• Home »
  • Entertainment »
  • జీ గ్రూప్ దక్షిణాది తొలి మూవీ చానల్ జీ సినిమాలు ప్రారంభం

జీ గ్రూప్ దక్షిణాది తొలి మూవీ చానల్ జీ సినిమాలు ప్రారంభం

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సమ్స్థ ఆధ్వర్యంలో తెలుగులో నడుస్తున్న జీ తెలుగు 11 ఏళ్లు పూర్తి చేసుకోగా ఇప్పుడు తన రెండో చానల్ జీ సినిమాలు లాంఛనంగా ప్రారంభించింది. ఈ చానల్ లోగోను ఆగస్టు 17 న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టెస్ట్ సిగ్నల్ ప్రసారం చేస్తూ వచ్చిన జీ సినిమాలు చానల్ సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 12.05  నుంచి పూర్తి స్థాయి ప్రసారాలు అందిస్తోంది.

తెలుగులో నాలుగు ప్రధానమైన గ్రూపులు ఒకటి కంటే ఎక్కువ చానల్స్ అందిస్తుండగా జీ గ్రూప్ వారి జె తెలుగు మాత్రమే ఒకే చానల్ కు పరిమితమైంది. గతంలో ప్రసారమైన జీ 24 గంటలు మూతపడిన తరువాత ఎంటర్టైన్మెంట్ విభాగంలొ ఇప్పుడు రెండో చానల్ అందిస్తోంది. జెమిని గ్రూప్ లో 8,  ఈటీవీ గ్రూప్ లో 7, స్టార్ (మా టీవీ) గ్రూప్ లో నాలుగు చానల్స్ ఉన్న సంగతి తెలిసిందే.

జీ గ్రూప్ కు దక్షిణాదిన జీ కన్నడ, జీ తెలుగు, జీ తమిళ్ చానల్స్ ఉండగా రెండవ చానల్ ఇప్పుడు జీ సినిమాలు తోనే మొదలయింది. ఆ విధంగా దక్షిణాదిన మొదటి జీ గ్రూప్ సినిమాల చానల్ గా జీ సినిమాలు స్థానం దక్కించుకుంది. మలయళంలో జీ టీవీ ఇప్పటివరలు ప్రవేశించకపోగా, ప్రాంతీయ భాషల్లో బెంగాలీ, మరాఠీ భాషల్లో మాత్రం జీ టీవీకి జనరల్ ఎంటర్టైన్మెంట్ తో బాటు సినిమా చానల్స్ ఉన్నాయి.

ఇప్పుడు తెలుగులో మొదలైన జీ సినిమాలు ప్రధానంగా 18 ఏళ్లు పైబడిన పట్టణప్రాంత యువతను లక్ష్యంగా చేసుకుంటుందని, ప్రచార కర్తగా తమిళ, హిందీ నటి విద్యుల్లేఖ రామన్ పనిచేస్తున్నారని  జీ తెలుగు, జీ సినిమాలు చానల్స్ బిజినెస్ హెడ్ అనూరాధ వెల్లడించారు. ఎన్ క్రిప్ట్ చేసిన సిగ్నల్స్ పంపిణీ చేస్తామని చెప్పినా, పే చానల్ చందా ధర మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రకటనలిచ్చేవారు ఎక్కువగ అపురుష ప్రేక్షకుల ఆదరణను దృష్టిలో పెట్టుకుంటున్నందువల్లనే వాళ్ళను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ప్రారంభానికి ముందే ప్రారంభవేడుకలకోసం బ్రాండ్ పార్ట్నర్స్ ను ఎంచుకున్నారు. క్లోజప్, పానాసోనిక్, ఫాగ్ డియోడరెంట్, ఫార్చ్యూన్ సన్ ఫ్లవర్ ఆయిల్, అమెజాన్ వాటిలో ఉన్నాయి. జనరల్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో తెలుగులో మంచి స్థానం సంపాదించుకొగలిగిన జీ తెలుగు చానల్ కు తోడుగా మరో చానల్ లేకపోవటం ఇబ్బందికరంగా మారింది. ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయాలంటే అనివార్యంగా ముందస్తు ఒప్పందాలను ఉల్లంఘించాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే, ఇకముందు అలాంటి సమస్యలు రాకుండా ఈ రెండో చానల్ ను ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుంది.

