• Home »
  • Top Stories »
  • ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలలో కొద్దిపాటి మార్పులు, చేర్పులకు ట్రాయ్ సుముఖత

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలలో కొద్దిపాటి మార్పులు, చేర్పులకు ట్రాయ్ సుముఖత

ఎమ్మెస్వోలకూ, స్థానిక కేబుల్ ఆపరేటర్లకూ మధ్య జరగాల్సిన ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల విషయంలో  టిడిశాట్ లోను, అనేక హైకోర్టులలోనూ వివాదాలు విచారణకు వస్తూ ఉండటంతో ట్రాయ్ ఒక నమూనా ఒప్పందాన్ని, ఒక ప్రామాణిక ఒప్పందాన్ని  రూపొందించిన సంగతి తెలిసిందే.  అయితే, ఇప్పుడు ఏడో సవరణ పేరుతో కొంత వెసులుబాటు కల్పించింది. ప్రామాణిక ఒప్పందానికి కట్టుబడి ఉంటూ నే నమూనా ఒప్పందంలో పరస్పర ఆమోదయోగ్యమైన అంశాలు చేర్చుకోవచ్చునని తేల్చి చెప్పింది. అయితే, నిబంధనలను పూర్తిగా నిర్వీర్యం చేసేవిధంగా మాత్రం ఈ ఒప్పందం ఉండకూడదు.

ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు మధ్య వివాదాలకు తావు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా నమూనా ఇంటర్ కనెక్ట్ ఒప్పందాన్ని, ప్రామాణిక ఇంటర్ కనెక్ట్ ఒప్పందాన్ని రూపొందించినట్టు ట్రాయ్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఆరోగ్యకరమైన వాతావరణంలోందరికీ సమానావకాశాలు ఉండాలన్నదే తన లక్ష్యమని కూడా ట్రాయ్ చెప్పింది. దీనివలన అంతిమంగా చందాదారులు లబ్ధి పొందుతారని ట్రాయ్ అభిప్రాయపడింది.

నిజానికి ట్రాయ్ 2012 లోనే సమగ్రంగా డిజిటైజేషన్ కోసం ఒక నియంత్రణ విధానాన్ని రూపొందించింది. అందులో ఇంటర్ కనెక్షన్ నియమావళి, సేవల నాణ్యతా నిబంధనలు, టారిఫ్ ఆర్డర్, చందాదారుల ఫిర్యాదుల పరిష్కారం లాంటి అన్ని అంశాలమీద సవివరంగా నియమావళి తయారుచేసింది. ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు కచ్చితంగా ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలమీద సంతకాలు చేసుకోవాలనే నిబంధన విధించింది. ఇద్దరి బాధ్యతలు, పోషించాల్సిన పాత్రలను అందులో నిర్దేశించింది.

అయితే, అప్పట్లో నోటిఫై చేసిన సమయంలో ఎలాంటి నమూనాను నిర్దిష్టంగా ప్రకటించలేదు. ఆ తరువాత కాలంలో ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు మధ్య అనేక వివాదాలు తలెత్తటం, అవి టిడిశాట్ కు హైకోర్టులకు వెళ్ళటం తెలిసిందే. ఎమ్మెస్వోలు తయారుచేస్తున్న ఒప్పందాలు ఏకపక్షంగా ఉంటున్నాయంటూ కేబుల్ ఆపరేటర్ల సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఒక సమగ్రమైనచర్చాపత్రం సాయంతో అభిప్రాయాలు సేకరించిన ట్రాయ్ ఇద్దరికీ న్యాయం జరిగేలా నమూనా ఒప్పందాలు తయారుచేసింది.