• Home »
  • Cable »
  • మూడో దశ డిజిటైజేషన్ లో అడుగడుగునా తప్పిదాలు

మూడో దశ డిజిటైజేషన్ లో అడుగడుగునా తప్పిదాలు

కేబుల్ టీవీ డిజిటైజేషన్ గడిచిన మూడేళ్ళుగా చేస్తున్న హడావిడి ఒక వంతయితే మూడోదశ చివరినెలలో జరిగిన హడావిడి అంతా మరో వంతు. మొదటి రెండు దశలలో ఎమ్మెస్వోల సంఖ్య తక్కువగా ఉండటం ప్రభుత్వానికి అనుకూలమైన అంశం. పైగా, అధికాదాయ వర్గాల వారు ఉండటం, విద్యాధికులు ఎక్కువగా ఉండటం కూడా డిజిటైజేషన్ అమలుకు అనుకూలమైన అంశంగా మారింది. ఇప్పుడు మూడోదశ అమలు సాగుతూ వచ్చిన పట్టణాలలోనూ పరిస్థితి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ గడిచిన రెండు దశల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అనేక సమస్యలకు పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. పైగా, ఈ పట్టణాలలోని ఎమ్మెస్వోల పరిధిలో అనేక గ్రామాలు ఉండటం, వాటిని కూడా బలవంతంగా డిజిటైజ్ చేసేందుకు ప్రయత్నించటం లాంటివి సవాళ్ళుగా మారాయి. ప్రభుత్వం నిర్వహించాల్సిన అనేక బాధ్యతలలో ఏర్పడిన జాప్యం, అది కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు, గడువు పొడిగించే ప్రసక్తే లేదంటూ చేసిన హడావిడి ఇప్పుడొకమారు సమీక్షించుకోవలసి ఉంది.

 

సమస్యల పరిష్కారంలో వేగం అంతంతమాత్రం

ముందుగా నిర్దేశించిన గడువు ప్రకారం డిజిటైజేషన్ జరిగిపోవాలని సమాచార, ప్రసార శాఖ ఒక గట్టి ప్రతిజ్ఞ తీసుకుంది. అయితే, అమలుచేయటంలో ఎదురయ్యే సమస్యలను ఊహించటంలో గాని, వాటిని వేగంగా పరిష్కరించాలన్న ధ్యాసగాని ఎక్కడా కనబడవు. ఆలస్యంగా మేలుకోవటం, హడావిడిగా పరిష్కారానికి ప్రయత్నించటం, మళ్ళీ పప్పులో కాలేయటం ఒక అలవాటుగా మారిపోయాయి.

ప్రభుత్వ నిర్వాకం డిజిటల్ ఎమ్మెస్వోలకు లైసెన్సులు మంజూరు చేయటంతోనే మొదలైంది. అనలాగ్ లో ఎమ్మెస్వోలుగా ఉన్నవారు సైతం కచ్చితంగా డిజిటల్ ఎమ్మెస్వోలుగా రిగిస్టర్ చేసుకోవాలనే నిబంధన విధించింది. అయితే, అప్పటికి సమయం లేకపోవటంతో తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేసింది. ఆయా వ్యక్తులు, సంస్థల డైరెక్టర్ల గతాన్ని, ఆర్థిక నేరాలతో సంబంధాన్ని విచారించి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తేనే శాశ్వత లైసెన్సులు ఇస్తామని చెప్పింది. అప్పట్లో సన్ గ్రూప్ వారి కల్ కేబుల్, ముంబయ్ డిజి లాంటి సంస్థలకు అలాగే లైసెన్సులిచ్చింది. కానీ హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవటంతో వాటి లైసెన్సులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాంటి సంస్థలు కోర్టునుంచి స్టే తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ క్లియరెన్స్ వచ్చాకే లైసెన్సులంటూ మళ్ళీ చెప్పింది. అలా కొంతమంది ఎమ్మెస్వోలకు లైసెన్సులు వచ్చాయి.

