• Home »
  • News »
  • TV18 నుంచి 3 ప్రాంతీయ న్యూస్ చానల్స్ ప్రస్తుతానికి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి

TV18 నుంచి 3 ప్రాంతీయ న్యూస్ చానల్స్ ప్రస్తుతానికి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి

టీవీ 18 బ్రాడ్ కాస్ట్ ఆధ్వర్యంలోని ఈటీవీ న్యూస్ నెట్ వర్క్ కొద్దిరోజుల్లోనే 3 ప్రాంతీయ న్యూస్ చానల్స్ ప్రారంభించబోతోంది. ఈ మూడు చానల్స్ ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న  తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలలో కావటం ఒక ప్రత్యేకత అయితే, ఈటీవీ బ్రాండ్ కాకుండా టీవీ 18 సంస్థ తన సొంత బ్రాండ్ వాడుకుంటూ న్యూస్18 తమిళనాడు, న్యూస్ 18 కేరళ, న్యూస్ 18 అస్సాం పేర్లతో ప్రారంభించాలనుకోవటం మరో ప్రత్యేకత.

ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభమవుతాయని భావిస్తున్న ఈ మూడు చానల్స్ ప్రస్తుతానికి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తాయని తెలుస్తోంది.  ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే వీటిని ప్రారంభించటం ద్వారా సులభంగా ప్రజల్లోకి వెళ్ళవచ్చునన్నది యాజమాన్యం వ్యూహంగా కనిపిస్తోంది. ఎన్నికల తరువాత సొంత స్టుడియోలలోకి మారాలని భావిస్తున్నట్టు ఈటీవీ న్యూస్ నెట్ వర్క్ అధిపతి జగదీశ్ చంద్ర చెబుతున్నారు.

నిజానికి తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో బాగా పాతుకు పోయిన న్యూస్ చానల్స్ ఉండగా ఆ మార్కెట్లలో ప్రవేశించటానికి టీవీ 18 సంస్థ నిర్ణయించుకోవటం సాహసమనే చెప్పాలి. గతంలో పది న్యూస్ చానల్స్ నడిపినప్పటికీ ఈటీవీ అలాంటి సాహసం చేయలేకపోయింది. తమిళనాడులో సన్ టీవీ బలం, అక్కడ ఎమ్మెస్వోగా సుమంగళి కేబుల్ విజన్ గుత్తాధిపత్యం లాంటి కారణాలు ఈటీవీ వెనుకంజ వేసేట్టు చేశాయి. అదే విధంగా కేరళలోనూ ఏషియానెట్ బలంతోబాటు అక్కడి ఎమ్మెస్వోగా కూడా ఏషియానెట్ గుత్తాధిపత్యం ఈటీవీ ని రాకుండా పరోక్షంగా అడ్డుకున్నాయి.

ఇంకా ఆ తరువాత కాలంలోనూ ఎన్నో న్యూస్ చానల్స్ వచ్చాయి. తమిళనాడులో పేరుమోసిన విద్యా సంస్థ ఎస్ ఆర్ ఎం గ్రూప్ ఆధ్వర్యంలో వచ్చిన పుదియ తలైమురై, నెంబర్ వన్ తమిళ పత్రికగా పేరుతెచ్చుకున్న దినతంతి ఆధ్వర్యంలో వచ్చిన  తంతి టీవీ బలమైన చానల్స్ గా నిలదొక్కుకున్నాయి. మలయాళంలో ఏషియానెట్ కు తోడు మనోరమ, మాతృభూమి సంస్థల న్యూస్ చానల్స్ కూడా ప్రజాదరణ పొందాయి.

రాజకీయ పార్టీలకు అనుబంధంగా వ్యవహరించే చానల్స్ కూడా తక్కువేం కాదు. తమిళంలో సన్ న్యూస్, కలైంజ్ఞర్ న్యూస్ (డిఎంకె) జయా న్యూస్ (అన్నా డిఎంకె) , మెగా టీవీ (కాంగ్రెస్),  కెప్టెన్ టీవీ ( విజయకాంత్), లోటస్ టీవీ (బిజెపి), మక్కళ్ టీవీ (పిఎంకె) ఉన్నాయి. మలయాళంలో జైహింద్ (కాంగ్రెస్), కైరలి ( సిపిఎం) ఉన్నాయి. అస్సాం లో ఐదు న్యూస్ చానల్స్ మాత్రమే ఉన్నాయి.

టీవీ 18 సంస్థ ఈటీవీ న్యూస్ నెట్ వర్క్ ను కొనుగోలు చేసి అదే బ్రాండ్ తో 10 ప్రాంతీయ న్యూస్ చానల్స్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈటీవీ ఉత్తరప్రదేశ్, ఈటీవీ మధ్యప్రదేశ్, ఈటీవీ బీహార్, ఈటీవీ రాజస్థాన్, ఈటీవీ న్యూస్ బంగ్లా, ఈటీవీ న్యూస్ కన్నడ, ఈటీవీ న్యూస్ గుజరాతి, ఈటీవీ న్యూస్ ఒడియా, ఈటీవీ న్యూస్ హర్యానా ఉన్నాయి.

న్యూస్18 తమిళనాడు కోసం సన్ న్యూస్ చీఫ్ ఎడిటర్ గా రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన రాజా ను ముందుగా సంప్రదించారు. అయితే, ఆయన ఆసక్తి కనబరచకపోవటంతో గుణశేఖరన్ ను నియమించారు. న్యూస్ 18 కేరళ కోసం ప్రమోద్ రాఘవన్ ను, న్యూస్ 18 అస్సాం కి ఎం. సైకియా ను నియమించారు. ఈ ఎన్నికల కవరేజ్ కి వీలుగా ఈ రాష్ట్రాలలో కొన్ని హోటళ్ళలోనే తాత్కాలిక సెట్లు వేసి నడపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి వార్తలందేలా రిపోర్టింగ్ నెట్ వర్క్ ను పటిష్టం చేస్తున్నట్టు నెట్ వర్క్ అధిపతి జగదీశ్ చెప్పారు.