• Home »
  • Legal Issues »
  • ప్రకటనల హద్దు మీరిన చానల్స్ మీద కేసు విచారణ ఏప్రిల్ కి వాయిదా

ప్రకటనల హద్దు మీరిన చానల్స్ మీద కేసు విచారణ ఏప్రిల్ కి వాయిదా

గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల సొంత కార్యక్రమాల ప్రచార ప్రకటనలు మించి ప్రసారంచేయకూడదన్న నిబంధనలు ఉల్లంఘించిన ఫిర్యాదు మీద విచారణను చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఏప్రిల్ 2 కు వాయిదా వేసింది.

మా టీవీ, ఈనాడు టెలివిజన్, సన్ టీవీ నెట్ వర్క్ సహా మొత్తం 12 సంస్థలమీద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ సెంట్రల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పూరన్ చంద్ విచారణకు చేపట్టారు. అయితే, ప్రకటనల పరిమితికి సంబంధించిన ప్రధానమైన పిటిషన్ ఒకటి ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

వీటిలో కొన్ని కేసులు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నాయి. కేసు విచారణకు వచ్చినప్పుడల్లా ఆయా చానల్స్ ప్రతినిధులు ఏదో కారణం చెప్పి హాజరుకాకుండా మినహాయింపు పొందుతూ వస్తున్నారు. హద్దు మీరి ప్రకటనలు ప్రసారం చేసిన చానల్స్ మీద ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవటంలేదని ట్రాయ్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. అయితే, అదే సమయంలో అన్ని చానల్స్ ప్రతిరోజూ ఎన్ని ప్రకటనలు ప్రసారం చేస్తున్నదీ నమోదు చేసి ట్రాయ్ కి అందజేయాలని ఆదేశించటం తెలిసిందే