• Home »
  • Editors Voice »
  • కొత్త బడ్జెట్ మీద కొండంత ఆశ: టీవీ రంగం కోరుకుంటున్నదేమిటి?

కొత్త బడ్జెట్ మీద కొండంత ఆశ: టీవీ రంగం కోరుకుంటున్నదేమిటి?

రకరకాల పన్నులు చెల్లించటమే తప్ప ఎలాంటి ప్రభుత్వ సహాయమూ లేకుండా ఎదిగిన టీవీ పరిశ్రమ ఈ బడ్జెట్ లోనైనా ప్రభుత్వం కరుణిస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తోంది. బ్రాడ్ కాస్ట్, కేబుల్ డిటిహెచ్ రంగాలు ఈ పరిశ్రమకు మౌలిక వసతుల విభాగం కింద పరిశ్రమగా గుర్తించాలని ఎంతో కాలంగా కోరుకుంటున్నాయి. అలాంటి గుర్తింపు ఇవ్వటం ద్వారా మాత్రమే ప్రభుత్వ రాయితీలతోబాటు తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు కూడా లభించే అవకాశం కలుగుతుంది. అందుకే బ్రాడ్ కాస్టర్ల సంఘం ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ( ఐబిఎఫ్ ) కేంద్రప్రభుత్వానికి ఈ మేరకు ఒక వినతి పత్రం కూడా అందజేసింది.

నిజానికి చాలా కాలంగా ఈ డిమాండ్ వినిపిస్తున్నదే అయినా, ప్రభుత్వం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తూ వస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( ఫిక్కీ ) లో  ఎంటర్టైన్మెంట్ విభాగానికి ప్రాతినిధ్యం వహించే వారు కూడా ఇదే విజ్ఞప్తి చేశారు. డిజిటైజేషన్ వలన పెద్ద ఎత్తున లాభం పొందబోవటం, గతంలో లాగా పరిశ్రమకు సంబంధించిన సమాచారం లేకపోవటమనే సమస్య కనుమరుగవటం ప్రభుత్వాన్ని ఆలోచింపజేయవచ్చునని భావిస్తున్నారు. అందుకే ఈ సారి బడ్జెట్ మీద టీవీ రంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది.

మొదటి మూడు దశల డిజిటైజేషన్ కంటే అత్యంత కీలకమైన నాలుగోదశలో కోట్లాది సెట్ టాప్ బాక్సులు పెట్టాల్సి ఉండటం, మిగిలిన దశలకంటే ఈ దశలోనే గ్రామీణ ప్రాంత ప్రజలుండటం వలన ఎక్కువ సబ్సిడీ ఇవ్వాల్సి ఉండటం  కారణంగా ప్రభుత్వం నుంచి తగిన సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ భారీ పెట్టుబడుల అవసరం వలన అనేక సంస్థల విలీనాలు తప్పని సరి అయ్యే అవకాశం ఉంది. అందుకే పేరుకుపోయిన నష్టాలను కొట్టివేసేందుకు, వాడుకోని తరుగుదల అలవెన్స్ ను భవిష్యత్ కాలానికి తీసుకుపోయేందుకు అనుమతించాలని కోరుతున్నారు. ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 72ఎ కింద ఈ వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అదే విధంగా ఆదాయం పన్ను చట్టంలోని  సెక్షన్ 80- 1ఎ కింద పన్ను రాయితీలు ఇవ్వాలని కూడా అడుగుతున్నారు.
 ఉత్పత్తి పరిశ్రమనుంచి భిన్నంగా చూడవద్దు 

సెక్షన్ 72ఎ కింద ఉత్పత్తి పరిశ్రమనుంచి భిన్నంగా చూడటం వలన సేవా రంగం చాలా నష్టపోతున్నదని కూదా టీవీ పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.  దీనివలన సేవారంగం ఎదుగుదల ఆగిపోతున్నట్టు చెబుతున్నారు. సెక్షన్ 72ఎ కింద అందాల్సిన రాయితీలు కేవలం పారిశ్రామిక సంస్థలకు, నౌకారంగం, హోటల్, వైమానిక, బాంకింగ్ రంగాలకు మాత్రమే వర్తిస్తున్నాయని అందువలన పారిశ్రామిక సంస్థల నిర్వచనాన్ని విస్తరించి అందులోకి టీవీ పరిశ్రమను కూడా చేర్చాలని కోరుతున్నారు. అంటే బ్రాడ్ కాస్టర్లు, కార్యక్రమాల రూపకల్పన చేసే నిర్మాణ సంస్థలు కూడా లాభం పొందుతాయి