అయితే, మూడో దశ గడువు దగ్గరపడుతున్నకొద్దీ హడావిడి ఎక్కువైంది. హోం శాఖ నుంచి క్లియరెన్స్ రావటానికి చాలా సమయం పడుతూ వచ్చింది. దీంతో గడువులోగా పూర్తి కావాలన్న ఉద్దేశంతో హోం శాఖ క్లియరెన్స్ కు కొంత మినహాయింపు ఇస్తూ తాత్కాలిక లైసెన్స్ విధానానికి మళ్ళీ తెరతీసింది. ఒకవేళ హోం శాఖ ఒప్పుకోకపోతే మా లైసెన్స్ రద్దు చేయవచ్చునంటూ హామీ ఇచ్చినవాళ్ళకు తాత్కాలిక లైసెన్స్ ఇస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది. అందుకు సరేనని కొంతమంది ఎమ్మెస్వోలు తాత్కాలిక లైసెన్సులు తీసుకున్నారు.

ఇలా ఉండగా హోం శాఖ మరో విషయం చెప్పింది. ఇంతమంది ఎమ్మెస్వోల దరఖాస్తులు పరిశీలించటం కష్టం కాబట్టి తన బాధ్యతలు తప్పించాలని కోరింది. దీంతో హోంశాఖ తో నిమిత్తం లేకుండా లైసెన్సులివ్వాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అయితే, అధికారికంగా హోం శాఖ నుంచి ఇంకా ఆదేశాలు అందాల్సి ఉంది. ఇన్ని రకాలుగా మినహాయింపులు ఇస్తూ వచ్చినా సగం లైసెన్సు దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఒకవైపు కోర్టులో స్టే తెచ్చుకున్న వారు, మరోవైపు తాత్కాలిక పద్ధతిలో లైసెన్స్ తీసుకున్నవారు భవిష్యత్తులో ఏమవుతుందో తెలియని అయోమయ స్థితిలోనే భారీ పెట్టుబడులతో డిజిటైజేషన్ లో దిగారు.

ఇంటర్ కనెక్షన్ల మీద కొలిక్కిరాని వివాదాలు

 

ఇప్పటివరకూ బ్రాడ్ కాస్టర్లకూ, ఎమ్మెస్వోలకూ మధ్య జరిగిన ఒప్పందాలు ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలు మరో ఎత్తు. వీటిని క్రమబద్ధం చేయటానికి ట్రాయ్ పూనుకున్నప్పటినుంచీ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. పాత ఒప్పందాలు ఎప్పటివరకు అమలులో ఉంటాయనే విషయం ఒక వైపు, కారేజ్ ఫీజు, ప్లేస్ మెంట్ ఫీజు మరోవైపు ఈ వ్యవహారంలో పీట ముడులు వేస్తూనే ఉన్నాయి. ఎవరికివాళ్ళే ఇప్పుడు గట్టిగా ఉండకపోతే ముందు ముందు సమస్యలు తలెత్తవచ్చుననే అభిప్రాయంతో చాలా పకడ్బందీగా ఉండాలనే ఆలోచనతో ఆలస్యానికి కారణమవుతున్నారు. ఆ అనుమానాలను నివృత్తి చేసి ముందుకు నడిపించటంలో ట్రాయ్ ఘోరంగా విఫలమవుతూ వస్తోంది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినా చాలాకాలంపాటు అందులో అందరికీ తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవటం వలన ఆపరేటర్ల వాదనలకు, స్వతంత్ర ఎమ్మెస్వోల సమస్యలకు చర్చించే అవకాశం కలగలేదు. ప్రతిసారీ ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల వ్యవహారం ప్రస్తావనకు వచ్చినా అది కొలిక్కి మాత్రం రాలేదు. ఎప్పటికప్పుడు సూచనలు, హెచ్చరికలకే పరిమితమవుతూ వస్తున్న ట్రాయ్ అంతకంటే ముందడుగు వేయలేకపోయింది.

