టీవీలను ఎవరు నియంత్రించాలి ?

self-control-cable
పుట్టగొడుగులతో పోల్చిచెప్పటం బాగుండదుగాని దేశవ్యాప్తంగా పెరుగుతున్న శాటిలైట్ చానల్స్ అటువంటి అభిప్రాయాన్నే  కలిగిస్తున్నాయి. కమర్షియల్ మాధ్యమమని పదే పదే గుర్తు చేస్తూ వాణిజ్య ఫ్రయోజనాలే పరమావధి అని చెప్పుకునే చానల్స్ నుంచి గొప్ప కార్యక్రమాలు అందుతాయనుకోవటం అత్యాశే కావచ్చు. రాశి పెరిగేకొద్దీ పోటీ కారణంగా మంచి కార్యక్రమాలు వస్తాయని ఊహించటం మాత్రం తప్పుకాదు. అయితే అందుకు భిన్నమైన వాతావరణం ఏర్పడింది. చానల్స్ సంఖ్య పెరగటం వలన ఆదాయాలు పడిపోయాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవటంలో భాగంగా నాసిరకం కార్యక్రమాలవైపు మొగ్గుచూపే వాళ్ళు కొందరైతే, ఏదో రకంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న వాళ్ళు మరికొందరు.నాణ్యత సంగతలా ఉంచితే, ప్రజలకు మేలు చేయకపోయినా ఫరవాలేదుగాని కీడు చేయకపోతే చాలుననుకునే దయనీయమైన పరిస్థితి దాపురించింది. టీవీ కార్యక్రమాలు చూసి చెడిపోతున్నారనే అభిప్రాయంతో ఏకీభవించేవారు పెరగటమే అందుకు నిదర్శనం.

ఈ మధ్య రెండు వేరు వేరు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు టీవీ కార్యక్రమాల మీద ఒక రకమైన యుద్ధమే ప్రకటించారు. దాదాపుగా ఇద్దరి అభిప్రాయాలూ ఒకే విధంగా ఉన్నాయి. నిజానికి అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు కావు. సగటు ప్రేక్షకుల మనోభావాలను బహిరంగంగా వినిపించారంతే. వాళ్ళిద్దరిలో ముందుగా చెప్పుకోవలసింది రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు గురించి. టీవీ చానల్స్ ‘ ప్రైం టైం ‘ ను  ‘ క్రైం టైం ‘ గా మార్చేశాయని ఆవేదన చెందుతూ ఆయనో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. అన్నిపార్టీలవాళ్ళనీ, మహిళాసంఘాలనూ, ఎన్‌జీవోలనూ పిలిచి  కలిసికట్టుగా పోరాడాలని కోరారు. కొంతమంది మొక్కుబడి ప్రసంగాలు చేసి వెళ్ళిపోయారు.  మీడియాతో తలగోక్కోవడానికి ఎవరైనా ఎందుకిష్టపడతారు ? ఆ రోజు జరిగిన కార్యక్రమానికి మీడియా కవరేజ్ నామమాత్రంగా ఉండటం గమనిస్తే మొహంచాటేశారని అర్థమౌతుంది. 
 
రెండో వ్యక్తి  తెలుగుదేశం పార్టీ శాసనమండలి నాయకుడు దాడి వీరభద్రరావు. టీవీ కార్యక్రమాల తీరుతెన్నులను విశ్లేషిస్తూ, తగిన నియంత్రణకు సెన్సారింగ్ వ్యవస్థ ఉండాలని  శాసనమండలిలో  గట్టిగానే వాదించారు. రాష్ట్రప్రభుత్వానికున్న అధికారాలమీద ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన జానారెడ్డిగారు ఎప్పుడో 1995లో వచ్చిన కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ (రెగ్యులేషన్) యాక్ట్ గురించి ఏకరవు పెట్టారే తప్ప ఆ తరువాత వచ్చిన సవరణల గురించిగానీ, ఆదేశాలగురించిగానీ ప్రస్తావించనేలేదు. ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు తమ తప్పు బయటపడుతుందనే అభిప్రాయంతో సంబంధిత సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచివుంటారు. అందుకే మంత్రి కూడా 1995 నాటి చట్టం ప్రకారం ఫిర్యాదులమీద చర్యలు తీసుకుంటామనే సీదాసాదా సమాధానంతో సరిపుచ్చారు.


