• Home »
 • Cable »
 • పే చానల్ రేట్ల మీద సమగ్రవిధానం : చర్చా పత్రం విడుదల చేసిన ట్రాయ్

పే చానల్ రేట్ల మీద సమగ్రవిధానం : చర్చా పత్రం విడుదల చేసిన ట్రాయ్

పే చానల్స్ చందాలమీద ఒక సమగ్ర విధానాన్ని రూపొందించటానికి ఎట్టకేలకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) నడుం బిగించింది. ఎంతోకాలంగా టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తుండగా సూచిస్తూ ఉండగా ట్రాయ్ ఇప్పుడు స్పందించి విధి విధానాల రూపకల్పన దిశలో ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది.

ఇప్పుడున్న పే చానల్ టారిఫ్ విధానాన్ని సమీక్షించి డిజిటైజేషన్ లో అన్ని రకాల ప్లాట్ ఫామ్ ల మీద టోకుగా, చిల్లరగా రేట్లు ఎలా నిర్ణయించాలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించటానికి శ్రీకారం చుట్టింది.  డిటిహెచ్, కేబుల్ టీవీ, హిట్స్, ఐపిటివి లో ఏయే ధరలకు చానల్స్ ఇవ్వాలో ఇప్పుడు నిర్ణయించబోతోంది. ఈ చర్చా పత్రం ద్వారా అభిప్రాయాలు సేకరించటంతోబాటు దానిమీద వ్యాఖ్యలు కూడా తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటారు.

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలలో పారదర్శకత తీసుకురావాలని, వేరు వేరు ఎమ్మెస్వోల మధ్య బ్రాడ్ కాస్టర్లు ఎలాంటి వివక్షా చూపించకుండా చర్యలు తీసుకోవాలని ట్రాయ్ భావిస్తోంది.  పే చానల్ చందాల విధానం రూపకల్పనలో చందాదారుడి ప్రయోజనాలు కాపాడేలా చానల్స్ ఎంచుకోవటంలోనూ, బడ్జెట్ కు తగినట్టు నిర్ణయం తీసుకోగలిగేలా స్వేచ్ఛ కల్పించటానికి ట్రాయ్ ప్రయత్నిస్తోంది. దీన్ని ప్రభావితం చేసే మార్కెట్ శక్తులను కూడా గుర్తించి మరో ప్రత్యేకమైన నియంత్రణావ్యవస్థను ఏర్పాటు చేయాలా అనే అంశాన్ని కూడా ట్రాయ్ పరిశీలించబోతోంది.

అదే విధంగా కారేజ్ ఫీజు విషయంలో కూడా నియంత్రణ ఉండాలేమో చెప్పాల్సిందిగా ట్రాయ్ ఈ చర్చా పత్రంలో వివిధ భాగస్వాములను కోరింది. అంటే చందాదారుల సంఖ్యను బట్టి ఒక్కో చానల్ నుంచి వసూలు చేయాల్సిన కారేజ్ ఫీజు మీద గరిష్ఠ పరిమితి విధించాలని కోరుకునే పక్షంలో ఆ విషయం కూడా సూచించాలని ట్రాయ్ కోరుతోంది. ఒక్కో టీవీ చానల్ కూ చందాదారుల సంఖ్య పెరిగే కొద్దీ కారేజ్ ఫీజు తగ్గించాలా ? ప్లేస్ మెంట్ ఫీజు, మార్కెటింగ్ ఫీజు మీద కూడా నియంత్రణ ఉండాలా? ఈ అంశాలను ట్రాయ్ పరిధిలోకి తీసుకొని నియంత్రణ నిబంధనలు రూపొందించాలా అనే విషయాలను కూడా ట్రాయ్ చర్చకు పెట్టింది.

టీవీ సేవలకు సంబంధించిన టారిఫ్ వ్యవహారాలు (Tariff issues related to TV services) పేరుతో జనవరి 29న ట్రాయ్ ఈ చర్చా పత్రాన్ని విడుదల చేసింది. టీవీ బ్రాడ్ కాస్టింగ్ రంగంలో వస్తున్న మార్పులు, తలెత్తుతున్న ధోరణులను, చందాదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని  ఒక సమగ్రమైన దృక్పథంతో దీర్ఘకాలిక ప్రభావం ఉండేలా విధాన రూపకల్పన చేయటం తన లక్ష్యమని ట్రాయ్ ఈ చర్చాపత్రంలో పేర్కొంది. టారిఫ్ విధానం వీలైనంత సరళంగాను, సూటిగాను, హేతుబద్ధంగాను ఉండేట్టు చూస్తే  ఈ వ్యవహారంలో భాగస్వాములైన బ్రాడ్ కాస్టర్లు, పంపిణీ దారులైన ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు అందరూ ప్రయోజనం పొందుతూ పారదర్శకత చవిచూస్తారని ట్రాయ్ అభిప్రాయపడుతోంది.

