• Home »
  • Cable »
  • తెలంగాణ ఎమ్మెస్వోల వెలుగుబాట “ బ్రైట్ వే ”- సహకార మార్గంలో సరికొత్త ప్రయోగం

తెలంగాణ ఎమ్మెస్వోల వెలుగుబాట “ బ్రైట్ వే ”- సహకార మార్గంలో సరికొత్త ప్రయోగం

కేబుల్ టీవీ డిజిటైజేషన్ అత్యంత కీలకమైన దశకు చేరుకున్న తరుణంలో కార్పొరేట్ ఎమ్మెస్వోలు కేబుల్ ఆపరేటర్లు, చిన్న ఎమ్మెస్వోల జీవనాధారాన్ని గద్దల్లా ఎగరేసుకు పోవటానికి సిద్ధమయ్యారు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టలేని ఎమ్మెస్వోలు ఇన్నాళ్ళూ కష్టపడి పెంచుకుంటూ వచ్చిన వ్యాపారాన్ని నిలబెట్టుకోలేమనఏ దిగులుతో సతమతమవుతున్నప్పుడు అ కారుచీకట్లో కాంతి రేఖలా వెలుగుబాట చూపుతూ బ్రైట్ వే కమ్యూనికేషన్స్ ముందుకొచ్చింది. తాత్కాలికంగా పెట్టుబడి పెట్టటానికి వెసుకుబాటు ఉన్న కొంతమంది ఎమ్మెస్వోలు ఆ బాధ్యత తీసుకున్నారు. మిగిలిన ఎమ్మెస్వోలు కూడా కార్పొరేట్ జిమ్మిక్కులకు నష్టపోకుండా ఉండాలని ఈ సరికొత్త సహకార విధానానికి శ్రీకారం చుట్టారు. ముందుగా తాము కూడా ఆ కంపెనీలో భాగస్వాములు కావటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వతంత్ర ఎమ్మెస్వోలలో నమ్మకం కలిగించి వారి విశ్వాసాన్ని చూరగొన్నారు.

డిజిటైజేషన్ ప్రారంభం కాగానే ట్రాయ్ నిబంధనలు కేబుల్ పరిశ్రమను భయపెట్టాయి. అందుకు కారణం ఆ నిబంధనలన్నీ కార్పొరేట్ ఎమ్మెస్వోలకు మేలు చేయటానికేనన్నట్టు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక శాటిలైట్ చానల్ లైసెన్స్ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు పది వేల రూపాయలుంటే, డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫెజు లక్ష రూపాయలుగా నిర్ణయించారు. ఇక్కడ మొదలైన హడావిడి డిజిటల్ హెడ్ ఎండ్ ఎలా ఉండాలో చెప్పటంతో మరింత గందరగోళానికి దారితీసింది. ఒక మోస్తరు డిజితల్ హెడ్ ఎండ్ పెట్టాలన్నా కనీసం రెండు కోట్లు ఖర్చవుతుందని , మరింత నాణ్యమైనది కావాలంటే మూడు నుంచి నాలుగు కోట్లు అవసరమని మార్కెట్లో వార్తలు మొదలయ్యాయి. ఇంకో వపు సెట్ టాప్ బాక్సుల కొనుగోలు భారం. మళ్ళీ చందాదారుడికి అమ్మేవే అయినా, పెద్ద మొత్తంలో కొంటేనే డిస్కౌంట్ ధరలకు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో బాక్స్ ధర స్టాండర్డ్ డెఫినిషన్ అయితే 1500, హై డెఫినిషన్ అయితే 2000 అంటూ ప్రచారం మొదలైంది.