 నిజానికి ఈ చట్టం వచ్చిన పదేళ్ళకు ( 2005 ఏప్రిల్ 16న )  అన్ని రాష్ట్రాల సమాచారశాఖామంత్రులతో ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. కేబుల్, శాటిలైట్ చానల్స్ లో ప్రసారమవుతున్న కార్యక్రమాలమీద సరైన నియంత్రణ లేకపోవటం వలన విచ్చలవిడితనం పెరుగుతోందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థ ఉండాలని అందరూ తీర్మానించారు. ఫలితంగా 2005 సెప్టెంబర్ 6న ఆదేశాలు వెలువడ్డాయి. అన్ని రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో పర్యవేక్షక కమిటీలు ఏర్పాటుచేయాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. రాష్ట్రస్థాయి కమిటీకి సమాచార శాఖ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు.జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, నగరాలలో అయితే కలెక్టర్ కు బదులు పోలీసు కమిషనర్ అధ్యక్షునిగా ఉండాలని ఆ ఉత్తర్వులు సూచించాయి. అభ్యంతరకరమైన కార్యక్రమాలు ప్రసారం చేసినా, రిజిస్ట్రేషన్ లేకుండా కేబుల్ చానల్ నడిపినా ఈ కమిటీలు తగిన చర్యలు తీసుకోవాలి. దూరదర్శన్ చానల్స్ విధిగా ప్రైం బ్యాండ్ లో ప్రసారం చేసేలా చూడాలి. అయినా సరే ఎవరూ పట్టించుకోలేదు.     
 
అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. వెనక్కి తిరిగి చూస్తే, జమ్మూ కాశ్మీర్ మాత్రమే రాష్ట్ర స్థాయి కమిటీ వేసింది. దేశ వ్యాప్తంగా చూసినా జిల్లా కమిటీలు 10 శాతం మించలేదు. 2008 ఫిబ్రవరి 19 న మళ్ళీ స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్ర కమిటీ కనీసం ఏడాదికొకసారి,  జిల్లా కమిటీలు కనీసం రెండునెలలకోసారి సమావేశం జరపాలి. రాష్ట్ర కమిటీలు శాటిలైట్ చానల్స్ మీద వచ్చే ఫిర్యాదుల మీద విచారణ జరిపి కేంద్రానికి తమ సిఫార్సులు పంపాలి. జిల్లా కమిటీలుకేబుల్ టీవీలపై వచ్చిన ఫిర్యాదులమీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనీ,  శాటిలైట్ చానల్స్ మీద ఫిర్యాదులు వస్తే రాష్ట్రస్థాయి కమిటీకి సిఫార్సు చేయాలనీ అందులో ఉంది.

సమాచార శాఖ కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే రాష్ట్ర కమిటీలో  డీజీపీ ప్రతినిధి, సాంఘిక, మహిళాశిశు సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఒక ప్రముఖ స్వచ్ఛందసంస్థ ప్రతినిధిని, ఒక విద్యావేత్తను, ఒక సైకాలజిస్టును, ఒక సామాజిక శాస్త్రవేత్తను రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నామినేట్ చేయాలి. సమాచార శాఖ కార్యదర్శి మెంబర్ సెక్రటరీగా ఉంటారు. జిల్లా  కమిటీల పనితీరును పర్యవేక్షించే బాధ్యత కూడా రాష్ట్ర కమిటీలదే. కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే జిల్లా కమిటీలలో ఎస్పీ, డీపీఆర్వో ఉంటారు.  జిల్లాకు చెందిన మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ను, బాలల సంక్షేమం మీద పనిచేసే ఒక ఎన్‌జీవో ప్రతినిధిని, మహిళాసంక్షేమం మీద పనిచేసే ఒక ఎన్‌జీవో ప్రతినిధిని, ఒక విద్యావేత్తను, ఒక సైకాలజిస్టును, ఒక సామాజిక శాస్త్రవేత్తను కలెక్టర్ నామినేట్ చేయాలి.