పరోక్షపన్నుల హేతుబద్ధీకరణ
పరోక్ష పన్నులు ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటున్నాయి. మొత్తంగా చూస్తే 30 నుంచి 70 శాతం వరకు విధిస్తున్నారు. మరీ ముఖ్యంగా  సర్వీస్ టాక్స్ కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఎంటర్టైన్మెంట్ టాక్స్ పెనుభారంగా తయారైంది. అప్పట్లో కనెక్షన్ల సంఖ్య తక్కువగా చెబుతుండేవారనో, పైరసీకి పాల్పడుతున్నారనో చెబుతూ అలాంటి అనారోగ్యకరమైన విధానాల కారణంగా పన్నుల విధానం కూడా ఆలాగే ఉన్నట్టు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు డిజిటైజేషన్ తరువాత లెక్కల్లో ఎలాంటి అవకతవకలూ ఉండవు కాబట్టి పన్ను విధానాన్ని కూడా హేతుబద్ధం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరుగుతున్నందున కొంత రాయితీ లభించే విధంగా హేతుబద్ధం చేయాలన్నది పరిశ్రమ అభిప్రాయం. మొత్తంగా పన్నుల విధానాన్ని సమీక్షించి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కేబుల్ ఆపరేటర్లమీద, డిటిహెచ్ ఆపరేటర్ల మీద పెద్ద ఎత్తున వినోదపు పన్ను వసూలు చేస్తున్నాయి. ఢిల్లీలాంటి చోట ఒక్కో కనెక్షన్ మీద రూ.40 వసూలు చేస్తున్నారు. అలా రెండు పన్నులూ వేరువేరుగా వసూలు చేస్తూ ఉండటం వలన వినోద పరిశ్రమ మొత్తం ఈ భారాన్ని భరించాల్సి వస్తున్నది. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం కాపీ రైట్స్ బదలీ మీద 14 శాతం సర్వీస్ టాక్స్ వసూలు చేస్తోంది. దానికి అప్పటికే వస్తువుల విభాగం కింద వివిధ రాష్ట్రాలలో వాట్ చట్టం కింద పన్ను విధింపు జరిగే ఉండటం గమనార్హం.
కంటెంట్ తయారీ చెల్లింపులు

బ్రాడ్ కాస్టర్ కి కంటెంట్ తయారు చేసి ఇచ్చే సంస్థలకు చెల్లింపులు జరిపితే దాన్ని టెక్నికల్ సర్వీసులుగా పరిగణించి దానిమీద పన్ను అధికారులు చట్టంలోని సెక్షన్ 194 జె కింద 10 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. కానీ సెక్షన్ 194సి కి ఇస్తున్న వివరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బ్రాడ్ కాస్టింగ్, టెలికాస్టింగ్, ప్రొడక్షన్ కి సంబంధించిన ఒక కాంట్రాక్టు కింద జరిపిన చెల్లింపు సెక్షన్ 194సి కింద పని గ పరిగణిస్తామని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దానికి భాష్యం చెప్పుకుంటూ వ్యవహరించటం వలన ఎంతో నష్టం జరుగుతున్నదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అందువలన అధికారికంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఎలాంటి లిటిగేషన్లూ లేకుండా ఉండాలంటే సరైన వివరణ అనివార్యమని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. దీన్ని ఎలా వర్గీకరించాలనే విషయంలో స్పష్టత ఇచ్చినప్పుడే అయోమయం తొలగిపోతుంది

కారేజ్ ఫీజు /ప్లేస్ మెంట్ చార్జీలు

కారేజ్ ఫీజుగా చెల్లించే మొత్తం విషయంలో కూడా ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అలా చేసిన చెల్లింపులను రాయల్టీగానో, టెక్నికల్ సర్వీసులకు చెల్లించే ఫీజుగానో పరిగణించకూడదు. ఆ మొత్తాలకు చట్టంలోని సెక్షన్ 194సి నిర్దేశించిన విధంగా మూలంలో పన్ను తగ్గింపు ( టిడిఎస్ ) ఉండాలి.  కానీ పన్ను విధించే అధికారులు మాత్రం వక్రభాష్యం చెబుతున్నారు. కేబుల్ ఆపరేటర్లు అందించేది టెక్నికల్ సర్వీసులు కాబట్టి ప్లేస్ మెంట్ కోసం చేసే చెల్లింపులు సెక్షన్  194జె కింద మూలంలో పన్ను తగ్గింపుకు గురికావాల్సిందేనంటున్నారు. బ్రాడ్ కాస్టర్లు తమ చానల్స్ కు ప్రేక్షకాదరణ పెరిగేలా ఎమ్మెస్వోలకు, డిటిహెచ్ ఆపరేటర్లకు ప్లేస్ మెంట్ ఫీజు, కారేజ్ ఫీజు చెల్లిస్తూ ఉంటారు. ఒప్పుకున్న ఫ్రీక్వెన్సీలో చానల్ ప్రసారం చేసేలా ఒక ఒప్పందం కుదుర్చుకొని దాని ప్రకారం చెల్లింపులు జరుపుతారు.