ఇదే అదనుగా తీసుకొని కార్పొరేట్ ఎమ్మెస్వోలు విజృంభించారు. వివిధ మార్గాల్లో మరింత పెట్టుబడులు సేకరించుకోవటం ప్రారంభించారు. నెట్ వర్క్ ల కొనుగోళ్ళకు, తమ పరిధిలోకి తెచ్చుకోవటానికి శ్రీకారం చుట్టారు. మొదటి రెండు దశల్లోనూ సాగిన ఈ ధోరణి చూసిన తరువాత స్వతంత్ర ఎమ్మెస్వోల భయాలు మరింత పెరిగాయి. కష్టపడివ్యపారాన్ని అభివృద్ధి చేసుకొని ఇన్నాళ్ళూ  కాపాడుకుంటూ వచ్చాక ఇప్పుడు పెట్టుబడికి భయపడి ఉన్న ఆధారాన్ని కోల్పోతామనే భయాలు చుట్టుముట్టాయి.

కార్పొరేట్ ఎమ్మెస్వోల దూకుడుకు కళ్ళెం

ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఎమ్మెస్వోల దూకుడుకు కళ్ళెం పడేలా స్వతంత్ర ఎమ్మెస్వోలలో  ఆత్మవిశ్వాసం నింపి ముందుకు సాగాలని తెలంగాణ ఎమ్మెస్వోలు నిర్ణయించుకున్నారు. సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి చొరవ తీసుకున్నారు. ముందుగా కొంత పెట్టుబడి పెట్టి వ్యవస్థను ముందుకు నడిపించగల మరికొంతమంది ఎమ్మెస్వోలను సమీకరించుకొని పథక రచన చేశారు. ఏ ఒక్క ఎమ్మెస్వో ఆధ్వర్యంలోనో డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టటం కాకుండా ఒక కంపెనీ ఆధ్వర్యంలో నడిచేలా అందరూ ఆ కంపెనీ కింద కార్యకలాపాలు జరుపుకునేలా ఉండాలనే నిర్ణయానికొచ్చారు. ముల్లును ముల్లుతోనే తీయాలని, కార్పొరేట్ ఎమ్న్మెస్వోలను అదే కార్పొరేట్ విధానంలో ఎదుర్కోవాలని తీర్మానించారు. ఆ విధంగా బ్రైట్ వే కమ్యూనికేషన్స్ రూపుదిద్దుకుంది. డిజిటల్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవటం, హోం మంత్రిత్వశాఖ నుంచి క్లియరెన్స్ రావటంతో పదేళ్ళపాటు నడుపుకునేలా శాశ్వత ప్రాతిపదికన లైసెన్స్ మంజూరవటం జరిగిపోయాయి. సుభాష్ రెడ్డి స్వయంగా ఈ విషయంలో చొరవ తీసుకొని జాతీయ స్థాయిలో చాలా మంది ఎమ్మెస్వోల కంటే ముందుగా జూన్ 11 నాటికి లైసెన్స్ తీసుకురాగలిగారు.

కలిసి వచ్చే ఎమ్మెస్వోలంతా భాగస్వాములే

పెట్టుబడి సమీకరించాలన్న ఆలోచన వచ్చినప్పుడు కొంతమంది కలిసి మూలధనం సమకూరచాలని నిర్ణయించారు. అయితే, ఈ ఆలోచనతో ముందుకొచ్చిన తొలి ఇన్వెస్టర్లు మాత్రమే ఇందులో భాగస్వాములు కాదు. ఏ ఎమ్మెస్వో అయినా ఇందులో చేరిపోయి తన సంస్థలో 30 శాతం వాటాను కంపెనీకి ఇస్తూ 70 శాతం వాటా తానే అనుభవింవచవచ్చు. డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుబడి భారాన్నుంచి ఈ పద్ధతిలో సునాయాసంగా తప్పించుకోవచ్చు. అదే సమయంలో కాస్, ఎస్ ఎమ్ ఎస్ లాంటి నిర్వహణ బాధ్యత కూడా ఈ కంపెనీ స్వయంగా చూసుకుంటుంది. కంపెనీలో ఎలాగూ తన వాటా ఉండనే ఉంటుంది. సెట్ టాప్ బాక్సులకు పెట్టుబడి పెట్టే అవసరం లేకుండా చిన్న మొత్తాల్లో కంపెనీ నుంచి తీసుకొని వాటిని అమ్మిన తరువాత మళ్ళీ తీసుకునే సౌకర్యం, వెసులుబాటు ఉంటాయి. హైదరాబాద్ లో ఉన్న డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి బ్రాడ్ బాండ్ సాయంతో నేరుగా తన కంట్రోల్ రూమ్ కే ప్రసారాలు అందుతాయి. మొత్తంగా చూస్తే, తెలంగాణ ఎమ్మెస్వోలు తమ్న అస్తిత్వాన్ని, స్వేచ్ఛా స్వాతంత్రాలనూ కోల్పోకుండా, వ్యాపారం దెబ్బతినకుండా చూసుకోవటానికి ఒక సరైన వేదిక బ్రైట్ వే రూపంలో అందుబాటులోకి వచ్చింది.