అదే సమయంలో వీరందరి మధ్య ఎక్కడా, ఎలాంటి వివాదాలూ రాకుండా చూడటం కూడా లక్ష్యమని ఈ చర్చా పత్రం పేర్కొంది. అప్పుడే ఆరోగ్యకరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, చందాదారులకు తగినంత ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని ట్రాయ్ అభిప్రాయపడింది. అదే సమయంలో చందాదారులు హేతుబద్ధంగాలేని చందారేట్లనుంచి, అర్థం పర్థం లేని చందాల పెంపు నుంచి కాపాడబడతారు.

టీవీ రంగంలో పెట్టుబడులు పెరగటానికి, తద్వారా నాణ్యమైన కార్యక్రమాల రూపకల్పనకు సాయపడాలన్నది తన అభిమతమని ట్రాయ్ పేర్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటం, పంపిణీకి అనేక ప్లాట్ ఫామ్స్ కూడా అందుబాటులోకి రావటం, సరికొత్త వ్యాపార నమూనాలు వెలుగు చూడటం, అడ్రెసిబిలిటీ పెరగటం వలన ఎదుగుదలకు అనుకూలించే వాతావరణాన్ని పెంపొందించటం లక్ష్యంగా ట్రాయ్ ఈ చర్చాపత్రంలో పేర్కొంది.

చర్చాపత్రంలో పేర్కొన్న కీలక అంశాలు

 • టోకు, చిల్లర ధరల స్థాయిలో టారిఫ్ నమూనాలు
 • చానల్ ధరనిర్ణయించే విధానం, పద్ధతులు
 • ఒక్కో విభాగం చానల్స్ ( జనరల్ ఎంటర్టైన్మెంట్, న్యూస్, మ్యూజిక్, మూవీస్ .)కి పరిమితి నిర్ణయించటం
 • ప్రత్యేకాంశాల చానల్స్ ( వ్యవసాయం, విద్య, ఆరోగ్యం ) కి సంబంధించిన సమస్యలు
 • హెచ్ డి చానల్స్ కి ధర నిర్ణయం
 • చానల్ ధర, లేదా బొకే ధర సరళతరం చేయటం
 • ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ ( ఇపిజి) లో చానల్ కనబడటం
 • కార్యక్రమాల వారీగా టారిఫ్ నిర్ణయించటం (Pay Per View )
 • చానల్స్ కారేజ్ ఫీజు, ప్లేస్ మెంట్ ఫీజు, మార్కెటింగ్ ఫీజులో రకాలు

ట్రాయ్ అడిగిన కొన్ని ప్రశ్నలు  

 • ఒకే తరహా చానల్స్ అయినప్పటికీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ ను భాషలవారీగా విభజించి చెప్పాల్సిన అవసరముందా? అంటే ఇంగ్లీష్ జిఇసి, తెలుగు జిఇసి, హిందీ జిఇసి అని విభజించి చెప్పాలా? లేదా అన్నిటినీ కలిపి జిఇసి అంటే సరిపోతుందా?
 • బ్రాడ్ కాస్ట్ చానల్ ధర మార్కెట్ శక్తి కారణంగా టోకున మారిపోయే అవకాశం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
 • ఒక్కో విభాగానికీ ధర పరిమితి నిర్ణయించటానికి ఎలాంటి ప్రాతిపదిక ఉండాలి?
 • ధర పరిమితి నిర్ణయానికి సగటున ఆ విభాగపు రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ సగటు ధర లో ఎంత శాతం డిస్కౌంట్ ను పరిగణించవచ్చు ?
 • హెచ్ డి చానల్స్ కు, వాటి ఎస్ డి చానల్స్ కు ధరలో ఏదైనా సంబంధం ఉండాలా?
 • ఒకే రకమైన కార్యక్రమాలతో ఉండే హెచ్ డి, ఎస్ డి చానల్స్ ను బొకే లో పెట్టి చందాదారుడికి ఇవ్వజూపవచ్చునా?
 • ఒకే చానల్ ప్రసారాంశాలతో మరిన్ని చానల్స్ తయారుచేసి అందిస్తున్నప్పుడు చందాదారు ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం లేదా ? ఉదాహరణకు ఒక ప్రధాన చానల్ లో ప్రసారం చేసిన కార్యక్రమాలనే తిరిగి అదే గ్రూపుకు చెందిన మరో చిన్న చానల్ లో ప్రసారం చేసి రెండింటికీ పే చానల్ మొత్తాలు వసూలు చేయటం సమంజసమా ? దీన్ని నియంత్రించాలా ?

