• Home »
  • Entertainment »
  • లైసెన్స్ కోసం చూస్తున్న ’జీ సినిమాలు’ : త్వరలో జీ తెలుగు హెచ్ డి కూడా ప్రారంభం

లైసెన్స్ కోసం చూస్తున్న ’జీ సినిమాలు’ : త్వరలో జీ తెలుగు హెచ్ డి కూడా ప్రారంభం

తెలుగులో మ్యూజిక్, మూవీ చానల్స్ కూడా తీసుకురావాలని మూడేళ్ళూగా ఆలోచిస్తున్న జీ గ్రూప్ ముందుగా సినిమా చానల్ అందించబోతోంది. జీ సినిమాలు పేరుతో లైసెన్సుకోసం దరఖాస్తు చేసుకుంది. మరో నెలరోజుల్లోనే ఈ చానల్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. నిజానికి తెలుగులో ప్రధానమైన నాలుగు చానల్ గ్రూపులూ ఇప్పటికే ఎక్కువ చానల్స్ నడుపుతూ ఉండగా జీ టీవీ ఒక్కటే ఒంటరిగా ఉంది. జెమిని గ్రూప్ 8 చానల్స్, ఈటీవీ గ్రూప్ 7 చానల్స్, స్టార్ ఆధ్వర్యంలోని మాటీవీ గ్రూప్ 4 చానల్స్ నడుపుతూ ఉండగా జీ గ్రూప్ తెలుగు చానల్ జీ తెలుగు ఒకే చానల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే మూవీస్ చానల్ అందించబోతోంది.

ఇలా ఉండగా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ( జీల్ ) త్వరలో తెలుగుతో సహా మూడు భాషల్లో హెచ్ డి చానల్స్ అందించబోతోంది. ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ చానల్స్ నే హెచ్ డి లో కూడా అందించబోతోంది. వాటిలో తెలుగు, మరాఠీ, బెంగాలీ చానల్స్ ఉన్నాయి. అయితే జీ మరాఠీ హెచ్ డి, జీ బంగ్లా హెచ్ డి చానల్స్ కు ఇప్పటికే లైసెన్స్ ఉండగా తెలుగు చానల్ కు ఇంకా లైసెన్స్ రావాల్సి ఉంది. అంతకుముందు అందుబాటులో ఉన్న రెండు లైసెన్సులకు పేర్లు మార్చుకోవటం ద్వారా అది సాధ్యమైంది.