కనెక్షన్ల నిష్పత్తిలో వాటాలు

కంపెనీలో వాటాలు ఎక్కువ, తక్కువ అని కాకుండా ఆయా ఎమ్మెస్వోల ఆధ్వర్యంలో ఉండే కనెక్షన్ల ఆధారంగా ఇవ్వాలని నిర్ణయించారు. నిజానికి ఇది చాలా న్యాయమైన పంపిణీ విధానం. మొదట్లో పెట్టుబడి పెట్టినవారు అందరి మంచిని ఆలోచించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి పెట్టినా, కంపెనీ తరఫున ఆ డబ్బు కూడా తిరిగి చెల్లించి వారి కనెక్షన్ల ఆధారంగానే వాటాలు ఇవ్వటం జరుగుతుంది. క్రమంగా కంపెనీ తన అప్పులన్నిటినీ తీర్చే స్థాయికి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెస్వోలు తమకు తాముగా ఏర్పాటు చేసుకున్న ఒక సహకార సంఘం లాంటిది ఇది. అందుకే ఎవరూ నష్టపోతున్నామనే భావన కలిగే అవకాశం లేదు.

డిజిటల్ హెడ్ ఎండ్ ఖర్చు కంపెనీ బాధ్యత

అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా రూపుదిద్దుకుంటున్న డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి సుదూర ప్రాంతాలకు సైతం నాణ్యమైన ప్రసారాలు అందించగలుగుతుంది. ఎరిక్ సన్ సంస్థ సమకూర్చిన సాంకేతిక పరిజ్ఞానంతో జీడిమెట్లలో ఈ హెడ్ ఎండ్ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం బెసిల్ జరిపే ఆడిట్ లో సునాయాసంగా నాణ్యమైనదనే ముద్ర వేయించుకోవాలన్న లక్ష్యంతోనే దాదాపు నాలుగుకోట్ల రూపాయలవరకూ వెచ్చించి అత్యాధునికంగా ఈ హెడ్ ఎండ్ ను తీర్చిదిద్దుతున్నారు. ఎలాంటి సమస్యలకూ తావులేకుండా చూస్తున్నారు. అదే సమయంలో సాంకేతిక నిపుణులకు కొరత రాకుండా నెలరోజులపాటు ప్రత్యేకశిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించటానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ స్థాయి  కార్పొరేట్ ఎమ్మెస్వోలకు ఏ మాత్రమూ తగ్గకుండా స్థానికంగా అన్నివిధాల అత్యంత నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించటమే ధ్యేయంగా ఈ హెడ్ ఎండ్ ను తీర్చిదిద్దుతున్నారు.