డిసెంబర్ మొదటివారంలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఎమ్మెస్వోలతో ఒక సమావేశం జరిపింది. 120 మంది హాజరయ్యారు. పరిస్థితిని సమీక్షించింది. చాలా మంది ప్రధానంగా ప్రస్తావించింది ఇంటర్ కనెక్ట్ అగ్రిమెంట్లలో జరుగుతున్న జాప్యాన్నే. బ్రాడ్ కాస్టర్లకూ, ఎమ్మెస్వోలకూ మధ్య జరగాల్సిన ఒప్పందాలు బాగా ఆలస్యమవుతున్న విషయం ఆ విధంగా మరో సారి ప్రధానాంశంగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎక్కడెక్కడ అలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో ఆ విషయాలన్నీ డిసెంబర్ 15 లోగా ట్రాయ్ కి నివేదించాలని మంత్రిత్వశాఖ ఆ సమావేశంలో సూచించింది. అందుకోసం వెంటనే ఒక సమావేశం కూడా ఏర్పాటుచేయాలని ట్రాయ్ ని ఆదేశించింది. ట్రాయ్ కేవలం 10 మంది ప్రధానమైన ఎమ్మెస్వోలతో సమావేశమైంది. ముందుగా సమాచారం సేకరించటానికి ఈ సమావేశం జరిపినా 18 న మరో సమావేశం జరిపి అసలు సమస్యలు తేల్చుతామని చెప్పింది. కానీ ఇవేవీ సంపూర్ణమైన పరిష్కారాన్ని చూపలేక పోయాయి.

చివరి నెలలో పట్టణాల జాబితాలో మార్పులు

మూడో దశకిందికి వచ్చే పట్టణాల జాబితాలో తరచూ మార్పులు చేయటం కూడా ట్రాయ్ అసమర్థత కిందికే వస్తుంది. కేవలం రెండున్నర నెలల గడువుండగా కొన్ని పట్టణాలను తొలగించి మరికొన్ని పట్టణాలను కలపటం అయోమయ వాతావరణాన్ని సృష్టించినట్టయింది. నోడల్ ఆఫీసర్ల సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నదే తప్ప్ ట్రాయ్ అందులో ఎలాంటి హేతుబద్ధతనూ చూపలేకపోయింది. అప్పటికే సగానికి పైగా సెట్ టాప్ బాక్సులు పెట్టిన పట్టణాలను తొలగించటం, నాలుగోదశకు సమయం ఉన్నదికదా అని నిమ్మకు నీరెత్తినట్టు ఎదురుచూస్తూ ఉన్న పట్టణాలను కలపటంలో అర్థం లేదు. పైగా, జనాభా ప్రాతిపదికన చూసినా చిన్న పట్టణాలను కలపటం, పెద్ద పట్టణాలను తొలగించటం విమర్శలకు తావిచ్చింది.

 

ఏడాది సమయమిచ్చినా డిజిటైజేషన్ అంతంతమాత్రంగానే జరిగిన నేపథ్యంలో కేవలం రెండు నెలల వ్యవధిలో ఎలా పూర్తవుతుందన్న అనుమానాలు ఎలాగూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా ఉండగా కేవలం నెలరోజుల సమయం కూదా లేనప్పుడు కూడా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మూడో విడత సవరించిన పట్టణాల జాబితా వెలువరించింది. అందులో అనేక కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. కనీసం ఇలా కొత్తగా జాబితాలో చేరిన పట్టణాల విషయంలోనైనా గడువు తేడీ పొడిగింపు ఉంటుందో లేదో తెలియని అయోమయ వాతావరణం డిసెంబర్ చివరిదాకా కొనసాగటం దురదృష్టకరం.

