• Home »
  • Legal Issues »
  • కారేజ్ ఫీజును ట్రాయ్ నియంత్రిస్తుందా?

కారేజ్ ఫీజును ట్రాయ్ నియంత్రిస్తుందా?

కేబుల్ టీవీ చట్టంలోగాని, ఆ తరువాత డిజిటైజేషన్ చట్టం చేస్తూ సవరించిన కేబుల్ టీవీ చట్టంలోగాని స్పష్టంగా ప్రస్తావించని కారేజ్ ఫీజు వ్యవహారాన్ని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) ఇప్పుడు మరోమారు చర్చకు పెట్టింది. గతంలో ఒకసారి ప్రత్యేకంగా చర్చాపత్రం విడుదలచేసినా ఎమ్మెస్వోలు ఆ విషయాన్ని మార్కెట్ శక్తులకు వదిలి వేయటమే సమంజసమని వాదించటంతో ట్రాయ్ మౌనముద్ర దాల్చింది.

డిజిటైజేషన్ తరువాత ఎక్కువ చానల్స్ ప్రసారం చేయటానికి వీలుంటుంది కాబట్టి బాండ్ విడ్త్ సమస్య ఉండదని, ఖాళీగా ఉంచుకునేబదులు ఎంతోకొంత వసూలు చేసుకొని చానల్స్ ఇవ్వటానికే ఎమ్మెస్వోలు మొగ్గు చూపుతారు కాబట్టి డిమాండ్, సప్లయ్ సిద్ధాంతానికి వదిలేయటమే మంచిదన్న అభిప్రాయంతో ట్రాయ్ కూడా వదిలేసింది. అయితే, డిజిటైజేషన్ పూర్తయిన మొదటి రెండు దశల్లో కారేజ్ ఫీజు చెప్పుకోదగినంత తగ్గకపోవటంతో ఇప్పుడు మళ్ళీ ట్రాయ్ జోక్యం మొదలుపెట్టింది.

పే చానల్స్ చందా రేట్లు అ లా కార్టే, బొకే పద్ధతులలో ఎలా ఉండాలో చర్చకు పెడుతూ చర్చా పత్రం విడుదలచేసిన ట్రాయ్ అందులొనే కారేజ్ ఫీజు విషయాన్ని కూడా ప్రస్తావించింది. ప్రధాన అంశంగా చెప్పకపోయినప్పటికీ, కారేజ్ ఫీజు మీద ఏదైనా నియంత్రణ ఉందటం సమంజసమా అంటూ ప్రశ్నించటం ద్వారా మళ్ళీ  తేనెతుట్టెను కదిపినట్టయింది. స్వయంగా ట్రాయ్ ఒక పరిమితి విధించటం ఎలా ఉంటుందో సూచించమని సంబంధిత వర్గాలను కోరింది. అంటే ఎమ్మెస్వోలు, బ్రాడ్ కాస్టర్లు ఒక విధానం సూచించాలన్నది ట్రాయ్ అభిప్రాయం.

ఎమ్మెస్వోలు తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే ట్రాయ్ జోక్యం సరైన పద్ధతి అవుతుందా అని ఆ చర్చా పత్రంలో అడిగింది. ఒక్కో చానల్ కు ఒక్కో చందాదారుకు ఎంత చొప్పున చానల్స్ నుంచి వసూలు చేయటం సమంజసంగా ఉంటుందో చెప్పాలని కోరింది. ఒక్కో చానల్ కూ చందాదారుల సంఖ్య పెరిగే కొద్దీ కారేజ్ ఫీజు తగ్గించాలేమో కూదా సూచించమని ఆ చర్చాపత్రంలో అడిగింది. అసలు కారేజ్ ఫీజును ఏ పరిస్థితుల్లో ఎందుకు అంగీకరించాలో కూడా చెప్పాలని సూచించింది.

ఒక చానల్ ను ప్రసారం చేయటానికి మౌలిక సదుపాయాలను వాడుతున్నందున కారేజ్ ఫీజు వసూలు చేసుకోవాల్సిందేనని ఎమ్మెస్వోలు భావిస్తున్నట్టయితే ఆ మొత్తాన్ని లెక్కించటానికి ఆ చానల్ అందించటానికి వెచ్చిస్తున్న బాండ్ విడ్త్ విలువను ఆధారంగా తీసుకోవాలి. అదే సమయంలో ఎమ్మెస్వోలు ఆ కారేజ్ ఫీజు వసూలు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉందని ట్రాయ్ అభిప్రాయపడింది.

