• Home »
  • Entertainment »
  • రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేసిన జీ చైర్మన్ సుభాష్ చంద్ర

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేసిన జీ చైర్మన్ సుభాష్ చంద్ర

జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేశారు. మీడియా రంగంలో రారాజుగా వెలుగొందుతూ వస్తున్న సుభాష్ చంద్ర కొంతకాలంగా రాజకీయాలవైపు మొగ్గు చూపుతుండగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన అధికారికంగా రాజకీయాల్లో తొలి అడుగు వేసినట్టయింది.

మీడియా, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫాక్చరింగ్, రియల్ ఎస్టేట్ తదితర విభిన్నమైన రంగాలకు విస్తరించూ ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన సుభాష్ చంద్ర తన సుదీర్ఘ వ్యాపార ప్రయాణానికి ఇంతటితో తెరదించి దేశానికి తిరిగి ఇచ్చే సరికొత్త ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే ఆయన రాజ్యసభకు పోటీచేసి గెలిచారు.

ఇప్పటివరకూ అనేక దానధర్మాలు చేస్తూ, ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నప్పటికీ నేతుగా పరిపాలనలో పాలుపంచుకోవటం మాత్రం ఆయనకు ఇదే మొదటిసారి. ప్రమాణం చేసిన తరువాత పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ తన 17 వ ఏట నుంచి 65 ఏళ్ళు వచ్చేదాకా ఎంతో వ్యాపారం చూశానని, ఇప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వటానికే ఎంపీ హోదా ఎంచుకున్నానని చెప్పారు. అందరితో తనకున్న సంత్సంబంధాల కారణంగా కీలకమైన అంశాలమీద అందరి మద్దతు కూడగట్టుకోగలనని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంలో  బిజెపి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఆశాజనకంగా ఉన్నాయని, దేశాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తాయన్న నమ్మకముందని చెప్పారు. అయితే, జిఎస్ టి బిల్లు గురించి మాట్లాడుతూ దేశం ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలన్నిటికీ అదొక్కటే సర్వరోగ నివారిణిగా భావించలేమని వ్యాఖ్యానించారు. పన్నుల వ్యవస్థలో ఇతర సంస్కరణలు సైతం మోదీ తీసుకురాగలరని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడే సామాన్యులకు ప్రగతి ఫలాలు అందుతాయని సుభాష చంద్ర వ్యాఖ్యానించారు.

ముందుగా తన దృష్టి హర్యానా అభివృధి మీద పెడతానన్నారు. మొత్తం 90 మంది హర్యానా శాసనసభ్యులను విందుకు ఆహ్వానించి హర్యానా అభివృద్ధి కోసం వాళ్ళేం ఆలోచిస్తున్నారో తెలుసుకొని అప్పుడు సమగ్రమైన విధానాన్ని వెల్లడిస్తానని చెప్పారు. మిగిలినవాళ్ళు పట్టించుకోని అంశాలమీద తాను దృష్టిపెడతానన్నారు. పట్టిందల్లా బంగారమనిపించుకున్న సుభాష్ చంద్రకు రాజకీయాలు కూడా అంతే బాగా కలిసి వస్తాయని ఆయన సన్నిహితులు ఆశిస్తున్నారు.