 

టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటులోనూ జాప్యం

దేశవ్యాప్తంగా చందాదారులను, ఆపరేటర్లను, ఎమ్మెస్వోలను కూడా చైతన్యవంతులను చేయటానికి వీలుగా వాళ్ళకున్న అనుమానాలకు సమాధానాలివ్వటానికి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటుచేయటం మంచిదన్న ఆలోచన రావటానికి మూడేళ్ళు పట్టింది. ఆ ఆలోచనను అమలు చేయటానికి మరో మూడు నెలలు పట్టింది. తీరా అమలు చేసిన తరువాత అది కొన్ని భాషలకే పరిమితమైంది. బహుళ భాషల్లో ఉపయోగించుకోవటానికి వీలుగా ఉంటుదని చెప్పినా అది నాలుగైదు భాషలకు మించి వాడకంలోకి రాలేదు. పైగా ఇదంతా జరిగేసరికి డిసెంబర్ నెల రానే వచ్చేసింది. 1-800-180-4343 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చునన్న విషయానికి సైతం తగినంత ప్రచారం కల్పించలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా ఆషామాషెగా తీసుకోవటం, ప్రతిసందర్భంలోనూ చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవటం కనిపిస్తూనే ఉంది. అక్కడ కూడా చాలా ప్రశ్నలకు నోడల్ ఆఫీసర్ ను సంప్రదించవలసిందిగా సమాధానం వస్తుందే తప్ప చందాదారుల హక్కులకు హామీ ఇచ్చే విధంగా సలహాలు మాత్రం ఇవ్వరు.

 

సెట్ టాప్ బాక్సులు సరిపోతాయా?

 

మూడోదశ డిజిటైజేషన్ కోసం అవసరమయ్యే సెట్ టాప్ బాక్సుల సంఖ్యకు, ప్రస్తుతం దిగుమతి అయిన, ఆర్డర్ ఇచ్చిన సెట్ టాప్ బాక్సుల సంఖ్యకూ పొంతనలేదు. కొంతమంది పెద్ద ఎమ్మెస్వోలు నాలుగో దశ కోసం తెప్పిమ్చి పెట్టుకున్న బాక్సులను సైతం ప్రభుత్వం మూడో దశకిందే లెక్కవేసి బాక్సులు సరిపొతాయనే తప్పుడు అంచనాతో ఉంది. అదే సమయంలో నాలుగో దశ గ్రామాల్లో పెట్టిన బాక్సులను సైతం మూడో దశ కిందనే చూపిస్తూ మరికొందరు ఎమ్మెస్వోలు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సరైన లెక్కలు లేని ప్రభుత్వం అంతా సజావుగా ఉన్నదనే భ్రమలో ఉండిపోయింది. అదే భ్రమ కారణంగా మూడో దశ గడువు పెంచాల్సిన అవసరమే లేదంటూ వాదిస్తున్నది. కేబుల్ కనెక్షన్లు ఉన్న ఇళ్ళ సంఖ్య విషయంలో కచ్చితమైన లెక్కలు లేకపోవటంతో ప్రభుత్వ అంచనాలన్నీ తప్పుతున్నాయి. మొదటి రెండు దశల్లోనే ఈ సంగతి స్పష్టంగా తేలిపోయింది. పైగా, ఆ రెండు దశలకంటే మూడో దశలోను, అంతకంటే ఇంకా ఎక్కువగా నాలుగోదశలోనూ నమోదు కాని కనెక్షన్లు పెద్ద సంఖ్యలో బైటపడతాయన్న కనీస అవగాహన కూడా ప్రభుత్వానికి లోపించింది.

బాక్సుల ఏర్పాటుమీద చివర్లో హడావిడి

సెట్ టాప్ బాక్సులు అమర్చే పని వేగం పుంజుకున్నదని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయా? లేవు. కేవలం కొన్ని సెట్ టాప్ బాక్స్ తయారీ సంస్థలు చెబుతున్న లెక్కలు తప్ప మరేమీ లేవు. ఎమ్మెస్వోలు దిగుమతి కోసం ఇచ్చిన ఆర్డర్ల లెక్కలు తప్ప క్షేత్ర స్థాయిలో ఎన్ని బాక్సులు అమర్చారో లెక్క తెలియదు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పుకునే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కేవలం కొంతమంది కార్పొరేట్ ఎమ్మెస్వోలు చెప్పే లెక్కల ఆధారంగా పరిస్థితి అంతా సజావుగానే ఉన్నట్టు భావిస్తూ, అదే విషయాన్ని పదే పదే వల్లె వేస్తూ వస్తోంది. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో మాత్రం పట్టించుకోవటం లేదు. డిసెంబర్ లో మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ జయ చేసిన ప్రకటన కూడా అదే హడావిడికి అద్దం పట్టింది. మూడో దశ డిజిటైజేషన్ గడువు పూర్తి కావస్తున్నది కాబట్టి నెలాఖరులోగా సెట్ టాప్ బాక్సులు అమర్చటం వేగం పుంజుకుంటుందన్నది ఆమె నమ్మకం.