నిజానికి ఎంత కారేజ్ ఫీజు అడుగుతున్నదీ నిర్దిష్టంగా చెప్పాలని, వివక్ష లేకుండా కారేజ్ ఫీజు సమానంగా వసూలు చేయాలని, ఒకసారి కారేజ్ ఫీజు నిర్ణయించిన తరువాత కనీసం రెండేళ్ళ పాటు మళ్ళీ పెంచకూడదని ట్రాయ్ నిర్దేశించింది. అదే సమయంలో అందరు బ్రాడ్ కాస్టర్లనూ ఒకేలా చూడాలని కూడా కోరింది. అయితే, ఒక్కో తరహా చానల్స్ కు ఒక్కో తరహా ఫీజు వసూలు చేయటం ఎమ్మెస్వోలకు అలవాటేనని ట్రాయ్ గుర్తించింది. కొన్ని సందర్భాలలో ఇతర వాణిజ్యపరమైన ఒప్పందాల కారణంగా కారేజ్ ఫీజు వివరాలు లభ్యం కావటం లేదని గ్రహించింది.

ఈ కారణంగా ఏ చానల్ ఎంత కారేజ్ ఫీజు చెల్లిస్తున్నదీ స్పష్టంగా తెలిసే అవకాశం లేకపోవటం ట్రాయ్ దృష్టికొచ్చింది. ఒక చానల్ వాస్తవంగా ఎంత కారేజ్ ఫీజు చెల్లించిందో తెలియనంతకాలం  ఒక విధానాన్ని రూపొందించటం సాధ్యం కాదు.   పైగా, మరో ప్రధాన సమస్య ఉచిత చానల్స్ విషయంలో వస్తుంది. ఒకవైపు వంద చానల్స్ ఉచితంగా ఇవ్వాలని చెబుతున్నప్పుడు చందాదారుడు అడిగే ఉచిత చానల్స్ కచ్చితంగా ఇవ్వాల్సి వస్తే కారేజ్ ఫీజు  వసూలు చేసుకునే అవకాశాన్ని ఎమ్మెస్వో కోల్పోతాడు. ఇదే అవకాశంగా తీసుకునే చానల్ యజమాని కారేజ్ ఫీజు ఇవ్వకుండా ఎగ్గొట్టే అవకాశముంది.

ప్లేస్ మెంట్ విషయంలో కూడా నిర్దిష్టమైన నిబంధనలేవీ లేవు. కేవలం ఒక తరహా చానల్స్ ఒక చోట ఉండాలని మాత్రమే డిజిటిజేషన్ నిర్దేశిస్తున్నది. అంటే, జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నీ ఒకచోట, న్యూస్ చానల్స్ అన్నీ ఒక చోట మ్యూజిక్ చానల్స్ అన్నీ ఇంకోచోట ఇవ్వాలి. అందువలన ఒక తరహా చానల్స్ ను ఒకచోట ఇస్తూనే  ఆ క్రమంలో ఎక్కడ ఇవ్వాలన్నది ఎమ్మెస్వోకే వదిలేసింది ట్రాయ్. దీన్ని అవకాశంగా తీసుకొని ప్లేస్ మెంట్ ఫీజు వసూలు చేసుకునే అవకాశాన్ని ఎమ్మెస్వోలకు ఇచ్చింది. ఏదైనా ఒక అర్థవంతమైన నెంబర్ కావాలని గాని, ఏదైనా బలమైన చానల్ పక్కన ఉండేలా గాని చానల్ యాజమాన్యం కోరవచ్చు. లేదా పోటీ చానల్ కంటే ముందుండేలా కూడా కావచ్చు.

ఇదంతా డబ్బుతో ముడిపడి ఉండేదే. ప్రేక్షకులు ఒక చానల్ ను ఎంచుకోవటమన్నది కచ్చితంగా దాని అందుబాటుమీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అలా చేసుకునే వాణిజ్య ఒప్పందాల విషయంలో నియంత్రణ సంస్థగా ట్రాయ్ ఏమైనా చేయగలదా అని ఆడుగుతోంది. అదే సమయంలో ప్లేస్ మెంట్ లేదా మార్కెటింగ్ ఫీజ్ అనేది రెండు వ్యాపార సంస్థలమధ్య కుదుర్చుకునే ఒప్పందం లాంటిది కాబట్టి ఇందులో తన జోక్యం అవసరం లేదోమోనన్న అభిప్రాయం కూడా ట్రాయ్ వ్యక్తం చేసింది. నిజానికి వారు కూడా ట్రాయ్ జోక్యాన్ని కోరుకోకపోవచ్చు. అందుకే పరిశ్రమకు వదిలేయటమే మంచిదని భావిస్తోంది. అనలాగ్ కాలంలో బాండ్ విడ్త్ సమస్య ఉన్నప్పుడు మొదలైన కారేజ్ ఫీజు వ్యవహారం ఇప్పుడు డిజిటైజేషన్ హయాంలో చర్చకు వచ్చింది.