15% ఏజెన్సీ కమిషన్ మీద సెక్షన్ 194హెచ్ కింద టిడిఎస్
బ్రాడ్ కాస్టర్లు అడ్వర్టయిజర్లకు లేదా అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీలకు వారి ఇన్వాయిస్ ల మీద 15 శాతం ఏజెన్సీ కమిషన్ మీద ఎలాంటి పన్నులూ మూలంలో తగ్గించకూడదని కూడా పరిశ్రమ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఇన్వాయిస్ లో పేర్కొన్న మొత్తం కేవలం అందులో కనబడుతుందే తప్ప అది నిజమైన లావాదేవీల కిందికి రాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  అటు బ్రాడ్ కాస్టర్ గాని, ఇటు యాడ్ ఏజెన్సీ గాని దీనిని ఆదాయంగా లేదా ఖర్చుగా గుర్తించవు. అది ఒక సంప్రదాయంగా వస్తున్నదే తప్ప మరేమీ కాదనటానికి నిదర్శనం అడ్వర్టయిజర్ నేరుగా రూపొందించిన ఇన్వాయిస్ లో కూడా ఆ 15 శాతం ఏజెన్సీ కమిషన్ అనే మాట ఉంటుంది.

ఇన్వాయిస్ లో చెప్పిన 15 శాతం ఏజెన్సీ కమిషన్ పేరిట బ్రాడ్ కాస్టర్లు ఎలాంటి చెల్లింపులూ చేయరు. ఎందుకంటే, అలాంటి కమిషన్ చెల్లించేలా యాడ్ ఏజెన్సీలతో గాని, అడ్వర్టయిజర్స్ తో గాని ఎలాంటి ఒప్పందాలూ లేవు కాబట్టి. అలా పేర్కొన్న కమిషన్ ను బ్రాడ్ కాస్టర్లు ఎవరూ చెల్లించరు కూడా.

ఇలా ఉండగా భారత మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ 2013 లో 91,800 కోట్ల రూపాయలుండగా  అది 2014 లో  రూ. 1,02,600 కోట్లకు చేరినట్టు ఫిక్కీ అంచనావేసింది. ఈ క్రమంలో 11.7శాతం పెరుగుదల నమోదైనట్టు పేర్కొంది. ఇది 2015 లో 13 శాతం సాధించే అవకాశం ఉందని కూడా అంచనావేసింది.  డిజిటైజేషన్ వలన టీవీ పరిశ్రమ వృద్ధిరేటు గణనీయంగా ఉంటుందని దీని వలన ఏటా వృద్ధి రేటు 15.5 శాతం మించి పోతుందని కూడా ఫిక్కీ నివేదిక చెబుతోంది.
అవార్డు ఫంక్షన్లు, సంగీత ప్రదర్శనల ఎంట్రీ టికెట్లమీద సర్వీస్ టాక్స్ మినహాయింపు
అవార్డు ఫంక్షన్లు, సంగీత ప్రదర్శనలు, అందాల ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఎంట్రీ టికెట్ రూ.500 మించినప్పుడు మాత్రమే సర్వీస్ టాక్స్ వర్తించేలా గత బడ్జెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇలాంటి కార్యక్రమాలమీద ఇప్పటికే పెద్ద ఎత్తున ఎంటర్టైన్మెంట్ టాక్స్ వసూలు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ రేట్ల టికెట్లమీద కూదా 14 శాతం సర్వీస్ టాక్స్ భారమే అవుతుందని అంటున్నారు. వినోద రంగం మీద ఈ భారం మోపకుండా, పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. పైగా ఆ రూ.500 అనేది వినోదపు పన్ను కలిపిన తరువాతనా, కలపక ముందా అనే విషయంలో కూడా ఒక స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.