• Home »
  • Cable »
  • ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలమీద ట్రాయ్ సమక్షంలో 14న సమావేశం

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలమీద ట్రాయ్ సమక్షంలో 14న సమావేశం

డిజిటైజేషన్ మూడో దశకు గడువు దగ్గరపడుతున్నప్పటికీ బ్రాడ్ కాస్టర్లకూ, ఎమ్మెస్వోలకూ మధ్య ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు ఒక కొలిక్కి రాకపోవటంతో ట్రాయ్ నేరుగా రంగంలోకి దిగింది. టాస్క్ ఫోర్స్ సమావేశంలో సమాచార,ప్రసారాల మంత్రిత్వశాఖ కూడా ఈ విషయం మీదనే ప్రధానంగా దృష్టిపెట్టి, జాప్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా ఈ నెల 14 న బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలతో సమావేశం ఏర్పాటుచేసి ఇరుపక్షాల వాదనలూ విని పరిష్కారాలు సూచించాలని భావిస్తోంది.

అదనపు కార్యదర్శి  జె ఎస్ మాథుర్ అధ్యక్షతన ఈ నెల 7 న జరిగిన 9వ టాస్క్ ఫోర్స్ సమావేశంలో ట్రాయ్ ఈ మేరకు ప్రకటించింది. ఒప్పందాల విషయంలో ఎక్కడైనా నిర్దిష్టమైన సమస్యలుంటే ఎ నెల 10 లోగా తన దృష్టికి తీసుకురావాలని కూడా ట్రాయ్ కోరింది. ఏ చానల్ తో ఇబ్బందులున్నాయోందులో స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. దాని వలన ఆయా చానల్ యాజమాన్య ప్రతినిధులనూ సమావేశాని రప్పించవచ్చునని ట్రాయ్ అభిప్రాయపడింది.

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు జరగకుండా సెట్ టాప్ బాక్సులు అమర్చటం గాని, వినియోగదారు దరఖాస్తులు నింపి తీసుకోవటం గాని సాధ్యంకాదని ఎమ్మెస్వోలు తెగేసి చెబుతున్నారు. ఈ కారణంగా మొత్తం డిజిటైజేషన్ ప్రక్రియ నిదానించే పరిస్థితి రాకుండా చూడాలని ప్రభుత్వం చెప్పటంతో జూన్ 21 వ తేదీనే గడువుగా నిర్దేశించినా ఆశించిన ప్రయోజనం కనబడలేదు. దీంతో ఈ సమస్య పరిష్కారానికి నేరుగా రంగంలోకి దిగింది.