ఏప్రిల్ లో జీ మలయాళం ప్రారంభం

మిగిలిన దక్షిణాది భాషలన్నిటిలో ప్రారంభమైనప్పటికీ ఇంకా ఖాళీగా ఉన్న మలయాళంలో కూడా జీ టీవీ ఎంటర్టైన్మెంట్ చానల్ జీ మలయాళం అడుగుపెట్టబోతున్నది. తెలుగుతో మొదలుపెట్టి కన్నడ తమిళ భాషల మీదుగా మలయాళంలో ప్రవేశించటం ద్వారా దక్షిణాది అంతటా పూర్తిగా ఆక్రమించినట్టవుతుందని జీ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ మధ్యలో మలయాళీల కొత్త సంవత్సర వేడుకలతో చానల్ ప్రారంభించాలని జీ గ్రూప్ భావిస్తోంది.

చానల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన దీప్తి శివన్ ఇప్పటికే కార్యకలాపాలలో తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని పేరుమోసిన మలయాళీ చిత్రాల ప్రసారహక్కులు కొనటం ద్వారా మార్కెట్ లో చురుగ్గా ప్రవేశిస్తున్న సంకేతాలు వెలువడ్డాయి. మరికొన్ని రాబోయే చిత్రాల హక్కులకు సైతం బేరసారాలు సాగుతున్నాయి. చానల్ కొనుగోలు చేయటానికి అవకాశం లేకపోవటంతో సొంతగా చానల్ ప్రారంభించాల్సి వచ్చినట్టు జీ మేనేజింగ్ దైరెక్టర్ పునీత్ గొయెంకా వెల్లడించారు.

మలయాళీ చానల్ బాధ్యతలు చేపట్టిన దీప్తి శివన్ గతంలో రేడియో, టీవీ, సినిమా రంగాల్లో దాదాపు 20 ఏళ్లపాటు పనిచేశారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలైన తరువాత ఎంట్రప్రెన్యూర్ షిప్ లో ఎంబీయే చదివారామె. జీ గ్రూప్ లోకి రావటానికి ముందు ఆమె ట్రైపాడ్ ఎంటర్టైన్మెంట్ లోను, సన్ టీవీ నెట్ వర్క్ లో సూర్య టీవీ బాధ్యురాలిగాను, రెడ్ ఎఫ్ ఎం లోను పనిచేశారు.