ఇందుకు సంబంధించిన వారు….అంటే బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలు, కేబుల్ టీవీ ఆపరేటర్లు, పంపిణీ దారులు వారి వారి అభిప్రాయాలు వెలిబుచ్చుతూ మార్చి 4 లోగా ట్రాయ్ కి రాయాలి. ఆ అభిప్రాయాలమీద వ్యాఖ్యలు పంపదలచుకున్నవారు మార్చి 18 వరకు పంపవచ్చు. ట్రాయ్ ఈ అభిప్రాయాలన్నిటినీ తన వెబ్ సైట్ లో ఉంచుతుంది. వాటి మీద వ్యాఖ్యానాలు కూడా వెబ్ సైట్ లో ఉంచటం ద్వారా విస్తృతమైన చర్చకు అవకాశం కల్పిస్తుంది.

టారిఫ్ నిర్ణయించే విషయంలో  టిడిశాట్ ఆదేశాలకు అనుగుణంగా తాజాగా మళ్ళీ కొత్త మార్గదర్శకాలతో ముందుకు రావాలని గత ఆగస్టులో  సుప్రీంకోర్టు ట్రాయ్ ని ఆదేశించింది. గతంలో ట్రాయ్, 27.5% టారిఫ్ పెంచుకోవటానికి బ్రాడ్ కాస్టర్లకు ఒక అవకాశం ఇచ్చింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఆధారంగా ఎప్పటికప్పుడు పెంచుకోవటానికి కూడా అవకాశమిచ్చింది.  అయితే, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ ట్రాయ్ కి టిడిశాట్ గత ఆగస్టు 4న ఆదేశాలిచ్చింది. దీంతో ట్రాయ్, పరిశ్రమలోని భిన్న వర్గాల అభిప్రాయాలు సేకరించేందుకు ఈ చర్చా పత్రాన్ని రూపొందించి విడుదలచేసింది. పైగా ఈ మధ్యనే స్టార్ ఇండియా – ఎన్ ఎస్ టి పి ఎల్ కేసులో కూడా టిడిశాట్ తీర్పు చెబుతూ,  ట్రాయ్ కి ఈ మార్గదర్సకత్వక బాధ్యతలు అప్పగించింది. ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించే అవకాశం ఇచ్చింది. టిడి శాట్ కూడా ట్రాయ్ కి అదేశాలు జారేచేసింది.

బ్రాడ్ కాస్టర్లు ఇష్టమొచ్చినట్టు పే చానల్ ధరలు నిర్ణయించి వసూలు చేసుకోవటానికి అర్థం లేని బొకేలు రూపొందిస్తూ ఉండట మీద  పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ చర్చా పత్రం ప్రాధాన్యం సంపాదించుకుంది. ఎమ్మెస్వోలు భారీగా నష్టపోయే పరిస్థితులు వస్తూ ఉండటంతో ఈ చర్చాపత్రంలో అభిప్రాయ సేకరణ సందర్భంగా తమ అభిప్రాయాలను కుండ బద్దలుకొట్టినట్టుగా చెప్పాలని నిర్ణయించుకుంటున్నారు.

అదే విధంగా ఎమ్మెస్వోలకు, హిట్స్ ఆపరేటర్ కు, డిటిహెచ్ ఆపరేటర్ కు ఒకే విధమైన టారిఫ్ అమలు చేయాలే తప్ప ఎలాంటి వివక్షా  ఉండకూడదన్నది కూడా ఎమ్మెస్వోల వాదన.  పే చానల్ చందాలతోబాటు ప్రకటనల ఆదాయం కూడా సంపాదించుకుంటున్న బ్రాడ్ కాస్టర్లమీద అదనపు పన్నులు విధించాలే తప్ప ఎమ్మెస్వోలమీద, ప్రేక్షకులమీద విధించకూదదని ఎమ్మెస్వోలు అంటున్నారు.  ఇప్పుడు తమ అభిప్రాయాలను చెప్పి తమ వాదనలో పస ఉందని నిరూపించుకోవాల్సిన సమయం ఇదే.