సూపర్ హిట్ అనే టాగ్ లైన్ తో ప్రారంభమైన జీ సినిమాలు చానల్ వారంలో ప్రతిరోజూ ఒక్కో ప్రీమియర్ సినిమాను అందిస్తుంది. అదే విధంగా వరల్డ్ టీవీ ప్రీమియర్స్, నెలకొక మూవీ ఆఫ్ ద మంత్ కూడా చేపడుతుంది. భారీ కార్యక్రమాలేవైనా జరిగితే రెండు చానల్స్ లోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. అదేవిధంగా ఇతర భాషలనుంచి డబ్ చేసిన సినిమాలు కూడా ప్రసారం చేస్తారు. ఇప్పటికే జీ తెలుగు చానల్ దగ్గర 500 కు పైగా సినిమాలున్నాయి. పాత, కొత్త సినిమాల కలయిక కావటంతో అన్ని వయోవర్గాలవారినీ ఆకట్టుకోగలమని ధీమాతో ఉన్నారు.

కేవలం సినిమాలే కాకుందా సినిమా ఆధార కార్యక్రమాలూ ఉంటాయి. సమయానుకూలంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎలాంటి సినిమాలకు ఆదరణ ఉంటుందో వ్యూహాత్మకంగా అంచనావేసి  ప్రసారం చేస్తారు. ఇప్పుడు చానల్స్ అన్నీ పేరుమోసిన చిత్రాలను తమ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ లో ప్రసారం చేయట ద్వారా ఎక్కువగా ప్రకటనల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. అందుకే జీ తెలుగులో కూడా పేరు మోసిన చిత్రాలను మొదటి సారి ప్రసారం చేయక తప్పదు. ప్రీమియర్ ప్రసారం జీ తెలుగులోనే ఉంటుందని చానల్ హెడ్ అనూరాధ ఒప్పుకుంటున్నారు.

తెలుగులో మూవీ చానల్స్ ప్రేక్షకాదరణ వాటా 12 శాతం ఉండగా ఆదాయంలో అవి 15% వాటా సంపాదించుకుంటున్నాయి. పురుష ప్రేక్షకులే లక్ష్యంగా ఇవ్వదలచుకున్న ప్రకటనలు మూవీ చానల్స్ వైపు మొగ్గు చూపటమే అందుకు కారణం. సాధారణంగా ప్రకటనదారులు మహిళాప్రేక్షకుల కోసం ప్రకటనలు ఇవ్వదలచు కున్నప్పుడు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ ను, పురుషులను టర్గెట్ చేసుకోవాలనుకుంటే న్యూస్ లేదా మూవీ చానల్స్ ను కోరుకుంటారు. అందుకే రెండో చానల్ కోసం జీ తెలుగు కూడా మొగ్గు చూపింది. గతంలో ఉన్న న్యూస్ చానల్ లేకపోవటంతో ఆదాయ మార్గంగా ఇప్పుడు మూవీస్ చానల్ ప్రారంభించింది.

జీ తెలుగు తనదగ్గర మాత్రమే ఉన్న కొన్ని సినిమాల ద్వారా చెప్పుకోదగినంత ఆదరణ పొందగలనన్న ధీమాతో ఉంది. ఇటీవలి కాలంలో దాదాపు 60 కోట్ల విలువచేసే 30 సినిమాల ప్రసార హక్కులు సొంతం చేసుకుంది. కొత్త బంగారు లోకం, పాండురంగడు, వినాయకుడు, కృష్ణ, అష్టా చెమ్మా, గోరింటాకు, భద్రాద్రి, రెఢీ, కృష్ణార్జున, నేను మీకు తెలుసా, ఒక్క మగాడు, బుజ్జిగాడు, ఒంటరి, నవ వసంతం, శశిరేఖాపరిణయం, స్వార్థం, భలే దొంగలు, విక్టరి, కంత్రి, సూర్య సన్నాఫ్ కృష్ణ, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, తులసి, ఆవకాయ్ బిర్యాని, మైసమ్మ ఐపిఎస్ వాటిలో ఉన్నాయి.