• Home »
  • Cable »
  • సెట్ టాప్ బాక్సుల మార్పిడిమీద ట్రాయ్ కి ఐఐటి నిపుణుల సాయం

సెట్ టాప్ బాక్సుల మార్పిడిమీద ట్రాయ్ కి ఐఐటి నిపుణుల సాయం

ఒక సెట్ టాప్ బాక్స్ మరో ఎమ్మెస్వో పరిధిలోకి వెళితే పనిచేయదు.ఒక డిటిహెచ్ ఆపరేటర్ దగ్గరకొనుక్కున్న సెట్ టాప్ బాక్స్ మరో డిటిహెచ్ ఆపరేటర్ దగ్గర పనిచేయదు. ఊరు మారితే మళ్ళీ ఇంకో ఎమ్మెస్వో దగ్గర కొనుక్కోవాల్సిందే. అయితే, వినియోగదారులను ఈ సమస్య నుంచి బైట పడేయటానికి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)  ప్రయత్నాలు ప్రారంభించింది. ఎప్పుడూ ఆలస్యంగా నిద్రలేచే ట్రాయ్ ఈ విషయంలోనూ తన తీరును ఎప్పటిలాగానే ప్రదర్శించింది.

డిటిహెచ్ కి అనుమతులు ఇచ్చే సమయంలోనే ఈ ప్రశ్న తలెత్తింది. ఆపరేటర్ ఎవరైనా సరే, మార్కెట్లో రిసీవర్/ సెట్ టాప్ బాక్స్ కొనుక్కునే సౌకర్యం ఉండేట్టు చేసి  సర్వీస్ ప్రొవైడర్ ను మార్చుకునే వెసులుబాటు కల్పించి ఉండాల్సింది. కానీ ఆ విషయాన్ని సర్వీస్ ప్రొవైడర్లకే వదిలేయటం వలన చందాదారులు చాలా సమస్యలు ఎదుర్కున్నారు. అదే పరిస్థితి డిజిటైజేషన్ మొదలయ్యాక కూడా ఎదురైంది. డిటిహెచ్ విషయంలో నాలుక కరుచుకున్న ట్రాయ్ ఆ తరువాత అయినా అప్రమత్తంగా ఉంటుందనుకుంటే అలాంటిదేమీ జరగలేదు.

తీరా అంతా అయిపోయాక ఇప్పుడు తాపీగా తప్పులు దిద్దుకునే పని మొదలుపెట్టింది.  సెట్ టాప్ బాక్సులను మార్చుకునేలా చేయటానికి వాటికి ఎలాంటి మార్పులు అవసరమో పరిశోధించటానికి పేరుమోసిన సంస్థల నిపుణులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ( ఐఐఎస్ సి) లకు చెందిన సాంకేతిక అనుభవజ్ఞుల సహాయం తీసుకుంటోంది. ఎక్కడైనా, ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరైనా వాడుకోగలిగేలా ఎలా చేయాలో వాళ్ళ సలహాలు ఆశిస్తోంది.

ప్రస్తుతం 12 మంది నిపుణులు ఈ విషయాన్ని అధ్యయనం చేస్తున్నారని ట్రాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ వెల్లడించారు. సాంకేతిక కారణాలవలన బాక్సుల మార్పిడి సాధ్యం కావటం లేదని అందుకే రెండు ప్రీమియర్ సంస్థలప్రొఫెసర్ల సాయం తీసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయంలో ఏప్రిల్ లోనే ఒక ముందస్తు చర్చా పత్రం జారీ చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. చందాదారులకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా ఈ విషయంలో అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెబుతూ పైరసీ లాంటి ప్రమాదాల గురించి బ్రాడ్ కాస్టర్లు ఆందోళన చెందుతున్నమాట నిజమేనన్నారు.

కేవలం సిఐ స్లాట్ ఒక్కటి ఉండటంతోనే సమస్య పరిష్కారం కాదని, సాంకేతికంగా అన్ని విధాలా సిద్ధంగా ఉండాలంటే సర్వీస్ ప్రొవైడర్ మారినప్పుడల్లా  ట్యూనర్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, ఇపిజి లాటివి కూడా అప్ గ్రేడ్ కావాల్సి ఉంటుందని  అందుకే ఇప్పటికీ ఇది కలలాగే మిగిలి ఉందని ట్రాయ్ చైర్మన్ అభిప్రాయపడ్డారు. డిటిహెచ్ ఆపరేటర్లు రకరకాల కంప్రెషన్ టెక్నాలజీలు వాడుతూ ఉండటం కూడా మార్పిడికి అవరోధంగా మారిందన్నారు.