 

నిర్వహణ కూడా కంపెనీ ఆధ్వర్యంలోనే

మొత్తం నిర్వహణ బాధ్యతనంతా కంపెనీ చేపడుతుంది. కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ( కాస్ ), సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( ఎస్ ఎమ్ ఎస్ ) తో బాటు రేయింబవళ్ళూ పనిచేసేలా కాల్ సెంటర్ నిర్వహణ బాధ్యతలు కూడా కంపెనీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. దీనివలన ప్రతి చిన్న ఎమ్మెస్వో ఈ సౌకర్యాల కోసం ఖర్చు చేయాల్సిన అవసరముండదు. అదే సమయంలో సెట్ టాప్ బాక్సుల మరమ్మతులకు కూడా సంస్థ తగిన ఏర్పాట్లు  చేస్తుంది. ఏ చిన్నపాటి సమస్య వచ్చినా పరిష్కరించటానికి సంస్థ అందుబాటులో ఉండటం వలన అందరూ భాగస్వాములుగా ఉంటూ వ్యాపారాభివృద్ధి చేసుకోగలుగుతారు. కార్పొరేట్ ఎమ్మెస్వోల గుప్పిట్లోకి వెళితే కేవలం కలెక్షన్ ఏజెంట్ గా మాత్రమే స్వతంత్ర ఎమ్మెస్వోలు మిగిలిపోతారు. కానీ ఈ విధమైన సహకార సంఘంలాంటి వ్యవస్థలో మాత్రం పంపిణీదారునిగా ఉండే అవకాశం ఉండటమే ప్రధానంగా బ్రైట్ వే రూపు దిద్దిన పథకంలో చాలా కీలకమైన అంశం. హైదరాబాద్ లోని డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి బ్రాడ్ బాండ్ ద్వారా ప్రసారాలు అందుతాయి. పే చానల్స్ తో బేరమాడి ఒప్పందాలు కుదుర్చుకునే బాధ్యతను కూడా ఎమ్మెస్వోలందరి తరఫునా కంపెనీ చేపడుతుంది.

రెండు స్థానిక కేబుల్ చానల్స్ కూ అవకాశం

సాధారణంగా ఒక కేంద్రీకృత డిజిటల్ హెడ్ ఎండ్ నుంచి ఫీడ్ అందుతుందని అనగానే స్థానిక చానల్స్ ప్రసారం చేసుకునే అవకాశం ఉండదేమోనని ఆందోళన చెందుతారు. కానీ బ్రైట్ వే ఆ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి ఎమ్మెస్వో తన కంట్రోల్ రూమ్ దగ్గర తన సొంత కేబుల్ చానల్స్ రెండింటిని జోడించవచ్చు. అందువలన స్థానికంగా పట్టుకోల్పోతామని గాని అదనపు ఆదాయ వనరు ఉండదనిగాని భయపడాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ ఎమ్మెస్వోలు వాళ్ళు ఇచ్చే చానల్స్ ను పంపిణీ చేయాల్సిందిగా చెప్పటం మీదనే దృష్టి సారిస్తారు. పెద్ద సంఖ్యలో కంపెనీలో చేరటం వలన సంస్థ బలోపేతమై బేరమాడే శక్తిని పెంచుతుంది కాబట్టి అనేక ప్రయోజనాలుంటాయి. క్యారేజ్ ఫీజులు బేరమాడటంలోనూ, పే చానల్స్ తో బేరమాడటంలోనూ ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఉమ్మడిగా ఉండటం వలన ఆ ఫలితాలను కూడా అందరూ పంచుకునే వీలుంటుంది.

మొత్తంగా చూస్తే ఎమ్మెస్వోల ప్రయోజనాలే లక్ష్యంగా కేబుల్ పరిశ్రమను కాపాడుకుంటూ కార్పొరేట్ ఎమ్మెస్వోలను సవాలు చేసే విధంగా తెలంగాణ ఎమ్మెస్వోల కోసం బ్రైట్ వే ఈ తరహా ప్రత్యేకమైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అందుకే దీని విజయం తెలంగాణ ఎమ్మెస్వోల చేతుల్లోనే ఉంది. ఎమ్మెస్వోల విజయం ఈ కంపెనీ ఏర్పాటులోనే రుజువైంది. ఉమ్మడి విజయం చరిత్ర సృష్టించటానికి సిద్ధంగా ఉంది.