ఇవన్నీ కాగితాలకే పరిమితమై ఉండగానే దీనికో సవరణ కూడా వచ్చింది. 2008 జులై 8 న ఈ సవరించిన ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీలో దూరదర్శన్ కేంద్రం డైరెక్టర్‌ను, జర్నలిస్టులసంఘం ప్రతినిధిని, లేదా, అక్కడ ఉండే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుణ్ణి కూడా చేర్చాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. అదే విధంగా జిల్లా కమిటీలలో డీపీఆర్వో మెంబర్ సెక్రటరీగా ఉంటారని, గుర్తింపు పొందిన మీడియా సంస్థనుంచి గానీ, జర్నలిస్టుల సంఘం నుంచి గానీ, స్థానికంగా ప్రెస్ కౌన్సిల్ సభ్యుడుంటే అతడిని గానీ, దూరదర్శన్, ఆకాశవాణి ప్రతినిధులలో ఒకరినిగాని నియమించాలని సవరిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇటువంటి కమిటీల నియామకమేదీ రాష్ట్రంలో జరగలేదు. ప్రేక్షకుల ఫిర్యాదులను పరిశీలించి విచారించేందుకు  ఉద్దేశించిన కమిటీలగురించి  హోం మంత్రిసహా మన  నాయకుల  దృష్టికి రాలేదంటే ఆ ఉత్తర్వులను అధికారులు ఎంత నిర్లక్ష్యంగా మూలన పడేశారో అర్థం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో శాసనమండలిలో దాడి వీరభద్ర రావు అడిగిన ప్రశ్నకు హోం మంత్రి జానా రెడ్డి అలాంటి సమాధానమే ఇస్తారు. రౌండ్ టేబుల్ సమావెశానికి పిలిస్తే సమాచార శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఇవే మాటలు చెప్పి వెళ్ళిపోయారు. వీహెచ్ కూడా అదే నిజమని సరిపెట్టుకున్నారు.

టీవీ కార్యక్రమాల మీద ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఎవరికి, ఎక్కడ చెప్పుకోవాలో కూడా తెలియని దుస్థితిలో ప్రేక్షకులున్నారు. ఈ పదేళ్ళ కాలంలో తెలుగు చానల్స్ మీద చర్యలు తీసుకున్న సందర్భాలు రెండే రెండు. రాత్రిపూట మరీ పెందలాడే ‘ కామసూత్ర ‘ సినిమా ప్రసారం చేసిన తేజా టీవీ క్షమాపణలు చెబుతూ స్క్రోల్  నడపాల్సి రావటం మొదటిదైతే , ‘సోయగం ‘ పేరుతో మోతాదు మించిన శృంగారం చూపినందుకు  జీ తెలుగును సమాచార ప్రసారాల శాఖ హెచ్చరికతో వదిలేసింది. న్యూస్ చానల్స్ కు ఇప్పటివరకూ అలాంటి పరిస్థితే ఎదురుకాలేదు. అంతమాత్రాన అంతా సజావుగా ఉందని కాదు. ప్రేక్షకులు తమ అభ్యంతరాలను చెప్పుకునేందుకు సరైన వేదిక లేకనే ఇలా జరుగుతోంది.  చానల్స్ స్వయంగా ఇప్పుడొక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించినా ఆ ఏర్పాటు సామాన్యుడికి అందుబాటులో లేదు. ఫిర్యాదుతో వెయ్యి నుంచి పదివేల దాకా ఫీజు కట్టవలసి రావటంలోనే ఇది అందుబాటులో లేని విధానమని తేలిపోయింది.

పర్యవేక్షణ కమిటీలు వేయాల్సిన ప్రభుత్వం ఆ విషయమే తెలియదన్నట్టు మౌనంగా ఉండిపోతోంది. ఎవరికి ఫిర్యాదుచేయాలని అడిగితే కేంద్రాన్ని కనుక్కుని చెబుతానంటోంది. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయటమే చేతకాని వారు మళ్ళీ కేంద్రాన్ని అడిగి ఏం చేస్తారో తెలియదు.చానల్స్ ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను ఆశ్రయిద్దామంటే ఫీజు కట్టాలి. సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు పర్యవేక్షణ కమిటీలుంటే కనీసం ఫిర్యాదులు పంపే వీలుంటుంది. ఆ కమిటీలైనా చానల్స్ ఏర్పాటుచేసుకున్న నియంత్రణవ్యవస్థకు తెలియజేసే అవకాశం ఉంటుంది.