19న కలర్స్ తమిళ్ ప్రారంభం

వయాకామ్18 వారి తమిళ ఎంటర్టైన్మెంట్ చానల్ కలర్స్ తమిళ్ ఈ నెల 19 న ప్రారంభమవుతోంది. కేబుల్, డిటిహెచ్ , హిట్స్, ఐపిటీవీ వేదికల ద్వారా ఈ చానల్ అందుబాటులో ఉంటుందనివయాకామ్ సంస్థ ప్రకటించింది. ఆరంభంలో వారానికి 22 గంటల ఒరిజినల్ కార్యక్రమాలుంటాయి. తమిళ సూపర్ స్టార్ ఆర్య దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

చెన్నై మహానగరంలో ఎస్ సి వి, టిసిసిఎల్ ద్వారా 35 లక్షల ఇళ్ళకు, తమిళనాడు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో తమిళనాడు అరసు కేబుల్ కార్పొరేషన్ ద్వారా కోటీ 10 లక్షల ఇళ్లకు చేరుకోవటానికి ఏర్పాట్లు జరిగాయి. అదే విధంగా సన్ డైరెక్ట్, ఎయిర్ టెల్, డిష్ టీవీ, వీడియోకాన్, టాటా స్కై డిటిహెచ్ వేదికల ద్వారా కూడా చానల్ అందుబాటులో ఉంటుంది.

ఇప్పటికే వయాకామ్ 18 ఆధ్వర్యంలోఐదు ప్రాంతీయ భాషల్లో చానల్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఒడియా, బెంగాలీ భాషల్లో కలర్స్ చానల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా హిందీ, ఇంగ్లీష్ చానల్స్ కూడా ఉన్నాయి. ఇలా ఏడు భాషల్లో వస్తరించిన తరువాత తమిళంలో ప్రవేశిస్తున్నామని, అక్కడ నెంబర్ టూ స్థానానికి చాలా ఖాళీ ఉందని వయాకామ్ 18 గ్రూప్ సీఈవో సుధాంశ్ వత్స్ వ్యాఖ్యానించారు.

దేశంలో జనాభా పరంగా ఆరో రాష్ట్రమే అయినప్పటికీ సగటున టీవీ చూసే సమయం తమిళనాడులో రోజుకు 3 గంటలుందని, హిందీ రాష్ట్రాలలో అది రెండున్నర గంట మాత్రమేనని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా తమిళనాడుకు చెందిన సన్ టీవీ అత్యధిక ప్రేక్షకాదరణ పొందటానికి అదే కారణమని కూడా వత్స్ అభిప్రాయపడ్డారు. తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

“ఇదు నమ్మ ఊరు కలరు” ( ఇది మన ఊరు కలరు) టాగ్ లైన్ తో వస్తున్న ఈ చానల్ ముందుగా ప్రేక్షకాభిరుచిని పసి గట్టిందని, వారు ఎలాంటి కార్యక్రమాలు కోరుకుంటారో, ఎలాంటివి ఇష్టపడతారో ఒక అంచనాకు వచ్చిన మీదటే కార్యక్రమాల రూపకల్పన జరిగిందని తమిళ్ బిజినెస్ హెడ్ అనుప్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. మొత్తం ప్రసారాలన్నీ వూట్ ద్వారా ఒటిటి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయన్నారు.