• Home »
  • BARC »
  • బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ జీ తెలుగు

బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ జీ తెలుగు

జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ గట్టిపోటీ ఉన్న తెలుగు, కన్నడ మార్కెట్లలో బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అందిస్తున్న రేటింగ్స్ కూ, టెలివిజన్ ఆడియెన్స్ మెజర్మెంట్ ( టామ్ ) ఇండియా సంస్థ అందిస్తున్న రేటింగ్స్ కూ పొంతన ఉండటం లేదు. మొదటి రెండు స్థానాల మధ్య విపరీతమైన తేడా ఉండే తమిళ, మలయాళ మార్కెట్ల విషయంలో ర్యాంకులపరంగా ఎలాగూ తేడా ఉండదు కాబట్టి ప్రశ్నించే అవసరం రాకపోవచ్చు. కానీ తెలుగు, కన్నడ మార్కెట్లలో మాత్రం ఈ రెండు సంస్థల రేటింగ్స్ లో ఏది సరైనదనే ప్రశ్న రాకతప్పదు.

తెలుగులో జీ తెలుగుకు నెంబర్ వన్ స్థానమిచ్చి, జెమినీకి రెండో స్థానం, మా టీవీకి మూడో స్థానమిస్తూ బార్క్  తాజా రేటింగ్స్ విడుదల చేసింది. కానీ టామ్ లెక్క ప్రకారమైతే మొదటి స్థానం జెమినీదే. పైగా, జీ తెలుగుకు రెండో స్థానం కూడా లేకుండా, మా టీవీ తరువాత మూడో ర్యాంకు మాత్రమే కట్టబెటింది. దీంతో రేటింగ్స్ మీద ఇప్పటివరకూ ఉన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

కన్నడ చానల్స్ విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. తెలుగులో లాగానే కన్నడంలోనూ నెంబర్ వన్ స్థానం మారిపోయింది. టామ్ రేటింగ్స్ ప్రకారం ఉదయ టీవీ నెంబర్ వన్ కాగా బార్క్ లెక్కప్రకారం కలర్స్ కన్నడకు మొదటి స్థానం దక్కింది. రెండో స్థానంలో జీ కన్నడ ఉండగా, ఉదయ కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

టామ్ ను వ్యతిరేకిస్తూ చానల్ యజమానులు , అడ్వర్టయిజింగ్ ఏజెన్సీల పెట్టుబడితో స్వయంగా ఏర్పాటుచేసుకున్న బార్క్ ఏ ఒక్క సంస్థకూ పనిగట్టుకొని సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం గాని, అవకాశంగాని లేవని ముందే అందరూ నిర్థారించుకున్నారు. మరోవైపు టామ్ ఇప్పటిదాకా చెబుతున్న వాటిలో నిజం లేదన్న కారణంగానే కొత్త సంస్థ పుట్టుకొచ్చింది. దీంతో టామ్ విశ్వసనీయత ఇప్పుడు మరింత ప్రశ్నార్థకంగా తయారైంది.

బార్క్ పట్ల చానల్స్ లో భేదాభిప్రాయాలు కల్పించటనికే టామ్ ప్రయత్నిస్తున్నదని, కొన్ని చానల్స్ కు కావాలని ఎకువ రేటింగ్స్ కట్టబెట్టటం ద్వారా బార్క్ ని ప్రశ్నించేట్టు చేస్తున్నదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే, లెక్కింపు విధానంలో మార్పు వల్లనే ఇలా జరుగుతున్నదని, గ్రామీణ ప్రేక్షకులను కూడా లెక్కలోకి తీసుకుంటున్న బార్క్ మాత్రమే నిలబడుతుందని అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు భావిస్తున్నాయి.

ఇలా ఉండగా, రెండు రేటింగ్స్ సంస్థలకు చందా కట్టటం ఇష్టంలేక ఇపుడిప్పుడే కొన్ని సంస్థలు టామ్ కు చందా ఉపసంహరించుకుంటూ నోటీసులు పంపుతున్నాయి. అలాంటి సంస్థలమీద పనిగట్టుకొని అక్కసు వెళ్ళగక్కుతూ రేటింగ్స్ తగ్గిస్తున్నదంటూ టామ్ మీద విమర్శలు మొదలయ్యాయి. దీంతో కొంతకాలం పాటు ఈ రేటింగ్స్ ను ప్రామాణికంగా తీసుకోవటానికి వీల్లేదనే వాదన కూడా వినబడుతోంది.