• Home »
  • Cable/DTH/HITS »
  • దివాలా వివాదంలో వీడియోకాన్ డి2హెచ్ : డిష్ టీవీ విలీనంలో ఆలస్యం తప్పదా?

దివాలా వివాదంలో వీడియోకాన్ డి2హెచ్ : డిష్ టీవీ విలీనంలో ఆలస్యం తప్పదా?

సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ నుంచి కూడా ఆమోదం లభించటంతో డిష్ టీవీ, వీడియోకాన్ డి2 హెచ్ విలీనం ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టేనని భావిస్తున్న సమయంలో వీడియోకాన్ డి2హెచ్ మీద ఉన్న దివాలా పిటిషన్ వార్తల్లోకొచ్చింది. దీనివలన విలీనం ఒప్పందం మీద ఏ మేరకు ప్రభావం ఉంటుందో చూడాలని డిష్ టీవీ ఆలోచనలో పడింది. ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి కచ్చితంగా ఆలస్యం జరుగుతుందని ఇరుపక్షాలూ ఒప్పుకుంటున్నాయి.

వీడియోకాన్ గ్రూప్ ప్రధాన ప్రమోటర్ అయిన ధూత్ కుటుంబానికి అనేక వ్యాపారాలున్నాయి. వారికి మొత్తం 29వేల కోట్ల మేరకు అప్పులున్నాయి.అయితే, ఈ మధ్యనే స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం వీడియో కాన్ ఇండస్ట్రీస్, వీడియో టెలికామ్ సహా 12 సంస్థలమీద దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభమయ్యాయి. అందులో వీడియో టెలికామ్ సంస్థ తన స్పెక్ట్రమ్ ను భారతీ ఎయిర్ టెల్ కు అమ్మేసిన తరువాత మూతబడింది.

ఇప్పుడు తాజాగా తలెత్తిన పరిణామం నేపథ్యంలో ఈ వ్యవహారం మీద అధ్యయనం చేసి 60 రోజుల్లోగా సిఫార్సులతో కూడిన  నివేదిక ఇవ్వాలని డిష్ టీవీ సంస్థ తన సలహాదారులను కోరింది. నిజానికి డిసెంబర్ 22 నుంచి విలీనం అమలు జరిగినట్టు పరిగణించాల్సిందిగా డిష్ టీవీ యాజమాన్యం  బొంబాయ్ స్టాక్ ఎక్స్ఛేంజి కి కూడా తెలియజేసింది. అయితే, ఆ తరువాతనే దివాలా చర్యల గురించి తెలిసిందని, అందువలన మరికొంత సమయం కావాలని తాజాగా లేఖ రాసింది.