చానల్స్ సంఖ్య చాలా వేగంగా పెరుగుతూ వస్తుండగా స్థిరంగా ఉన్న బాండ్ విడ్త్ లో సర్దే క్రమంలో ఎమ్మెస్వోలు బాగానే కారేజ్ ఫీజు వసూలు చేసుకున్నారు. డిజిటేషన్ అమలు చేసిన తరువాత బాండ్ విడ్త్ సమస్య లేకపోయినా కారేజ్ ఫీజు మాత్రం ఆశించినంతగా తగ్గకపోవటంతో చానల్స్ కంగారుపడుతున్నాయి.

నిజానికి డిజిటైజేషన్ నేపథ్యంలో దాని ప్రభావాన్ని అంచనావేసేందుకు వీలుగా సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ గతంలోనే అన్ని చానల్స్ కు లేఖ రాస్తూ సమాచారం కోరింది. డిజిటైజేషన్ కు ముందు, డిజిటైజేషన్ కు తరువాత ఎంతెంత క్యారేజ్ ఫీజు చెల్లిస్తూ వచ్చారో  చెప్పాలని, అదేవిధంగా చందాల మొత్తం ఎమ్ ఎస్ వో లనుంచి ఏమేరకు వసూలయిందో చెప్పాలని ఆ లేఖలో కోరింది.

మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ సుప్రియా సాహు సంతకంతో విడుదలైన లేఖలో  “ డిజిటైజేషన్ నేపథ్యంలో డిజిటైజేషన్ కు ముందు, తరువాత నెలవారీగా చెల్లించిన క్యారేజ్ ఫీజు, ఎమ్ ఎస్ వోల ద్వారా వసూలైన పే చానల్  చందా మొత్తాలు ఇవ్వాలంటూ నమూనా పట్టికను కూడా జతచేసింది. మొదటి, రెండవ దశ నగరాల వివరాలు వేరువేరుగా వెల్లడించాలని,  2012 మే నెల మొదలుకొని 2014 ఫిబ్రవరి వరకు ఎమ్ ఎస్ వోల వారీగా వివరాలు ఇవ్వాలని కోరింది.

అనలాగ్ హయాంలో కూడా  ఒకసారి ప్రభుత్వం క్యారేజి ఫీజు చెల్లింపు వివరాలు కోరగా న్యూస్ చానల్స్ దాదాపుగా అన్నీ  మౌన ముద్ర దాల్చాయి. ఎమ్ ఎస్ వో ల దృష్టిలో వ్యతిరేకం కావటం ఇష్టంలేక ఆ వివరాలు వెల్లడించలేదు. ఇప్పుడు కూడా క్యారేజ్ ఫీజు చెల్లింపు వివరాలు వెల్లడిస్తాయనుకోవటం భ్రమే అవుతుంది. ఒకవేళ వెలడించినా నామమాత్రంగా మాత్రమే చెబుతాయి. అదీ చెక్కుల ద్వారా చెల్లించిన మొత్తాలు మాత్రమే లెక్కలోకి వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం కూడా క్యారేజ్ ఫీజును నియంత్రించటానికి అవసరమైన చర్యలు తీసుకోవటం సాధ్యం కాదు.

ఎక్కువ చానల్స్ అందించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇతర భాషల చానల్స్ అయినా సరే ఉచితంగా ఇస్తాయే తప్ప స్థానిక చానల్స్ కు మాత్రం కచ్చితంగా కారేజ్ ఫీజు వసూలు చేసుకోవాలన్నదే ఎమ్మెస్వోల లక్ష్యం. చానల్స్ తమ తమ చందా రేట్లు నిర్ణయించుకునేటప్పుడు తమ మౌలిక సదుపాయాలు వాడుకునే చానల్స్ నుంచి ఫీజు వసూలు చేయటంలో తప్పేంటని ఎమ్మెస్వోలు వాదిస్తున్నారు. అందుకే ఈ వ్యవహారంలో ట్రాయ్ జోక్యాన్ని కూడా సహించేందుకు సిద్ధంగా లేరు. ఎమ్మెస్వోలు ఇదే వైఖరిని ట్రాయ్ కి తెలియజేయటానికి సిద్ధమవుతున్నారు. అయితే, న్యూస్ చానల్స్ మాత్రం ఒక్కో కనెక్షన్ కు ఏడాదికి ఒక రూపాయి చొప్పున కారేజ్ ఫీజ్ ఉంటే అర్థవంతంగా ఉంటుందని భావిస్తున్నాయి.