 

ఎమ్మెస్వోలు ఎంతమంది ఎన్ని సెట్ టాప్ బాక్సులు అమర్చారు, అక్కడ ఉన్న మొత్తం కనెక్షన్లు ఎన్ని, ఎంతశాతం డిజిటైజేషన్ పూర్తయింది లాంటి సమాచారం సేకరించటానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఏర్పాటూ లేదు. తీరా డిసెంబర్ వచ్చిన తరువాత అప్పుడ్ ఎమ్ ఐ ఎస్ ఏర్పాటృ చేసుకున్నారు. ఎమ్మెస్వోలు తమ వివరాలను అందులో నింపమన్నారు. ఆ విధంగా ఎన్ని సెట్ టాప్ బాక్సులు అమర్చబడ్డాయో తెలుసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. నిజానికి ఈ పని కనీసం ఆరు నెలలముందు జరిగి ఉంటే, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించటానికి వీలు కలిగేది. అసలు కనెక్షన్ల సంఖ్య విషయమే ప్రభుత్వానికి తెలియనప్పుడు ఎంత శాతం ఇంకా మిగిలిపోయి ఉందో తెలిసే అవకాశమే లేదు. కేవలం 2011 జనాభా లెక్కల ఆధారంగా అంచనాలు వేసుకోవటం తప్ప మరో మార్గం లేదు. అందుకే ప్రభుత్వానికి అంతా సజావుగా జరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు డిక్లేర్ చేసిన కనెక్టివిటీ ఆధారంగా ప్రభుత్వ అంచనాలు ఉండే పక్షంలో సగం కూడా లక్ష్యం నెరవేరదనే సంగతి గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ ఆశావహ దృక్పథం సంగతలా ఉంచితే, క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి చూసినా మూడో దశ పట్టణాలలో సెట్ టాప్ బాక్సుల ఏర్పాటు 50 శాతానికి మించే అవకాశాలు లేవు. అయినా సరే, డిసెంబర్ చివరికల్లా పూర్తవుతుందని ప్రభుత్వం ప్రకటిస్తూ రావటం కేవలం అత్యాశే.

 

అవగాహన కల్పించటంలోనూ అంతంతమాత్రమే

డిజిటైజేషన్ కు అనుకూలంగా కేబుల్ టీవీ చట్టాన్ని సవరించినప్పటినుంచీ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) అనేకమార్లు నియమనిబంధనలు రూపొందించాల్సి వచ్చింది. రాబోయే సమస్యలను ముందుగా ఊహించలేకపోవటం వలన ఇలా అడుగడుగునా కొత్త నిబంధనలు తయారుచేయాల్సి వచ్చింది. అనేక సందర్భాలలో వ్యవహారం టిడిశాట్ వరకూ వెళ్లాల్సి వచ్చింది. టారిఫ్ విషయంలోనూ అదే జరిగింది. ఈ పరిస్థితికి కారణం ట్రాయ్ కి చాలా విషయాలమీద క్షేత్ర స్థాయి అనుభవాలు తెలియకపోవటం. అదే సమయంలో డిజిటైజేషన్ లో భాగస్వాములైన ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు, సమాన్య ప్రజలకు డిజిటైజేషన్ మీద అవగాహన కల్పించలేకపోవటం మరో కారణం. ఒక చట్టాన్ని బలవంతంగా ప్రజలమీద రుద్దుతున్నట్టు, బలవంతంగా సెట్ టాప్ బాక్సుల భారాన్ని ప్రజలమీద మోపుతున్నట్టుగానే ప్రజలు ఈ డిజిటైజేషన్ ను భావిస్తున్నారంటే అందుకు కారణం ప్రభుత్వం సరైన అవగాహన కల్పించకపోవటమే.

