• Home »
  • Entertainment »
  • 21 నుంచి విజయ్ టీవీ సూపర్ సింగర్: విజేతకు ఎ ఆర్ రెహమాన్ అవకాశం

21 నుంచి విజయ్ టీవీ సూపర్ సింగర్: విజేతకు ఎ ఆర్ రెహమాన్ అవకాశం

స్టార్ గ్రూప్ తమిళ చానల్ విజయ్ టీవీ తన సూపర్ సింగర్ కార్యక్రమం ఆరో సీజన్ కోసం ఎ ఆర్ రహమాన్ ను పిలవటంతో ఆ కార్యక్రమం మీద భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ నెల 21న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే  కార్యక్రమంలో తాను భాగస్వామి అవుతున్నట్టు రెహమాన్ స్వయంగా ప్రకటించటమే కాకుండా విజేతకు తన సంగీత సారధ్యంలో పాడే అవకాశం కల్పిస్తానని చెప్పటం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ విధంగా వెలువడిన ప్రచార ప్రకటన ఒక సంచలనం సృష్టించింది. మంచి గాయకునిగా గుర్తింపు పొందాలనుకునే ప్రతి ఒక్కరూ రెహమాన్ దగ్గర పాడాలని కలలు కంటారు. దాన్నొక జీవితకాలపు కోరికగా చెప్పుకుంటారు. అందుకే ఈ వేదికకు విపరీతమైన ప్రచారం వస్తోంది. బహుమతి మొత్తం కంటే లక్ష రెట్లు విలువైన అవకాశం కోసం గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్నారు.

ఈ సీజన్ న్యాయనిర్ణేతలలో బెన్నీ, శ్వేతా మోహన్, అనురాధాశ్రీరామ్, ఉన్ని కృష్ణన్ ఉంటారు. గతంలో జరిగిన ఐదు సీజన్లలో నిఖిల్ మాథ్యూ, అజీష్, సాయి చరణ, దివాకర్, ఆనంద్ అరవింద్ కృష్ణన్ విజేతలుగా నిలిచారు. ఇప్పటివరకు సూపర్ సింగర్ కార్యక్రమం ఐదు సీజన్లు పూర్తి చేసుకోగా ఇందులో పాల్గొన్న అనేకమందికి సినిమాల్లో అవకాశాలు వచ్చి అక్కడే స్థిరపడ్డారు.

15 ఏళ్లు పైబడిన వారికి అవకాశం కల్పిస్తూ తమిళనాడు రాష్ట్రం నలుమూలలా ఆడిషన్స్ పూర్తి చేశారు. ఆవిధంగా ఎంపిక చేసినవారికి ఈ పోటీలలో అవకాశం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయ్ టీవీ ఈ నెల 21 మొదలుకొని ప్రతి శని, ఆది వారాల్లో సాయంత్రం 7 గంటలకు ప్రసారం చేస్తుంది.