• Home »
  • Entertainment »
  • రాజ్యసభ రేసులో జీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర

రాజ్యసభ రేసులో జీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర

భారతదేశపు అత్యంత శక్తిమంతమైన మీడియా యజమానుల్లో ఒకరైన డాక్టర్ సుభాష్ చంద్ర రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. జీ వ్యవస్థాపకునిగా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ గా ప్రసిద్ధుడైన సుభాష్ చంద్ర తన సొంతరాష్ట్రమైన హర్యానా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినప్పటికీ ఆయనకు ఆరెస్సెస్ తో ఉన్న సంబంధాలు అందరికీ తెలిసినవే. అందుకే జూన్ 11 న జరిగే రాజ్యసభ ఎన్నికలలో బిజెపి ఆయనకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.

సుభాష్ చంద్రకు సన్నిహితులైనవారు ఆయన రాజకీయ ప్రవేశం పట్ల ఎంతమాత్రమూ ఆశ్చర్యం వ్యక్తం చేయటం లేదు. 2014 ఎన్నికల సమయంలో తన సొంత పట్టణమైన హిస్సార్ లో ఆయన నేరుగానే ఎన్నికల ప్రచారంలో దిగారు. అందుకు మరోకారణం తన చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ ను దెబ్బకొట్టటం. పరస్పరం చేసుకున్న స్టింగ్ ఆపరేషన్స్, ఆ తరువాత వేసుకున్న కోర్టుకేసులు చూస్తే వాళ్లమధ్య సంబంధాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. అయితే, అదే సమయంలో సుభాష్ చంద్రకు స్వయంగా కూడా రాజకీయాలమీద దృష్టి ఉంది.

ఆయన తన జీవిత చరిత్ర ది జీ ఫాక్టర్ : మై జర్నీ యాజ్ ద రాంగ్ మాన్ ఎట్ ద రైట్ టైమ్  కూడా ఉద్దేశపూర్వకంగా సరైన సమయంలోనే విడుదల చేసినట్టు భావిస్తున్నారు.  ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. జీ గ్రూప్ న్యూస్ చానల్స్ ను, డిఎన్ ఎ పత్రికను నడిపే జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ ( జెడ్ ఎమ్ సి ఎల్ ) డైరెక్టర్ పదవికి, నాన్-ఎగ్జిక్యుటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినప్పుడే ఏదో జరగబోతున్నదని మీడియా వర్గాలు ఊహించాయి. రాజకీయాల్లో చేరటం ఖరారైనట్టేనని తేలిపోయింది.

కొత్త తరానికి బాధ్యతలు అప్పగిస్తూ వీలైనంతవరకూ వ్యాపారానికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తూ వచ్చారాయన. పునీత్ గోయెంకా కు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ ఎండీ, సీఈవో బాధ్యలు అప్పగించగా చిన్నకొడుకు అమిత్ గోయెంకా సంస్థ అంతర్జాతీయ వ్యాపారం చూసుకుంటున్నాడు. సుభాష్ చంద్ర సోదరులు డిష్ టీవీ, ఎస్సెల్ ప్రోపాక్ నడుపుతున్నారు. “వ్యాపారం నుంచి తప్పుకుంటూ కొత్త తరానికి బాధ్యతలు అప్పగిస్తున్న విషయం జనానికి తెలుసు.  ఇప్పుడు సామాజిక సేవలో నిమగ్నం కావాల్సిన సమయం వచ్చింది నాకు” అన్నారాయన.

కాంగ్రెస్ కుప్పకూలిపోతున్న సమయంలో ఎలాగూ పునరుద్ధరణకు అవకాశాలు కనబడకపోతుండగా సుభాష్ చంద్రకు పరిస్థితులు సానుకూలమయ్యాయి. బియ్యం వ్యాపారిగా జీవితం ప్రారంభించిన సుభాష్ చంద్ర ఆ తరువాత ఒక ఎమ్యూజ్ మెంట్ పార్క్ ప్రారంభించటం, ఆ తరువాత టీవీ చానల్స్ తో మీడియాలో ప్రవేశించటం తెలిసిందే. నిజానికి 2014 హర్యానా శాసనసభ ఎన్నికలే సరైన సందర్భం అయి ఉండేది కాని అప్పటికి పూర్తిగా తన రాజకీయ ప్రవేశం మీద ప్రకటన చేసే స్థితిలో లేకపోవటం, జాతీయ స్థాయి రాజకీయాలకు రాజ్యసభ సభ్యత్వమే సరైనదని భావించటం కారణంగా నిర్ణయం వాయిదావేసుకున్నారు. అందులోనూ అనేక న్యూస్ చానల్స్  నడిపే గ్రూప్ యజమానిగా కొంత ముసుగు అవసరమేనని కూడా ఆయన భావించారు.

మీడియా యజమానులు రాజకీయాల్లో ప్రవేశించటం కొత్త కాదు. చాలామంది రాజ్యసభలో ప్రవేశించినవారున్నారు. వ్యాపారంలో చాలా చురుగ్గా ఉండే సుభాష్ చంద్ర తటస్థంగా ఉండటమే మేలని చాలాకాలంగా అనుకుంటూ  వచ్చారు. కొంతమేరకు బిజెపి భావజాలాన్ని ఇష్టపడే మాట నిజమే అయినా తటస్థంగా ఒక పరిశీలకునిగా ఉండటానికే మొగ్గుచూపుతానని చెప్పుకునేవారాయన.