 

ఫిక్కీ, అసోచామ్ లాంట్ సంస్థలు ఈ అవగాహనా కార్యక్రమాలు చేపడతామని ఎప్పటికప్పుడు టాస్క్ హోర్స్ సమావేశాల్లో చెప్పటమే తప్ప ఆచరణలో అలాంటిదేమీ జరగలేదు. కేవలం కొన్ని నగరాలలో ఎమ్మెస్వోలతో జరిపే సమావేశాలలో తూతూమంత్రంగా జరిపిన కార్యక్రమాల వలన అవగాహన పెరిగిందనుకోవటం దారుణం. ఇక చానల్స్ స్వయంగా ప్రకటనల ద్వారా అవగాహన పెంచాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కోరింది. జాతీయ స్థాయిలో చానల్స్ ప్రచార ప్రకటనలు రూపొందించాయి. డబ్బింగ్ కి అలవాటుపడిన ప్రాంతీయ చానల్స్ అదే ప్రకటనను ప్రసారం చేస్తున్నాయి తప్ప స్థానిక భాషలో ప్రకటన రూపొందించటానికి కూడా డబ్బు వెచ్చించటానికి ఇష్టపడటం లేదు. నిజానికి డిజిటైజేషన్ వలన అత్యధికంగా లబ్ధిపొందేది పే చానల్స్ మాత్రమే. ఏ మాత్రం ఖర్చ్ పెట్టకుండా లబ్ధిపొందుతున్నాయి. అయినా సరే, ప్రచారానికి కృషి చేయమని చెప్పిన ప్రభుత్వం వీళ్ళనుంచి ఆశించిన స్పందన చూడలేకపోయింది.

 

చందాదారుల బెదరింపు ఒక్కటే మార్గమా?

 

ఏదో విధంగా చందాదారులను బెదరించి సెట్ టాప్ బాక్స్ కొనిపించాలన్న ఆలోచన తప్ప డిజిటైజేషన్ సాఫీగా సాగటానికి చట్టబద్ధంగా వ్యవహరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి రావటం లేదు. మూడో దశ అమలు జరుగుతున్నప్పుడు నాలుగోదశ ప్రాంతాల్లో ఉన్న చందాదారుల ప్రయోజనాలు కాపాడాలనుకోకపోవటం దురదృష్టకరం. అసలు దశలవారీగా డిజిటైజేషన్ చేపట్టటంలోని ఆంతర్యం కూడా ఒక్కసారిగా ఆచరణ సాధ్యం కాదని తెలియటం వల్లనే. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అందుకు భిన్నంగా ఉంది. డబ్బు ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన ఎమ్మెస్వోలు పెద్ద సంఖ్యలో సెట్ టాప్ బాక్సులు కొనుగోలు చేసి ఏదో విధంగా అంటగట్టటానికో, కొంత సబ్సిడీ ఇచ్చి నచ్చ జెప్పటానికో ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా నాలుగో దశ గ్రామాల్లో కూడా చాలా చోట్ల సెట్ టాప్ బాక్సులు పెట్టుకున్నారు. అదే సమయంలో మూడో దశకు ఇంకా 50 శాతం బాక్సులు అవసరమున్నాయి. దీంతో వ్యవహారం మరింత గందరగోళంగా తయారైంది.

