• Home »
  • Regulations »
  • టీవీ పరిశ్రమ పరిణతి ప్రదర్శిస్తే నియంత్రణలో సడలింపులకు సిద్ధం: ట్రాయ్

టీవీ పరిశ్రమ పరిణతి ప్రదర్శిస్తే నియంత్రణలో సడలింపులకు సిద్ధం: ట్రాయ్

టీవీ పరిశ్రమలోని భాగస్వాములందరూ మరింత పరిణతి ప్రదర్శిస్తూ సమన్వయంతో వ్యవహరిస్తే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) తన నిబంధనలను సరళతరం చేయటానికి వెనుకాడబోదని సంస్థ సలహాదారు ఎస్ కె సింఘాల్ ప్రకటించారు. వీలైనంత వరకు నిబంధనల చట్రాన్ని సరళీకృతం చేయటానికే ట్రాయ్ మొగ్గు చూపుతుందన్నారు. అయితే, అది పరిశ్రమ ప్రవర్తనమీదనే ఆధారపడి ఉంటుందన్నారు. ఢిల్లీలో జరిగిన డిజిటైజ్ ఇండియా సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు.

పరిశ్రమలో భాగస్వాములైన బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు తమ మధ్య ఏర్పడిన వివాదాలను ఎందుకు తమకు తాముగా పరిష్కరించుకోలేకపోతున్నరో ఆత్మ పరిశీలనచేసుకోవాలని కోరారు. పైగా ప్రభుత్వాన్ని, ట్రాయ్ ని నిందించటం ఆనవాయితీగా మారిపోయిందన్నారు. నియంత్రణా సంస్థగా ట్రాయ్ ఎప్పుడూ పరిశ్రమ ప్రయోజనాలనూ, చందాదారుల ప్రయోజనాలనూ సమానంగా పరిరక్షించటానికే జట్టుబడి ఉంటుందని చెప్పారు.

నిత్యావసర సరకులు సైతం నియంత్రణ పరిధి దాటినప్పుడు టీవీ చానల్స్ తమ ధరలను నిర్ణయించుకునే అధికారం లేకుండా చేయటమేంటని బ్రాడ్ కాస్టర్ ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ టోకు ధరలను మాత్రమే నియంత్రించామని, చిల్లర ధరలను మాత్రం వదిలేశామని చెప్పారు. టోకు ధరల్లో సైతం పరిశ్రమ 8-10 శాతం సీలింగ్ మధ్యనే పనిచేస్తోందన్నారు. అది అనలాగ్ ధరల్లో 42 శాతంగా నిర్ణయించటాన్ని గుర్తుచేశారు.

కొనుగోలు శక్తి ఒక విధంగా లేదు కాబట్టి భారత మార్కెట్లను విదేశీ మార్కెట్లతో పోల్చటానికి వీల్లేదని సింఘాల్ వ్యాఖ్యానించారు. ధరల నియంత్రణలో సైతం ఆదాయంలో తగినంత అభివృద్ధి ఉండేలా ట్రాయ్ చర్యలు తీసుకున్నదన్నారు. భారత పరిస్థితులకు, వినియీగదారుల ఆర్థిక స్థితిగతులకు తగిన విధంగానే వ్యవహరిస్తున్నట్టు ఆయన వివరణ ఇచ్చారు. డిజిటైజేషన్ కింద చందాదారుడు ఒక పే చానల్ తీసుకున్నా సరే కనీస నెలవారీ చందా రూ.150 ఉంటుందని అందువలన చందారుడికి అందించే సేవలకు తగినట్టుగా ఆదాయం వస్తుందని చెప్పారు.

ఇటీవల విడుదల చేసిన చర్చా పత్రం గురించి ప్రస్తావిస్తూ టారిఫ్ విషయంలో ఒక సమగ్ర చర్చ జరగాల,ని శాశ్వత పరిష్కారం లభించాలని ఆశించటం వల్లనే అందరి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఒక్క టారిఫ్ కే పరిమితం కాకుండా కారేజ్ ఫీజు విషయంలోనూ నియంత్రణ అమలు చేయటంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని నిర్ణయించుకున్నామన్నారు. పరిశ్రమ లోని భాగస్వాములు వెల్లడించే అభిప్రాయాలను బట్టే ఫలితం  కూడా ఉంటుందన్నారు. ఈ రంగంలోకి పెట్టుబడులు కూడా వచ్చేలా చర్చా పత్రం రూపొందించామన్నారు. బ్రాడ్ బాండ్, వీడియో ఆన్ డిమాండ్ లాంటి సేవల ద్వారా మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటం వలన చాలామంది పెట్టుబడులు పెట్టటానికి ముందుకు వస్తారన్నారు.

వ్యవస్థలో సమతుల్యత సాధించే దిశలో ఒకవైపు ట్రాయ్ నియంత్రణ చట్రాన్ని రూపొందించే పనిలో ఉన్నప్పటికీ మరోవైపు ఆ నిబంధనలను అమలు చేయటంలోనూ శ్రద్ధ చూపుతుందని సింఘాల్ వివరించారు. అందుకు ఉదాహరణగా బ్రాడ్ కాస్టర్లకు, ఎమ్మెస్వోలకు మధ్య ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలను ప్రస్తావించారు. లోపాలను సవరించేందుకు ట్రాయ్ అందులో సవరణలు చేసిందన్నారు. దాని ఫలితంగానే ఒప్పందం లేకుండా ఎమ్మెస్వోలకు సిగ్నల్స్ ఇవ్వకుండా బ్రాడ్ కాస్టర్లను నియంత్రించగలిగామన్నారు. అదే విధంగా ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య కూడా ఒప్పందాలు జరిగేట్టు చూస్తామన్నారు.

ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు మధ్య కుదరాల్సిన ఇంటర్ కనెక్షన్ ఒప్పందం విషయంలో ఒక ప్రామాణిక ముసాయిదా తయారుచేసి చర్చకు పెట్టిందని వివరించారు. ముందు ముందు నిబంధనల అమలు మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారాయన. నిబంధనలు అమలు చేయటంలో వెనుకాడే ప్రసక్తే లేదని, అలా బలవంతంగా అమలు చేయాల్సిన పరిస్థితే వస్తే మౌలిక సదుపాయాలకోసం కొంత ఖర్చవుతుందని, ఆ ఖర్చు మళ్ళీ వినియోగదారుల మీదనే పడుతుందని గుర్తుచేశారు.