రొవైడర్లు వాడుకునే సాంకేతిక పరిజ్ఞానంలో  తేడాలున్నప్పుడు కొత్త సవాళ్ళు ఎదురుకావచ్చు. అదే విధంగా వ్యాపార కొనసాగింపు, పెనువిపత్తునుంచి కొలుకోవటానికి పథల రచనలోను ఇబ్బందులు ఏర్పడవచ్చు.

నిర్వహణ సంబంధమైన సమస్యలతోబాటు బ్రాడ్ కాస్టర్లకు, నెట్ వర్క్ ఆపరేటర్లకు, సర్వీస్ ప్రొవైడర్లకు మధ్య సంబంధాలు, వాణిజ్యపరమైన షరతులు, వివాద పరిష్కారాలు, పైరసీ సమస్యలు, బిల్లింగ్ వ్యవహారాలు, చందాదారుల ఆడిట్, ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది ఆపరేటర్లకు సేవల డిస్ కనెక్షన్ లాంటి అనేక అంశాలకు పరిష్కారమార్గాలు కనిపెట్టాల్సి వస్తుంది. ఇదంతా పూర్తయ్యాకే మౌలిక సదుపాయాలను పంచుకోవటం ద్వారా లాభాలు పొందటం మొదలవుతుంది. అయితే ఇప్పుడున్న విధానాన్ని కూడా మార్చవలసి ఉంటుందని ట్రాయ్ అభిప్రాయపడుతోంది. పంపిణీ స్థాయిలో నెట్ వర్క్, సర్వీస్ ప్రొవైడర్ల విధులను వేరు చేయటానికి ఒక స్వరూపాన్ని రూపొమ్దించవలసి ఉంటుందని భావిస్తోంది.

ట్రాయ్ ఉద్దేశం ప్రకారం బ్రడ్ కాస్టింగ్ సర్వీసుల పంపిణీ సమర్థంగా జరగాలంటే నెట్ వర్క్ ను, సేవలను విడదీయాలి. నెట్ వర్క్ ప్రొవైడర్ మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు, అదే సమయంలో సర్వీస్ ప్రొవైడర్లు చందాదారుల అవసరాల మీద దృష్టి సారించవచ్చు. మౌలిక వసతులను మెరుగ్గా వాడుకోవటానికి ఏం చేయాలో సూచించాలని కూడా ఇందులో భాగస్వాములైనవారందరినీ ట్రాయ్ కోరుతోంది. ఈ విధానాన్ని మరింతగా మెరుగుపరచటానికి ఎలాంటి నిర్వహణ పరమైన, వాణిజ్య పరమైన , సాంకేతిక పరమైన, నిబంధనల పరమైన చర్యలు తీసుకోవాలో కూడా సూచించవలసిందిగా ట్రాయ్ కోరింది. ఇందుకోసం డిటిహెచ్, హిట్స్, డిజిటైజేషన్ లలో ఇప్పుడున్న లైసెన్సింగ్ విధానంలోగాని, రిజిస్ట్రేషన్ ప్రక్రియలోగాని ఏవైనా మార్పులు అవసరమైతే అవికూదా సూచిస్తూ జూన్ 23 లోగా అభిప్రాయాలు తెలియజేయాలని ట్రాయ్ సూచించింది. ఈ అభిప్రాయాల ఆధారంగా విధాన నిర్ణయం రూపొందించే అవకాశాలుంటాయి.