నాలుగో దశ చందాదారులు ముందుగానే సెట్ టాప్ బాక్సులు పెట్టుకోవటం స్వాగతించదగ్గ పరిణామమే కావచ్చుగాని అది మూడో దశ పూర్తి కావటానికి అడ్డంకిగా మారటం మాత్రం ప్రభుత్వం దృష్టికి రాకపోవటమే చిత్రంగా ఉంది. ఎమ్మెస్వోలు చెబుతున్న లెక్కలకూ, ప్రభుత్వ అంచనాలకూ పొంతనలేకపోవటానికి కారణం అదే. ఎమ్మెస్వో పెట్టిన సెట్ టాప్ బాక్సులలో ఎన్ని మూడో దశ పట్టణానికి సంబంధించినవో, ఎన్ని నాలుగో దశకు చెందినవో స్పష్టంగా చెప్పటం లేదు. పట్టణంలో సగం బకాయిలు ఉండిపోగా చుట్టుపక్కల గ్రామాల్లో పెట్టిన బాక్సుల సంఖ్య కూడా తెలియజేయటం ద్వారా దాదాపు 80 శాతం పూర్తయిందన్న అభిప్రాయం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు కలుగజేయటం ఈ గందరగోళానికి మరోకారణం. ఈ లెక్కల ఆధారంగానే ప్రభుత్వం అంతా సజావుగా సాగుతున్నట్టు చెప్పుకుంటూ వస్తోంది. అందుకే గడువు తేదీ పొడిగించే ప్రసక్తే లేదంటూ పదే పదే ప్రకటనలు జారీ చేస్తూ వస్తోంది.

నాలుగో దశ డిజిటైజేషన్ కిందికి వచ్చే గ్రామాల్లో కూడా సెట్ టాప్ బాక్సులు పెట్టుకునేలా కొంతమంది ఎమ్మెస్వోలు బెదరిస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖయ్మైన పే చానల్స్ కొన్నిటిని తప్పించి అనలాగ్ ఫీడ్ ఇస్తూ సెట్ టాప్ బాక్స్ పెట్టుకుంటూనే ఆ చానల్స్ కూడా వస్తాయంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారనేది ఆ ఫిర్యాదుల సారాంశం. క్షేత్ర స్థాయిలో చూస్తే పట్టణాల్లోని ఎమ్మెస్వోలు మూడొ దశ పట్టణమైతే అక్కడ డిజితల్ సిగ్నల్ ఇస్తూ, తన పరిధిలో ఉన్న చిన్న గ్రామాలకు అనలాగ్ సిగ్నల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద తలనొప్పి అనుకునేవారు ఇలా బెదరింపుల ద్వారా అందరినీ ఇప్పటికిప్పుడు డిజిటైజేషన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ సమస్యను ప్రభుత్వం ముందుగా ఊహించలేకపోవటానికి కారణం క్షేత్రస్థాయి సమస్యలమీద అవగాహన లేకపోవటం. ఈ అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సలహా ఇచ్చిన ట్రాయ్ కూడా అంతంతమాత్రంగానే అధ్యయనం చేసింది తప్ప ఆచరణలో ఎదురయ్యే సమస్యలమీద దృష్టిపెట్టలేదు. కారణమేంటంటే, కార్పొరేట్ ఎమ్మెస్వోలను మాత్రమే ఎమ్మెస్వోలుగా పరిగణిస్తూ వారి అభిప్రాయాలకే పెద్దపీట వేయటం. డిజిటైజేషన్ ను సక్రమంగా అమలు చేసే ఉద్దేశం ఉన్నప్పుడు మూడో దశ పట్టణాలతో బాటు వాటికి అనుబంధంగా అనేక గ్రామీణప్రాంతాలుంటాయన్న విషయాన్ని ముందుగానే అంచనా వేయగలగాలి. మూడు, నాలుగు దశలను కలిపి ఒకే దశ కింద అమలు చేస్తే ఈ సమస్య తలెత్తేది కాదు. అప్పుడు కూడా పరిస్థితిని మొదటినుంచీ సమీక్షిస్తూ ఉంటే సాఫీగా డిజిటైజేషన్ పూర్తి కావటానికి వీలుండేది. అదే సమయంలో సెట్ తాప్ బాక్సుల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉండదు. ఒకవైపు స్వదేశీ సెట్ టాప్ బాక్సుల తయారీని ప్రోత్సహిస్తున్నామంటూ మరోవైపు ఆచరణ సాధ్యం కాని గడువు తేదీలు ప్రకటిస్తూ ఉంటే దిగుమతులు ఎలా తగ్గుతాయో ప్రభుత్వానికే తెలియాలి.